గ్రేటర్ వరంగల్ ఎన్నికలు తెరాస కు తలనొప్పిగా మారిందా ..?

గ్రేటర్ వరంగల్ ఎన్నికలు తెరాస కు తలనొప్పిగా మారిందా ..?

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నగారా మోగడంతో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లో సందడి మొదలైంది. ఎమ్మెల్యేలకు తలనొప్పులు కూడా స్టార్ట్‌ అయ్యాయి. ఒక్కో డివిజన్‌ నుంచి వందల మంది పోటీకి సిద్ధపడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఈ దశలో టికెట్‌ రానివారి రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని తలుచుకుని ఆందోళన చెందుతున్నారట. 

గ్రేటర్‌ వరంగల్ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు!

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలే అయినా.. పరిధి మాత్రం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది. మొత్తం 66 డివిజన్లు. రాష్ట్రంలో అధికారంలో టీఆర్‌ఎస్‌ ఉండటంతో..  ఆ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసేవారి సంఖ్య కూడా అనూహ్యంగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎమ్మెల్యేలు కూడా ఊహించలేదట. ఎన్నికల నగారా మోగగానే  టికెట్ల కోసం వస్తున్న స్థానిక నేతల తాడికిడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు నాయకులు. 

గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలన్నది పార్టీ ఆలోచన!

ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరంగల్‌ ఈస్ట్‌ 24, వరంగల్‌ వెస్ట్‌ 26, వర్ధన్నపేట 12, పరకాల 3, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఒక డివిజన్‌ ఉన్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలన్నది టీఆర్‌ఎస్‌ ఆలోచన. కానీ.. టికెట్‌ ఆశిస్తున్నవారంతా గెలుపు గుర్రాలమే అని చెబుతున్నారట. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఓ రేంజ్‌లో ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే ఎవరు చెబితే వింటారో తెలుసుకుని వారితో ఫోన్లు కూడా చేయిస్తున్నారట కొందరు ఆశావహులు. 

కొందరు సర్వే రిపోర్టులు సమర్పణ!

తాజా మాజీ కార్పొరేటర్లు సైతం మరోసారి ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే స్వతంత్రంగా బరిలో దిగేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో మీ గెలుపుకోసం పనిచేశాం. డబ్బులు కూడా ఖర్చుపెట్టాం. ఇప్పుడు టికెట్‌ ఇవ్వరా అని కొందరు నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలో అర్ధం కావడం లేదట. రిజర్వేషన్లు తారుమారు కావడంతో.. మాజీ కార్పొరేటర్లు కొందరు తమను తొక్కేయడానికే ఎమ్మెల్యేలు అలా చేశారని గుర్రుగా ఉన్నారట. డివిజన్లలో తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని.. సర్వేలు కూడా అదే చెబుతున్నాయని కొందరు సర్వే రిపోర్టులను నేతల ముందు పెడుతున్నారట. 

కొన్ని డివిజన్లలో 150 నుంచి 180 దరఖాస్తులు!

ఇంత వేడిలోనూ టీఆర్‌ఎస్‌లో మరో చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఎప్పుడో ఖరారైనా.. కేవలం మభ్య పెట్టడానికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కొందరు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై కొన్నిచోట్ల ఓపెన్‌గానే కామెంట్స్‌ చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో పోటీకి సిద్ధమంటూ 150 నుంచి 180 దరఖాస్తులు వచ్చాయట. ఈ తరహా  పోటీ వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల్లో ఉన్నట్టు చెబుతున్నారు. టికెట్‌ రాదని భావించిన వాళ్లు హైదరాబాద్‌లో తమకు పరిచయం ఉన్న నేతల ద్వారా పార్టీ పెద్దలకు చెప్పిస్తున్నారట. ఇలాంటి సిఫారసులు.. పలకరింపుల ఫోన్లు గ్రేటర్‌ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలకు నాన్‌స్టాప్‌గా వస్తున్నట్టు సమాచారం. 

ఆర్థిక, అంగబలం ఉన్న లోకల్‌ లీడర్ల కోసం ఫోకస్‌!

కాంగ్రెస్‌, బీజేపీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నా.. గ్రేటర్‌ వరంగల్‌లోని మొత్తం 66 డివిజన్లను కైవశం చేసుకోవాలన్నది టీఆర్‌ఎస్‌ నేతల ఆలోచన. ఆ మేరకు డివిజన్లలో ఆర్థిక, అంగబలం ఉన్న లోకల్‌ లీడర్ల  గురించి పార్టీ పెద్దలు అన్వేషిస్తున్నట్టు సమాచారం. అయితే.. టికెట్‌ దక్కని వారు క్షేత్రస్థాయిలో రెబల్స్‌గా మారి పనిచేస్తే ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట. మరి.. ఆశావహులను ఏ విధంగా బుజ్జగిస్తారో చూడాలి.