కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ఖర్చుపై కొత్త రచ్చ

కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ఖర్చుపై కొత్త రచ్చ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పుడు ఆ పార్టీలో లెక్కలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి సమాధానం చెప్పాలని ప్రశ్నలు సంధించడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఏఐసీసీకి ఎన్నికల ఖర్చుపై ఫిర్యాదు!

తెలంగాణ కాంగ్రెస్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ఖర్చుల అంశం మళ్లీ చర్చకు వచ్చింది. AICC సభ్యుడు జాడ్సన్‌ అధిష్ఠానానికి లేఖ రాయడంతో మళ్లీ తేనెతుట్ట కదిలినట్లు అయ్యింది.  2018 ఎన్నికల్లో  మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ తదితర పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆ సమయంలో  తెలంగాణలో ఎవరెవరి నుంచి ఎన్ని నిధులు సమకూర్చారు.. వాటిని ఏ నియోజకవర్గంలో ఎంత ఖర్చు చేశారు అనేదానిపై ఆరా కోరుతూ లేఖ రాశారు జాడ్సన్‌. 
 
వచ్చిన విరాళాలెన్ని? ఎంత ఖర్చు చేశారు?

ఈ లేఖపై పీసీసీని జవాబు కోరుతూ AICC కొన్ని ప్రశ్నలు సంధించింది.  AICC నుంచి వచ్చిన విరాళాలు ఎన్ని?  మిత్రపక్షాలు నుంచి వచ్చిన విరాళాలు. పారిశ్రామిక వేత్తలు, ఇతర కార్పొరేట్‌ సంస్థల నుంచి సేకరించిన నిధులు, ఎన్నికల సమయంలో ప్రచారం కోసం చేసిన ఖర్చు, ప్రచార  సామగ్రికి ఎంత ఖర్చు చేశారు? మీడియాలో ప్రకటనల కోసం చేసిన ఖర్చు, అభ్యర్థుల గెలుపుకోసం నియోజకవర్గాల వారీగా చేసిన ఖర్చు తెలియజేయాలని AICC కోరింది. 
 
ఎన్నికల తర్వాత జరిగిన సమీక్షలోనూ దీనిపై వివాదం!

వాస్తవానికి ఆ ఎన్నికల్లో నిధులను పూర్తిస్థాయిలో ఖర్చుపెట్టలేదని.. సొమ్ములు పక్కదారి పట్టాయని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని పీసీసీ చీఫ్‌ ఖండించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగిన సమీక్షలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చి నేతల మధ్య గొడవకు, దూషణలకు కారణమైంది. ఆ అంశమే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. 

దామోదర రాజనర్సింహకు జాడ్సన్‌ సన్నిహితుడు!

ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన విరాళాలు.. చేసిన ఖర్చుపై పీసీసీ చీఫ్‌ AICCకి వివరాలు పంపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా AICC ప్రశ్నావళి పంపించడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. జాడ్సన్‌ ఇంతటితో ఆగలేదు.. ఇటీవల హుజూర్‌నగర్ సమావేశంలో కేటీఆర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరస్పర అభినందనలపైనా పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట. పైగా జాడ్సన్‌ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు సన్నిహితుడు కావడంతో మరింత వేడి పుట్టిస్తోంది. మరి తాజా ప్రశ్నలకు గతంలో ఇచ్చిన జవాబులే ఇస్తారో.. లేక లెక్కల చిక్కులు పార్టీలో మరింత రచ్చకు కారణం అవుతాయో చూడాలి.