ఈశ్వరరావు ... కొన్ని జ్ఞాపకాలు...

ఈశ్వరరావు ... కొన్ని జ్ఞాపకాలు...

ఈశ్వరరావు ... కొన్ని జ్ఞాపకాలు...నటుడు ఈశ్వరరావు ఈ తరం వారికి అసలు తెలియకపోవచ్చు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన 'స్వర్గం-నరకం' చిత్రంతో ఓ హీరోగా పరిచయమయ్యారు ఈశ్వరరావు. ప్రధాన కథ అతని పాత్ర చుట్టూ తిరుగుతుంది. అదే చిత్రం ద్వారా మోహన్ బాబు కూడా పరిచయం అయ్యారు. అందులో నెగటివ్ షేడ్స్ రోల్ లో కనిపించి, తరువాత పరివర్తన చెందే పాత్రలో మోహన్ బాబు కనిపించారు. ఆ తరువాత కూడా ఈశ్వరరావు, మోహన్ బాబు ఇద్దరూ దాసరి నారాయణరావు చిత్రాలలోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చారు. చిత్రంగా మోహన్ బాబు అనూహ్యమైన స్టార్ డమ్ చూశారు. ఈశ్వరరావు కొన్ని చిత్రాలకే పరిమితమై తరువాత చిత్రసీమకు దూరంగా ఉన్నారు. అందుకే అంటారు- గుమ్మడికాయంత ప్రతిభ కన్నా, ఆవగింజంత అదృష్టముంటేనే చిత్రసీమలో రాణించగలరు- అని. 'స్వర్గం-నరకం' చిత్రంలో కొత్త జంటలను పరిచయం చేశారు దాసరి. అందులో ఈశ్వరరావుకు జోడీగా నటించిన ఫటాఫట్ జయలక్ష్మి అర్ధాంతరంగా తనువు చాలించారు. ఇక మోహన్ బాబు భార్యగా నటించిన అన్నపూర్ణ ఈ నాటికీ నటిస్తూనే ఉన్నారు.

అంతకు ముందు... 

ఇలా చిత్రసీమలో చిత్రవిచిత్రాలు సాగడం కొత్తేమీ కాదు. అంతకు ముందు ఆదుర్తి సుబ్బారావు కూడా 'తేనెమనసులు' (1965)లో కొత్త జంటలను పరిచయం చేశారు. అందులో కృష్ణ-సుకన్య ఓ జంట కాగా, మరో జోడీగా రామ్మోహన్ -సంధ్యారాణి నటించారు. వారిలో కృష్ణ తరువాతి రోజుల్లో టాప్ స్టార్ గా నిలిచారు. సంధ్యారాణి కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. రామ్మోహన్ కొన్ని సినిమాలలో కనిపించినా, ఆ తరువాత కీలక పాత్రల్లో కనిపించలేదనే చెప్పాలి. మరో విశేషమేంటంటే, 'తేనెమనసులు' స్ఫూర్తితోనే దాసరి నారాయణరావు కొత్తవారిని పరిచయం చేస్తూ 'స్వర్గం-నరకం' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఆదుర్తి సుబ్బారావుకే అంకితం చేయడం విశేషం!

తరువాతి రోజుల్లో దాసరి నారాయణరావు మరోసారి కొత్తవారిని ప్రధాన పాత్రల్లో నటింపచేస్తూ 'స్వప్న' చిత్రం రూపొందించారు. ఆ చిత్రం ద్వారా రాజా, రాంజీ ను హీరోలుగా, స్వప్న, రీనాను హీరోయిన్లుగా పరిచయం చేశారు. అందులో కూడా రాజా తరువాతి రోజుల్లో కొన్ని సినిమాల్లో హీరోగా అలరించారు. తరువాత బుల్లితెరపై సూపర్ స్టార్ గా రాణించారు. స్వప్న కొన్ని చిత్రాలలో నాయికగానూ, మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లోనూ నటించారు. ఇలా ఎందుకనో ఇద్దరు హీరోలను పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రాలలో ఒక్కరే విజయం సాధించడం, మిగతావారు అంతగా గుర్తింపు సంపాదించలేకపోవడం జరిగాయి.

ఆ ముగ్గురు... 

ఇక ఈశ్వరరావు విషయానికి వస్తే, దాసరి తెరకెక్కించిన "ఓ మనిషి తిరిగిచూడు, పాడవోయి భారతీయుడా, ప్రేమాభిషేకం" వంటి చిత్రాలలో నటించారు. "బొమ్మరిల్లు, జయం మనదే, చిన్నకోడలు" మొదలైన సినిమాలలో కీలక పాత్రలు పోషించినా, ఎందుకనో బిజీ కాలేకపోయారు. ఈశ్వరరావు, రామ్మోహన్, రాంజీ ఈ ముగ్గురూ అంతగా సక్సెస్ కాలేకపోవడానికి వారిలో కలుపుగోలు తనం లేకపోవడమే కారణమని కొందరంటారు. వారు కొన్ని పాత్రలకే పనికివస్తారని, అలాంటివి వారి దరికి అప్పట్లోనే చేరాయని మరికొందరి మాట. మరో విశేషమేమంటే, 'స్వర్గం-నరకం'లో కథలో ఎక్కువ భాగం ఈశ్వరరావు చుట్టూ తిరుగుతుంది. అలాగే 'తేనెమనసులు'లోనూ రామ్మోహన్ పాత్రపైనే కథ సాగుతుంది. కానీ, వీరిద్దరూ ఏ రోజూనా అగ్రపథం చేరుకోకపోవడం గమనార్హం!

అందరూ అలా కాదు...

కానీ, ఆరంభంలో సైడ్ రోల్ లో కనిపించిన యన్.టి.రామారావు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడయ్యారు. బిట్ రోల్స్ లో కనిపించి, తరువాత కీలక పాత్రలు పోషించిన మోహన్ బాబు నటప్రపూర్ణగా నిలిచారు. చిన్న పాత్రలతోనే తొలుత కనిపించిన చిరంజీవి, తరువాతి రోజుల్లో మెగాస్టార్ గా ఎదిగారు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్, రవితేజ వంటివారు కూడా అదే తీరున తారాపథం చేరుకున్నారు. దీనిని బట్టి తెలిసేదేమంటే, తమకు లభించిన పాత్రలలోనే వైవిధ్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించిన వారందరూ చిత్రసీమలో రాణిస్తారనే చెప్పాలి. అప్పుడు ఇద్దరు హీరోలలో ఒకరిగా కాదు, మన చుట్టూ ఎంతమంది ఉన్నా, గుర్తింపు సంపాదించవచ్చు. ఏమంటారు!?

(ఏప్రిల్ 19న ఈశ్వరరావు పుట్టినరోజు)