ఏబీ వెంకటేశ్వర్ రావు దగ్గర ఆధారాలున్నాయా? సుప్రీం ఏం తీర్పునిస్తుంది?

ఏబీ వెంకటేశ్వర్ రావు దగ్గర ఆధారాలున్నాయా? సుప్రీం ఏం తీర్పునిస్తుంది?

ఏపీలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన సస్పెన్షన్‌ ఇష్యూ ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఆయన చేస్తున్న ఆరోపణలు మరో ఎత్తు.  ఏకంగా తనను ఇరికించేందుకు కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఏబీ. పైగా తన దగ్గర ఆధారాలు  కూడా ఉన్నాయంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు ఏబీ. అదే విషయంపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేయడంతో.. ఆయన న్యాయపోరాటానికి దిగారు.  సుప్రీం ఆదేశాలతో 14 రోజుల పాటు వరుసగా కమిషనరాఫ్ ఎంక్వైరీస్ ముందు హాజరయ్యారు ఏబీ వెంకటేశ్వరరావు. ఈ విచారణలో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు కూడా సుమారు 21 మంది పోలీసు ఉన్నతాధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఎట్టకేలకు ఇటు ప్రభుత్వ వాదనలతోపాటు.. ఏబీ వెంకటేశ్వరరావు వాదనలు ముగిశాయి. ప్రస్తుతం కమిషనరాఫ్ ఎంక్వైరీస్ తన నివేదిక ఇవ్వడం మాత్రమే మిగిలి ఉంది. ఆ నివేదికను కమిషనరాఫ్ ఎంక్వైరీస్ సుప్రీం కోర్టుకు నివేదిస్తారు.. సుప్రీం కోర్టు తీర్పు చెబుతోంది. ఇదంతా కొన్ని రోజుల్లో జరిగే పరిణామం. అయితే విచారణలో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు లేవనెత్తిన కొన్నిఅంశాలు.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనను ఇరికించేందుకు కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు.

కృత్రిమ డాక్యుమెంట్లు ఏవి ? ఎవరు సృష్టించారు..? వాటిని సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఏబీ వెంకటేశ్వరరావు కావాలనే ఆరోపణలు చేశారా..? లేక నిజంగా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా..? అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏబీ వెంకటేశ్వరరావు కామెంట్లు చేసిన తీరు చూస్తుంటే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీదనే సదురు ఆరోపణలు చేశారనే భావన వ్యక్తమవుతోంది. అయితే డీజీపీ స్థానంలో ఉన్న వ్యక్తికి  కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ జరుగుతోంది. మరి డీజీపీ కాకుంటే ఇంకెవరు కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించి ఉంటారనే చర్చా జరుగుతోంది.

ఇప్పటికే దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీ వెంకటేశ్వరరావు తన వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారని కామెంట్లు చేస్తారా..? అనేది మరో చర్చ. ఒక వేళ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్టు నిజంగానే కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారనే అంశం నిరూపితమైతే.. అసలు విషయం పక్కకు పోయి.. కొత్త అంశం తెరపైకి వస్తుందని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఈ మొత్తం ఎపిసోడ్ చర్చకు వచ్చే ప్రమాదం లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది.

ఇదే సమయంలో మరో చర్చా జరగుతోంది. తన మీద ఆరోపణలతో సంబంధం ఉన్న 21 మంది పోలీస్ ఉన్నతాధికారులను స్వయంగా ఏబీ వెంకటేశ్వరరావు క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు.  వీరిలో ఎవరెవరు.. ఏమేం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది. విచారణకు వచ్చిన రిటైర్ అయిన మాలకొండయ్య, నండూరి సాంబశివరావు వంటి వారు ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి సర్టిఫికెట్ ఇచ్చారు..? ప్రస్తుతం సర్వీసులో ఉన్న అధికారులు ఏం చెప్పారనేది కూడా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా.. అనేక మలుపులు తిరిగిన ఏబీ వెంకటేశ్వరరావు కేసు వ్యవహరం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. విచారణ నివేదికపై సుప్రీం ఏం తీర్పునిస్తుంది ? సుప్రీం తీర్పు వచ్చాక.. ఆ పరిణామాలు ఇంకెన్ని ఆసక్తికరమైన వ్యవహరాలకు దారి తీస్తుందోననే చర్చ జరుగుతోంది.