షర్మిలపై విమర్శలకు ఆమె ఎలా సమాధానం చెబుతారు?

షర్మిలపై విమర్శలకు ఆమె ఎలా సమాధానం చెబుతారు?

తెలంగాణలో ఏపీ నేతల పెత్తనం సహించం. అక్కడి నేతల ఆధిపత్యాన్ని ఒప్పుకోం. ఇది వైఎస్‌ షర్మిల పార్టీ ప్రస్థావన రాగానే తెలంగాణ రాజకీయ నేతల నుంచి వస్తున్న ప్రతిస్పందన. వీటిని ఎదుర్కొని.. తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముందస్తు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు షర్మిల. ఇంతకీ తనపై వచ్చే విమర్శలకు ఆమె ఎలా సమాధానం చెప్పబోతున్నారు ?

తెలంగాణ రాజకీయాల్లోకి త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల.. పార్టీ కోసం కసరత్తు చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్సార్‌ అభిమానులతో సమావేశమవుతున్నారు. అయితే షర్మిల తొలి సమావేశం నిర్వహించిన రోజు నుంచే.. ఆమెపై విమర్శల దాడి ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయాల్లో పక్కరాష్ట్రాల వారి అవసరం లేదని అధికారపార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నేతలు కూడా అదే లైన్‌లో మాట్లాడారు. ఈ విమర్శలన్నింటిపై.. సమాధానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు వైఎస్‌ షర్మిల.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల అండతో తెలంగాణలో పార్టీని నెలకొల్పాలని భావిస్తున్న వైఎస్ షర్మిలకు ఆంధ్రా కార్డు ఆటంకంగా మారింది. తెలంగాణలో ఆంధ్రా ఆధిపత్యాన్ని స్థాపించడానికి షర్మిలను ముందు పెడుతున్నారని గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వాదనకు బలం చేకూరితే షర్మిల పార్టీ తెలంగాణలో ముందుకు పోవడం కష్టమే అవుతుంది. తెలంగాణ సెంటిమెంట్ వ్యతిరేకంగా పనిచేస్తే షర్మిలకు రాజకీయాలు చేయడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో షర్మిల.. తెలంగాణలోని బంధుత్వాన్ని వాడడానికి సిద్ధమయ్యారు. తన భర్త, అత్తామామలది తెలంగాణే.. మెట్టినింట్లో కోడలికి హక్కులుండవా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోడలిగా ఇక్కడ రాజకీయాలు చేసే హక్కు ఉందని వైఎస్ షర్మిల అంటున్నారు.

షర్మిల ప్రస్తుతం తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలవారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల అంటున్నారు. దీంతో పాటు వైఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునుంటున్నారు. అందుకోసం పలు ప్రశ్నలతో కూడిన పేపర్లు అభిమానులకు ఇచ్చి.. వారి స్పందనలు  తీసుకుంటున్నారు.  పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించే ముందే తెలంగాణ కోడలు హోదాతోనే జనంలోకి వెళ్లాలని షర్మిల నిర్ణయించారు. అందులో భాగంగా షర్మిలను కలిసిన వారందరికీ తాను ఇక్కడి కోడలినే అంటూ చెప్పుకుంటున్నారు. మరి షర్మిల కోడలు సెంటిమెంట్.. ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.