ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల్లో షాక్ ఇచ్చిన రెబల్స్ !
అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా చెల్లుతుందని భావించి పంచాయతీ ఎన్నికల్లో బోల్తా పడ్డారు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. టైమ్ చూసుకుని కేడర్ తిరుగుబాటు జెండా ఎగరేస్తే.. మరికొన్నిచోట్ల వైసీపీలోని కుమ్ములాటలు ప్రత్యర్థులకు కలిసొచ్చాయి. చివరకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయ్యేలా చేశాయి ఫలితాలు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
అదను చూసి ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించిన కేడర్!
ఇన్నాళ్లూ ఎమ్మెల్యే ఎప్పుడు కరుణిస్తారా అని ఎదురు చూసిన కేడర్.. పంచాయతీ ఎన్నికల సమయంలో ప్లేట్ తిప్పేసింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాజైతే.. గ్రామాలకు మాకు మేమే రాజు.. మేమే మంత్రి అన్నట్టుగా పావులు కదిపారు కొందరు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి సిత్రాలు చాలానే ఉన్నాయి. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అదను చూసి చుక్కలు చూపించారు రెబల్స్. తదుపరి దశల పల్లెపోరులోనూ అదే పరిస్థితి.
రెబల్స్ గెలిచినా మనవాళ్లే కదా అని సంతృప్తి చెందుతున్నారా?
ప్రకాశం జిల్లాలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లతోపాటు దర్శి, కనిగిరి, గిద్దలూరు, కందుకూరు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. జిల్లాలోని 1018 పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుంటే.. తొలి రెండు దశల్లో మంత్రి బాలినేని, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు దడపుట్టించారు రెబెల్స్. గ్రామాల్లోనే అధికారపార్టీ రెండుగా చీలిపోయింది. కేడర్‌కు సర్దిచెప్పలేక చేతులు ఎత్తేయడంతో..కొన్నిచోట్ల రెబల్సే విజయఢంకా మోగించారు. దాంతో గెలిచినవాళ్లూ మనవాళ్లే కదా అని సంతృప్తి చెందాల్సిన పరిస్థితి ఉంది. మూడు, నాలుగు దశల ఎన్నికలు జరిగే పంచాయతీలలోనూ రెబెల్స్ మాట వినలేదట. వీరిని చూసి మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కేడర్ మరింతగా తోక జాడించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారట.
కోడుమూరులో వైసీపీ నేతల గొడవలో లాభపడిన టీడీపీ!
కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్, నియోజకవర్గ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి మధ్య విభేదాలు శ్రుతిమించడంతో.. ఆ ప్రభావం పంచాయతీ ఎన్నికలపై పడింది. వీరి మధ్య గొడవలను ఇక్కడి టీడీపీ నేతలు అనుకూలంగా మలుచుకున్నారట. నియోజకవర్గంలోని 62 పంచాయతీ ఎన్నికలు జరిగితే వైసీపీ 33 చోట్లే గెలుపొందింది. 19 చోట్ల టీడీపీ, 10 పంచాయతీలతో ఇతరులు విజయం సాధించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యే సుధాకర్, ఇంఛార్జ్ హర్షవర్దన్‌రెడ్డి మధ్య సయోధ్యకు విఫలయత్నం చేశారు. చివరకు కోడుమూరు మేజర్ పంచాయతీ సైతం టీడీపీ ఖాతాలో పడింది.
రెబల్స్‌పై వేటు వేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి!
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికే షాక్ ఇచ్చారు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాయకులు. ఎమ్మెల్యే వద్దని వారించినా చాలా మంది పాత తెలుగు తమ్ముళ్లు నామినేషన్లు వేసేశారు. ఇలాంటి పరిస్థితి మదనపల్లె, తంబళ్లపల్లె, జీడీ నెల్లూరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోనూ ఉన్నా.. చంద్రగిరిలో మాత్రం చర్యలు తీసుకునే వరకు వెళ్లింది సమస్య. టీడీపీలో జడ్పీటీసీగా కొనసాగిన ఐతేపల్లికి చెందిన రమణమూర్తి, సరితా దంపతులు, వారి బంధువు ఏసీ శేఖర్లు ఎమ్మెల్యే చెవిరెడ్డిని ధిక్కరించారట. ఒకప్పుడు గల్లా అరుణకుమారికి అనుచరుడిగా ఉన్న బండి సుధా యాదవ్ కూడా అదే లైన్లో వెళ్లారట. దీంతో ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చి.. ఎదురుతిరిగిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
వైసీపీ కేడర్ ఆనాడే హెచ్చరించిందా?
టీడీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకోవద్దని స్థానిక వైసీపీ కేడర్ వారించినా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. రేపటి రోజున పంచాయతీ ఎన్నికల్లో మాట వినకపోతే ఏం చేస్తామని హెచ్చరించారట. ఇప్పుడు అదే జరగడంతో పాత విషయాలను గుర్తు చేస్తూ ఓపెన్‌గానే కామెంట్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఉదంతాలను ప్రస్తావిస్తూ కథలు కథలుగా చెప్పుకొంటోంది వైసీపీ కేడర్. అందుకే పంచాయతీ పోరు ముగిసిన తర్వాత పల్లె రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)