దివ్య కేసులో తప్పెవరిది ?

 దివ్య కేసులో తప్పెవరిది ?


దివ్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె తల్లిదండ్రులేమో నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలంటున్నారు. నిందితుడేమో తామిద్దరం పెళ్లి చేసుకున్నామంటున్నాడు. ఇద్దరమూ చనిపోవాలనుకున్నట్లు చెబుతున్నాడు. దివ్య ఆడియోలేమో..మరోలా ఉన్నాయి. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు చూస్తే ఇంకో అర్థమొచ్చేలా ఉంది. వీటన్నింటి మధ్య ఎవరు చెప్పేది నిజం.. అసలు ఏది వాస్తవం.. ఇంతకీ తప్పెవరిది.. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన దివ్య హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దివ్యను తాను హత్య చేయలేదని.. ఇద్దరం ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో నిందితుడు నాగేంద్రబాబు చెప్పాడు.  

తాజాగా ఈ కేసులో మరో విషయం వెలుగు చూసింది. మృతురాలు దివ్య, నిందితుడు నాగేంద్రబాబుకు ఇది వరకే వివాహం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్‌ సమయంలో రహస్య ప్రేమ పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. వీరి ప్రేమ వివాహాన్ని దివ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు దివ్య నాగేంద్రకు గత కొంతకాలంగా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అతను ఆమెపై దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు దివ్య తల్లిదండ్రులను విచారిస్తున్నారు.

ఈ కేసును మాచవరం పోలీసుస్టేషన్‌ నుంచి విజయవాడ దిశ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. చర్చిలో తమ పెళ్లయిందని నాగేంద్రబాబు చెప్పడంతో అక్కడికో బృందాన్ని, భీమవరంలో తేజస్విని ఇంజినీరింగ్‌ చదువుతున్న కళాశాలకు ఓ బృందాన్ని పంపించారు. తేజస్విని పోస్టుమార్టం నివేదిక వచ్చాక కేసులో పురోగతి కనిపించనుందని పోలీసులు భావిస్తు న్నారు. దాడికి పాల్పడిన ఆయుధం పరిమాణాన్ని చూశాకే కత్తిపోట్ల తీరు విశ్లేషించి తుది నివేదిక అందజేస్తామని వైద్య వర్గాలు చెబుతున్నాయి. తేజస్విని, నాగేంద్రబాబుల సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లోని వాట్సప్‌ సందేశాలు, సంభాషణల్ని విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న తేజస్విని చివరిసారిగా నాగేంద్రబాబుకు కాల్‌ చేయగా, ఏప్రిల్‌ 2న నాగేంద్రబాబు తేజస్వినికి చివరిసారిగా కాల్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే నిందితుడు హత్య కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని దివ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు నాటకాలు అడుతున్నాడని అంటున్నారు. నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దివ్య సోదరుడు కూడా ఇదే చెబుతున్నాడు. ఎవరేమన్నా.. ప్రేమ పేరుతో మోసగాళ్లు మొదట్లో మనతో చాలా సున్నితంగా ఉండి నమ్మిస్తారని... తర్వాత ముసుగులు తొలగించి, వారి సైకోయిజాన్ని, విలనిజాన్ని బయటపెడతారని దివ్యనే చెప్పిది. ప్రతి ఒక అమ్మాయి ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సలహా ఇచ్చింది. తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని... అతనిలో తీవ్రస్థాయిలో విలనిజం, సైకోయిజం గుర్తించానని వెల్లడించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అతని నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కూడా వివరించింది. 

మరో వైపు, దివ్య తేజస్విని హత్య కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్రతో దివ్య తేజస్విని మాట్లాడిన ఫోన్‌ కాల్స్‌ లీకయ్యాయి. ఈ ఆడియోలను బట్టి చూస్తే వారిద్దరికీ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా లీకైన ఆడియోలో పెళ్లి విషయం దాచిపెట్టలేక తీవ్ర సంఘర్షణకు గురవుతునట్లు దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకు ముందులా అందరితో కలిసి సంతోషంగా ఉండలేకపోతున్నానని, మానసిక కుంగుబాటుకు గురవుతున్నట్లు నాగేంద్ర వద్ద వాపోయింది. తాను త్వరగా అప్‌సెట్‌ అవుతున్నానని..ఇలా ఎందుకు ఉంటున్నానో తనకు అర్థం కావడం లేదని ఫోన్‌లో విలపించింది. తనకు నాగేంద్రతో పాటు భవిష్యత్‌ కూడా ముఖ్యమేనని చెప్పింది.

తేజస్వినికి చెందిన ఓ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో, మరో ఆడియో ద్వారా మరికొన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. నాగేంద్రతో రెండేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో కొనసాగానని, ఆ తర్వాత నాగేంద్రలోని సైకో గురించి తెలిసిందని అంటోంది. ఓ మహిళ కారణంగా తను మోసపోయానని వీడియోలో చెప్పింది. తాను చేసిన తప్పిదాల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాఅని, తన జీవితం ఎటు పోతుందో కూడా అర్థం కావడంలేదంటూ వాపోయింది. దీన్నిబట్టి దివ్య ఎపిసోడ్‌ను ఎలా చూడాలి.. ఎవరిది తప్పని భావించాలి. 

తాను దివ్య మంగళగిరిలో పెళ్లి చేసుకున్నామని నాగేంద్ర చెబుతున్నాడు. కానీ అందుకు ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. ఇద్దరూ కలిసి ఆత్మహత్య  చేసుకోవాలనుకున్నప్పుడు ఈ హత్య ఎందుకు జరిగింది. హత్యకు కొద్ది గంటల ముందు నాగేంద్ర ఏం చేశాడు. ఎక్కడికెళ్లాడు. ఎవరితో మాట్లాడాడు. అప్పుడు దివ్య  ఎక్కడుంది. ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా..ఆ తర్వాతే హత్య జరిగిందా. ?  ఎవరేం చెప్పినా..పోలీసులకు మాత్రం ఈ కేసు సవాల్‌గా మారింది. లీకైన ఆడియోలు..ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల వంకాయలపాటి దివ్య తేజస్విని.. 25 ఏళ్ల బుడిగి నాగేంద్రబాబు అలియాస్‌ చిన్నస్వామి ఎపిసోడ్‌ ఇప్పుడు బెజవాడలో హాట్‌ టాపిక్‌. 

దివ్యను నాగేంద్ర అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. నాగేంద్ర తనకు తానే చిన్నచిన్న గాయాలు చేసుకున్నాడు. ఇదంతా పథకం  ప్రకారమే జరిగింది. హత్యానేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర మీడియాతో మాట్లాడుతున్నాడు. పోలీసులకు అన్ని విషయాలు చెప్పాము..దివ్య పెళ్లి ఇతర విషయాలు  నిజం కాదు. ఏడు నెలలుగా మా బిడ్డ ఎంత క్షోభ అనుభవించిందో సెల్ఫీ వీడియో చూసేదాకా తమకూ తెలీదు.. అని దివ్య పేరెంట్స్‌ చెబుతున్నారు. 

ఇద్దరం ఇష్టపడ్డాం.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు కలిసి బతకలేక పోయాం.. అందుకే ఆమెను చంపి తానూ చనిపోవడానికి  సిద్ధపడ్డానంటూ నిందితుడు నాగేంద్రబాబు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పెళ్లి చేసుకున్నా కూడా తాము కలిసి బతకలేక పోతున్నామని.. ఇక కలిసే పరిస్థితి లేకపోతే  ఇద్దరం ఇష్ట ప్రకారమే చనిపోదామన్న దివ్య సలహా మేరకు ఆమె ఇచ్చిన కత్తితోనే హత్య చేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని నాగేంద్రబాబు పోలీసులకు చెప్పాడు.  దివ్య హత్యకు ఆమె తల్లిదండ్రులే కారణమని ఆరోపించాడు.

దివ్య తేజస్వినిని పెళ్లి చేసుకున్నట్లు నాగేంద్ర తనకు చెప్పాడని అతడి సోదరుడు నాగరాజు చెబుతున్నాడు. ఈ విషయం గురించి దివ్య ఇంటికి వెళ్లి ఆమె తండ్రితో  మాట్లాడానని, ఆయన ఇందుకు ఒప్పుకోలేదని తనతో చెప్పినట్లు వివరణ ఇచ్చాడు. పెళ్లి మేటర్‌ కూడా తనకు గురువారమే తెలిసిందని.. ఈ లోగా ఇదంతా జరిగిపోయిందని అన్నాడు. దివ్యను పెళ్లి చేసుకోవడానికి నాగేంద్రకు సహకరించిన ఆ మహిళ ఎవరు.. ఇదే ఇప్పుడు పోలీసులను వేధిస్తున్న ప్రశ్న. ఆమెను పట్టుకుంటే అన్ని విషయాలు కూపీ  లాగొచ్చని పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఇదంతా సరే..వీళ్లు చెప్పినవన్నీ నిజాలే అనుకుందాం..అన్నీ నిజాలే అనుకుంటే అబద్ధమేది..పోనీ అన్నీ అబద్ధాలే అనుకుంటే..ఎవరి తప్పును వాళ్లు కప్పి పుచ్చుకుంటే  అసలైన నిజం ఏది.. ఇదెవరూ చెప్పలేరు. ఎందుకంటే.. ఏం చెప్పాలన్నా.. ఏం చేయాలన్నా పోలీసుల చేతుల్లోనే ఉంది. 

కాసేపు నాగేంద్ర, దివ్య ప్రేమించుకున్నారని..పెళ్లి  చేసు కున్నారనే అనుకుందాం.. అదే నిజమైతే..మరెందుకు విడిపోయారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని..రహస్యంగా పెళ్లి చేసుకుని..ఇష్టానుసారంగా ఫోటోలు..సెల్ఫీలు  తీసుకుని.. వాటిని సోషల్‌ మీడియాలో పెట్టుకుని..సరదాగా కబుర్లు చెప్పుకుని.. ఆనందాలు పంచుకుని.. ఇప్పుడు హత్యల వరకు తెచ్చుకున్నారు. అంత హ్యాపీగా  ఉన్నవాళ్లు సడెన్‌గా ఎందుకు విడిపోయారు. లవర్‌గా ఉన్న నాగేంద్ర ఉన్నట్టుండి సైకోగా ఎందుకు మారాడు. విలన్‌గా ఎందుకు ప్రవర్తించాడు. మెడలో తాళి కనిపిస్తున్నా..తన  బిడ్డకు పెళ్లి కాలేదని చెబుతున్న దివ్య తల్లిదండ్రుల మాటల్లో నిజమెంత. దివ్య, నాగేంద్ర..ఇద్దరిదీ చిన్న వయసేం కాదు. ఇద్దరూ మేజర్లే.. పైగా దివ్య ఇంగ్లీష్‌ మాట్లాడే విధానం  చూస్తే.. చాలా బాగా చదువుకున్న అమ్మాయిలాగే ఉంది. అలాంటప్పుడు. 

ఆమె ఆలోచనల్లో మెచ్యూరిటీ లేదనుకోవాలా..ఉన్నా లేనట్లే అనుకోవాలా.. ఇప్పుడు సైకో, విలన్‌  అని తిడుతున్న ఆమె..అన్నేళ్ల పరిచయంలో అతడిలో ఇంకో కోణం కనిపించలేదా.. లేదంటే అతడి గురించి ఆమెకు పూర్తిగా తెలియకపోవడమా.. ఆమెలోని  తెలియనితనమా..ఏది కారణం..ఏది వాస్తవం. ఏది ప్రేమ..ఏది అట్రాక్షన్‌..తెలిసీ తెలియని ప్రేమ అనుకుందామంటే..ఇద్దరూ ఎదగినవాళ్లే..స్పష్టత ఉన్న ప్రేమ  అనుకుందా మంటే.. ఇలా హత్యకాండ వరకు వెళ్లనే వెళ్లదు. మరి నాగేంద్ర చెబుతున్నదేంటి. అతడు చెబుతున్నట్లు దివ్య..తన తల్లిదండ్రులు చెప్పినందునే అతడిని దూరం  పెట్టిందా.. అది తట్టుకోలేకనే నాగేంద్ర ఇలా చేశాడా.. ఇద్దరూ కలిసి చనిపోవాలనుకున్నప్పుడు అది సూసైడ్‌ కావాలి కానీ..హత్య ఎలా అవుతుంది. మరి కొంతకాలంగా  దూరంగా ఉంటున్న వీళ్లు కలిసినప్పుడు ఏం జరిగింది. ఎవరి ఉద్రేకాలు ఎంత దూరం వెళ్లాయి. 

ఎవరి ఆలోచనలు ఎవరిని ప్రభావితం చేశాయి. ఎవరికి కోపం తారస్థాయికి  చేరుకుంది. ఏనాడో చెప్పుకున్న ఊసులు ఇప్పుడు మరిచిపోయి హత్య వరకు తెచ్చుకున్నారా.. లేదంటే..చదువుకున్న దివ్య.. అంతగా చదువులేని నాగేంద్రతో పరిచయం  ఇక చాలనుకుందా. అమ్మాయిల ఆలోచనా విధానం ఏంటి. నాగేంద్ర లాంటి ఉన్మాదుల పైశాచికత్వం ఇలాగే ఉంటుందా.. ప్రేమ విఫలమైతే..చచ్చిపోవాలా..చంపాలా.. రెండూ  కాకుండా..ఆమె కోసం పెట్టిన పెట్టుబడిని ఏదోలా వెనక్కు తీసుకోవాలా..ఇవేవీ కాదంటే.. ఇంకేదైనా చేయాలా.. అసలేంటి.. కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటారు. కాస్త తేడా  వస్తే..ప్రాణాలు తీసుకోవాలా..ఇష్టం లేనప్పుడు విడిపోవాలి.. లేదా..అర్థం చేసుకుని దూరంగా ఉండాలి. ఇవేవీ కాదంటే.. ఏదో ఒక పంచాయతీ చేసుకుని పెద్దల సమక్షంలో  సర్దుకు పోవాలి. ఇవన్నీ కాకుండా కత్తులతో కుత్తుకలు కోస్తే అది..అప్పటికి కోపం చల్లారుతుందా..చివరకు ఏం జరిగింది. 

ఆమె ప్రాణం పోయింది. నాగేంద్ర ఆస్పత్రిలో ప్రాణంతో  పోరాడుతున్నాడు. ఇందులో తప్పు ఎవరిదైనా కావొచ్చు. కానీ ఒక్క చేతితో ఎవరూ చప్పట్లు కొట్టలేరన్నది నిజం. అలాగని దివ్యది తప్పని చెప్పడం లేదు. నాగేంద్ర చేసింది  నేరం కాదని చెప్పడం లేదు. తప్పు జరిగిపోయింది. ప్రాణం పోయింది. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి. తల్లిదండ్రులు పిల్లల తీరును  గమనిస్తూ ఉండాలి. వాళ్లు చదువుకుంటున్నారని గాలికి వదిలేయకుండా.. వాళ్లు ఎలా చదువుతున్నారు. కాలేజీలో వాళ్ల ఫ్రెండ్స్‌ ఎవరు. ఎవరెవరితో క్లోజ్‌గా ఉంటున్నారు.  వాళ్ల రిలేషన్‌ ఎలాంటిది.. ఇంటికి ఎంతసేపు వస్తున్నారు. ఎవరితో ఎంతసేపు చాటింగ్‌ చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకపోతే.. ఇలాంటి ముగింపులే చూడాల్సి వస్తుంది.  అందుకే.. ఆడ పిల్లల తల్లిదండ్రులు..ఇరవై ఏళ్లు ప్రేమతో..అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుళ్లను జాగ్రత్తగా కాపాడుకోండి. అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చు.  తెలియకపోవడం వాళ్ల తప్పుకాదు.. కానీ వాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండటం మీ బాధ్యత. ఎందుకంటే..నాగేంద్ర లాంటి వాళ్లే సమాజంలో ఎక్కువున్నారు కాబట్టి.