తెలంగాణ కాంగ్రెస్‌లో గోడ దూకే నేతలు ఎవరు...?

తెలంగాణ కాంగ్రెస్‌లో గోడ దూకే నేతలు ఎవరు...?

తెలంగాణ కాంగ్రెస్‌లో గోడ దూకేందుకు చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారా? హడావిడిగా కండువా మార్చేస్తున్నవారి లెక్కలేంటి? GHMC ఎన్నికలయ్యే వరకు వేచి చూద్దామని భావిస్తున్నవారు ఎవరు? లెట్స్‌ వాచ్‌!

గ్రేటర్‌ ఎన్నికల సమయంలో జంప్‌ జిలానీలు!

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన నాయకులు.. అధికారం అటు ఇటు కాగానే జెండా మార్చేస్తుంటారు. గడిచిన ఆరేళ్లలో తెలంగాణలో ఇదే తంతు నడుస్తుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల సమయంలో మళ్లీ జంప్ జిలానీలకు గిరాకీ పెరిగింది. 

కాంగ్రెస్‌ నాయకులపై బీజేపీ ఫోకస్‌!

ఇన్నాళ్లు టీఆర్ఎస్ బాట పట్టిన నాయకులు.. ఇప్పుడు కాషాయం జెండా పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. శేరిలింగంపల్లి నుంచి భిక్షపతి యాదవ్.. ఆయన కుమారుడు బీజేపీ నీడకు చేరిపోయారు. ఇలా కాంగ్రెస్‌లో సీనియర్లు.. కాస్త బలమైన క్యాడర్ ఉన్న వారిని లాగే పనిలో పడింది బీజేపీ. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు మొదలుకుని.. నియోజకవర్గ ఇంఛార్జ్‌ల వరకు ఎవరిని వదలకుండా వరస పెట్టి సంప్రదింపులు జరుపుతున్నారు కమలనాథులు. 

టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీకి బీజేపీ గాలం!

మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా బీజేపీ టచ్‌ చేసింది. GHMC ఎన్నికల ఇంఛార్జ్‌గా వచ్చిన భూపేందర్ యాదవ్ ఆయనతో సమావేశం అయ్యారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ వర్గాల్లోనూ కలవరం రేపింది. విశ్వేశ్వర్‌రెడ్డి ఉద్యమ సయయంలో టీఆర్‌ఎస్‌లో చేరి తర్వాత చేవెళ్ల నుంచి ఎంపీ అయ్యారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. టీఆర్‌ఎస్‌లో ఓ నేతతో వచ్చిన చిన్న గ్యాప్‌ కారణంగా అధికార పార్టీకి గుడ్‌బై చెప్పేశారాయన. 

సమయానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటానని కొండా వెల్లడి!

2019 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు విశ్వేశ్వర్‌రెడ్డి. అయినా కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటున్నారాయన. అలాంటి విశ్వేశ్వర్‌రెడ్డిపై ఫోకస్‌ పెట్టింది బీజేపీ. దుబ్బాకలో గెలుపు తర్వాత జోష్‌మీద ఉన్న కమలనాథులు.. GHMC ఎన్నికల సమయంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీశారు. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కాషాయం గేలానికి తగిలారు. విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం ఇంకా ఎటూ తేల్చలేదు.  సయమం సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని తనతో మాట్లాడిన బీజేపీ నేత భూపేందర్‌ యాదవ్‌కు చెప్పేశారట. బీజేపీలో చేరతానో లేదో తేల్చలేదని సమాచారం. 

కొండా ప్రకటనపై గందరగోళం నెలకొందా? 

బీజేపీ నాయకత్వంతో కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా పార్టీ మారటం అనేది ఆయనకు పెద్ద ఇబ్బందేమీ కాదు. కాకపోతే కాంగ్రెస్‌లో చేరే సమయంలో టీఆర్ఎస్ మీద పోరాటం చేయటానికే వస్తున్నా అని ప్రకటన చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ మీద పోరాటం చేయటం కాంగ్రెస్ వల్ల కాకుంటే మరో వేదికను ఎంచుకుంటారా..? లేదంటే కాంగ్రెస్‌లోనే ఉంటూ.... బీజేపీతో ఉన్న సంబంధాలను ఉపయోగిస్తూ టీఆర్ఎస్‌పై ఫైట్ చేస్తారా..? అనే గందరగోళం మాత్రం ఉందట.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత చూద్దామనే ఆలోచనలో మరికొందరు!

బీజేపీలో చేరికలు అనేవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. అయితే దుబ్బాక ఫలితాల తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌ మొత్తం బీజేపీ పాగా వేస్తుందా.. లేదా అన్నదానిపై చర్చ జరుగుతోందట. పైగా నేతల వలస కాంగ్రెస్‌కు కొత్తేమీ కాకపోయినా.. నాయకుల లెక్క మరోలా ఉందట. ఆలస్యం చేస్తే తర్వాత బీజేపీలో సరైన ప్రాధాన్యం లభిస్తుందో లేదో అని కొందరు కాషాయ కండువా కప్పుకోవడానికి తొందర పడుతున్నారట. GHMC ఎన్నికల్లో బీజేపీ సత్తా చూద్దాం..! ఆ తర్వాతే చేరదాం అని నెమ్మదిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి  గోడ దూకేందుకు కూడా కాంగ్రెస్‌ నాయకులకో లెక్క ఉందనే చర్చ జోరందుకుంది. మరి.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రెండో కోవలోకే వస్తారేమో చూడాలి.