నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జనసేన దారెటు..?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జనసేన దారెటు..?

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో జనసేన దారెటు? బీజేపీకి మద్దతిస్తుందా లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరి షాకింగ్‌ ప్రకటన ఉంటుందా? ఇంతకీ తెలంగాణలో బీజేపీకి జనసేన మిత్రపక్షమా.. వైరిపక్షమా? 

సాగర్‌లో జనసేన మద్దతు ఎవరికి?

ఏపీలో కలిసి సాగుతున్న బీజేపీ, జనసేన పార్టీలు.. తెలంగాణలో మాత్రం గ్యాప్‌ పాటిస్తున్నాయి. GHMC ఎన్నికల సమయంలో ఏర్పడిన ఈ దూరం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు తెంచుకున్నట్టే కనిపించింది. స్వయంగా జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ సంచలన కామెంట్స్‌ చేయడం రెండుపార్టీల శిబిరంలో చర్చ జరిగింది. అయితే తెలంగాణలో బీజేపీకి జనసేన రాం రాం చెప్పిందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు ఏపీలో తిరుపతి లోక్‌సభకు, తెలంగాణలో నాగార్జునసాగర్‌ అసెంబ్లీకి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతిలో రెండు పార్టీలు కలిసి సాగుతున్నా.. సాగర్‌లో ఏంటన్నది చప్పుడు లేదు. 

పవన్‌తో తెలంగాణ బీజేపీ నేతలు చర్చించింది లేదు!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభివాణికి చివరిక్షణంలో మద్దతు పలికారు పవన్‌ కల్యాణ్‌. ఈ నిర్ణయం బాధపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించి ఊరుకున్నారు. కానీ.. సయోధ్య దిశగా రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు.. అడుగులు పడలేదు. GHMC ఎన్నికల సమయంలో స్వయంగా పవన్‌ దగ్గరకు వెళ్లి చర్చించిన బీజేపీ నేతలు.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అలాంటి చొరవ తీసుకోలేదు. ఎలాగూ ఓడిపోయాం.. ఇంకెందుకు అని భావించి ఊరుకున్నారో ఏమో చర్చల మాటే ఎవరి నోటి వెంటా రాలేదు. కానీ.. ఇప్పుడు నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక వేడి నెలకొంది. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో పవన్‌ కల్యాణ్‌ వచ్చి ప్రచారం చేస్తారని అనుకున్నా.. జనసేనాని రాలేదు. సాగర్‌ సంగతేంటో తెలియదు. 

2019లో జనసేన ఎంపీ అభ్యర్థికి 1100 ఓట్లు!

నాగార్జునసాగర్‌లో పోటీ చేస్తామని దాదాపు పది మంది ఆశావహులు పార్టీని కోరినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. 2018లో ఇక్కడ జనసేన పోటీ చేయలేదు. నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా వేముల సతీష్‌రెడ్డి బరిలో నిల్చుంటే ఆయనకు 1100 ఓట్లు వచ్చాయి. సాగర్‌లో జనసేన బలమెంతో తెలియదు. కానీ.. పవన్‌ అభిమానులు ఉన్నారన్నది ఆ పార్టీ చెప్పేమాట. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న సమయంలో ఏ వర్గం ఓట్లను వదులుకునే స్థితిలో పార్టీలు లేవు. అందుకే జనసేన అభిమానుల ఓట్లు గురించి కూడా చర్చ జరుగుతోంది. 

ఒకటి రెండు రోజుల్లో పవన్‌ ప్రకటన ఉంటుందా? 

ఒకట్రెండు రోజుల్లో పవన్ కల్యాణ్‌.. సాగర్‌లో ఎవరికి మద్దతివ్వబోతున్నారో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో బీజేపీతో దోస్తీ చేస్తూ.. తెలంగాణలో ఆపార్టీకి కటీఫ్‌ చెబుతుందో లేక అండగా ఉంటుందో తెలియదు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరి అధికారపార్టీ అభ్యర్థికి జైకొడుతుందో కూడా స్పష్టత లేదు. మరి.. జనసేనాని మనసులో ఏముందో వేచి చూడాల్సిందే.