వికారాబాద్ జిల్లాలో తెరాస నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందా..?

వికారాబాద్ జిల్లాలో తెరాస నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందా..?

ఆ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య పట్టువిడుపుల్లేవ్‌! ఆధిపత్యపోరుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వర్గాలుగా విడిపోయిన నేతలు.. పైచెయ్యి సాధించేందుకు  చేస్తున్న  పనులే చర్చకు దారితీస్తున్నాయి. ఇదే అక్కడి రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇంతకీ ఎవరా నాయకులు? 

మెతుకు ఆనంద్‌ వర్సెస్‌ వికారాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌!

వికారాబాద్‌ జిల్లా టీఆర్ఎస్ నేతల గ్రూప్ రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలుగా రాజకీయాలు ఉంటే.. మరోవైపు ఎమ్మెల్యేలు వర్సెస్ మున్సిపల్ చైర్మన్లు.. ఎమ్మెల్యేలు వర్సెస్ కౌన్సిలర్లు అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఇటీవల జిల్లాలోని మున్సిపాలిటీలలో జరిగిన సంఘటనలే దీనికి నిదర్శనం. వికారాబాద్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, ఛైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందట. ఆ మధ్య జరిగిన కౌన్సిల్‌ మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లతోపాటు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు రాలేదు. కౌన్సిల్‌ అజెండాలో లేఅవుట్‌ అంశం చేర్చకపోవడంతో అంతా కలిసి గైర్హాజరైనట్టు చెబుతున్నారు. ఛైర్‌పర్సన్‌కు, ఎమ్మెల్యేకు మధ్య కోల్డ్‌వార్‌ కారణంగానే మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 

తాండూరులో రోహిత్‌రెడ్డి వర్సెస్‌ మహేందర్‌రెడ్డి!

జిల్లాలోని మరో మున్సిపాలిటీ తాండూరులో కూడా పరిస్థితి ఇలానే ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న దొంగ ఓటు వేశారని ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ సమావేశానికి హాజరైన కలెక్టర్ పౌసుమి బసు వాహనానికి కౌన్సిలర్లు అడ్డుతగిలి చైర్‌పర్సన్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. తాటికొండ స్వప్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం కావడంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు, విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారని చెబుతున్నారు. ఆ తర్వాత మున్సిపల్ సమావేశం జరుగకుండా పదేపదే కౌన్సిలర్లు అడ్డు తగిలారు. 

మంత్రి సబిత దగ్గరకు పంచాయితీ!

ఎమ్మెల్యే వర్సెస్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గొడవ మంత్రి సబితాఇంద్రారెడ్డి వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయనడానికి తాజా కౌన్సిల్‌ సమావేశంలో జరిగిన ఉదంతాలను వెల్లడించారట. మరి.. జిల్లాలోని రెండు పురపాలక సంఘాల్లో నెలకొన్న ఆధిపత్య పోరుకు మంత్రి సబితా చెక్ పెడతారా? లేక మనకెందుకులే అని మిన్నకుండి పోతారో చూడాలి.