పెళ్లి పీటల మీద వరుడి పరువు తీసిన వధువు.. ప్రియుడిని రంగంలోకి దింపి !

పెళ్లి పీటల మీద వరుడి పరువు తీసిన వధువు.. ప్రియుడిని రంగంలోకి దింపి !

తాళికట్టు శుభవేళ రానేవచ్చింది...మెడలో కల్యాణ మాల వేసే ఘడియలు సమీపించాయ్‌. మేళాలు తాళాలు మోగుతున్నాయ్‌. పెళ్లి పందిరి మొత్తం ఎంతో సందడిగా ఉంది. అటు వధువు... ఇటు వరుడు ముస్తాబు అవుతున్నారు. మరో గంటలో తంతు పూర్తవుతుందనగా.. ఊహించని సంఘటన..! నాకీ పెళ్లి వద్దంటూ మొండికేసింది పెళ్లి కూతురు. వివాహం ఇష్టం లేదంటూ భీష్మించుకొని కూర్చుంది. పెద్దవాళ్లకు ఏం చేయాలో తెలీలేదు. ఇంతలోనే ప్రియుడిని కూడా రంగంలోకి దింపిందా అమ్మాయి. దీంతో పెళ్లికొడుక్కి గుండె ఆగినంత పనైంది.

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ లో జరిగిన ఈ సంఘటన.. హాట్‌ టాపిక్‌గా మారింది. వెంటనే లవర్‌తో కలిసి ఆ అమ్మాయి పోలీసుల వద్దకు వెళ్లింది. ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారని కంప్లైంట్‌ ఇచ్చింది. దీంతో పోలీసులు మండపానికి వచ్చి పెద్దలతో మాట్లాడారు. తర్వాత MRO సమక్షంలో అమ్మాయిని ప్రియుడితో చెన్నైకి పంపారు. ఇంతవరకు బాగానే ఉన్నా... పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయేసరికి... ఇదేం ఖర్మరా నాయనా అంటూ పెళ్లికొడుకు నెత్తీ నోరూ బాదుకున్నాడు. ముందే చెప్పొచ్చు కదా... ఆఖరి నిమిషంలో ఈ ట్విస్ట్‌ ఏంటని తిట్టుకున్నాడు. బంధువులందరిలో పరువు తీసిందని గగ్గోలు పెడుతున్నాడు.

వివరాల్లోకి వెళితే కడపకు చెందిన భావన... చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తన ఆఫీసులోనే పనిచేస్తున్న చెన్నైకి చెందిన ఆకాష్‌తో ప్రేమాయణం సాగించింది. అయితే తల్లిదండ్రులకు ఆమె ఈ విషయం చెప్పలేదు. ప్రేమ విషయం చెబితే ఏమంటారో అనే భయంతో వాళ్ళు చూసిన పెళ్లి సంబంధానికి అంగీకరించింది. గుర్రంకొండ కు చెందిన ఓ ఉద్యోగితో వివాహం కుదిరింది. పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ముందురోజు రాత్రి అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ కూడా పెట్టారు. 8 వందల మంది దాకా బంధు మిత్రులంతా కల్యాణ మండపానికి వచ్చారు. అయితే అర్ధరాత్రి రెండు గంటలకు పోలీసుల రంగ ప్రవేశంతో సీన్‌ మారిపోయింది. భావన ప్రియుడు తమిళనాడు పోలీసులకు, అక్కడి నుంచి కడప పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై సమాచారం అందడంతో స్థానిక హెడ్‌ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా పోలీసులను వెంటేసుకుని కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఇరుపక్షాల వారికి విషయం చెప్పారు. వధువును ప్రశ్నించడంతో తనకు పెళ్లి ఇష్టం లేదని ప్పింది. ఉదయం 8 గంటల వరకు మాట్లాడినా పెళ్లి చేసుకునేందుకు ఆమె ఒప్పుకోలేదు. తనకు ప్రియుడే కావాలని... అతనితోనే జీవితం పంచుకుంటానని కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది. అప్పటికి గానీ పెళ్లికొడుక్కి మ్యాటర్‌ క్లియర్‌గా అర్ధం కాలేదు. తర్వాత కల్యాణ మండపం నుంచి వరుడితో పాటు బంధువులు వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మార్వో వచ్చి ... అమ్మాయి వాంగ్మూలం తీసుకుని పేరెంట్స్‌కు అప్పగించారు. నాటకీయ పరిణామాల మధ్య పేరెంట్స్, ప్రియుడితో కలిసి కడపకు పంపారు.