తిరుపతి గోదాలో ప్రత్యేకహోదా ప్రచారాస్త్రమేనా...?

తిరుపతి గోదాలో ప్రత్యేకహోదా ప్రచారాస్త్రమేనా...?

తిరుపతి ఉపఎన్నిక వేళ ప్రత్యేకహోదా ప్రచార అంశం అవుతోందా? గతంలో మోడీ ఇదే ప్రాంతంలో చేసిన ప్రకటన చుట్టూనే పార్టీలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయా? పోలింగ్‌ తేదీలోపు బీజేపీకి ఎదురయ్యే పెద్ద సవాల్‌ ఇదేనా? మరి.. కమలనాథుల రియాక్షన్‌ ఏంటి? 

స్వల్ప వ్యవధిలో ప్రజల అటెన్షన్‌ తెచ్చే ప్రయత్నంలో పార్టీలు!

నామినేషన్ల దాఖలు ఘట్టం ముగియడంతో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గెలుపెవరిది అన్న ఉత్కంఠ మొదలైంది. వైసీపీ, టీడీపీ, బీజేపీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇక్కడ నుంచి అనేకసార్లు ఎంపీగా ఉన్న చింతా మోహన్‌ మరోసారి కాంగ్రెస్‌ నుంచి పోటీలో నిలుచుని తనదైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. తెలంగాణలో దుబ్బాక, GHMC ఎన్నికల మాదిరి ఇక్కడా సత్తా చాటుతామన్న ప్రకటనలతో ముందుకెళ్తున్నారు బీజేపీ నాయకులు. తిరుపతి అభివృద్ధి అంతా తమదే అన్నది కమలనాథుల మాట. ఏపీకి కాబోయే అధినేత పవన్‌ కల్యాణ్‌ అని జనసైనికులు జారిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక అధికార పార్టీ వైసీపీ.. గెలుపు ఎప్పుడో ఖాయమైందని.. తమ దృష్టి అంతా మెజారిటీపైనే ఉందని స్పష్టం చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కేంద్ర మాజీ మంత్రి పనబాకకు మళ్లీ టికెట్‌ ఇచ్చి బరిలో దిగింది టీడీపీ. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్‌ పెట్టాయి. స్వల్ప వ్యవధిలో ప్రజల అటెన్షన్‌ తీసుకొచ్చే పనిలో ఉన్నాయి. 

ప్రత్యేక హోదా ప్రస్తావించిన సీపీఐ!

ఇంత వరకు బాగానే ఉన్నా..  ఇప్పటి వరకు అభివృద్ధి, సంక్షేమం అనే మాటల చుట్టూ తిరిగిన పార్టీల ప్రచారం మెల్లగా ప్రత్యేక హోదా దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో లెఫ్ట్‌ పార్టీలు హోదా అంశాన్ని ప్రస్తావించి మొదటి బ్యాటింగ్‌ మొదలుపెట్టాయి. 

ప్రత్యేకహోదా వదిలి పెట్టలేదన్న వైసీపీ!

2014 ఎన్నికల్లో తిరుపతి సభలో ప్రత్యేక హోద అంశాన్ని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఇప్పుడు అదే తిరుపతిలో ఉపఎన్నిక కావడంతో ఈ అంశాన్ని ఇతర పక్షాలు స్పీడ్‌గా క్యాచ్‌ చేస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని వదిలిపెట్టలేదని వైసీపీ నేతలు కూడా శ్రుతి కలిపారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని తర్వాత ప్రత్యేక హోదా అంటూ గళమెత్తిన టీడీపీ ఈ విషయాన్ని ఏ విధంగా ప్రచారంలోకి తీసుకొస్తుందన్నదే ప్రశ్న. 

ప్రత్యేక హోదాపై కమలనాథుల రియాక్షన్‌ ఏంటి?

ప్రత్యేకహోదా సీరియస్‌ టాపిక్‌ అయితే బరిలో ఉన్న రాజకీయ పార్టీలు విడిచిపెట్టే  అవకాశం లేదు. అలాంటి సందర్భం వస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి కమలనాథులకు రావొచ్చు.  అయితే ప్రత్యేక హోదాపై చెప్పేది ఏమీ లేదంటున్నారు GVL.
బైట్‌. జీవీఎల్‌ నరసింహరావు, బీజేపీ ఎంపీ

ప్రచారం ముగిసేలోగా రాజకీయం రంగులు మారుతుందా? 

ప్రస్తుతానికి లెఫ్ట్‌ పార్టీలు తప్ప ఇంకెవరూ హోదా గురించి పెద్దగా ప్రశ్నలు వేయడం లేదు. చివరకు వైసీపీ, టీడీపీలు సైతం ప్రధాని మోడీ పేరును ప్రస్తావించడం లేదు. ఇది కొంత వరకు బీజేపీకి ఊరటనిచ్చే విషయం. కాకపోతే ఏప్రిల్‌ 15 వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. అప్పటిలోగా రాజకీయం ఏ విధంగా రంగులు మారుతుందో అంచనా వేయలేం. ఎప్పుడే టాపిక్‌ ప్రచారాంశంగా మారుతుందో చెప్పలేం. మరి.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదంటాయో..  ఎన్నికల గోదాలో తమ హోదాను కాపాడుకునేందుకు పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయో చూడాలి.