పరిషత్ ఎన్నికల బహిష్కరణతో తిరుపతి ఉప ఎన్నికలలో మేలు జరుగుతుందా?

పరిషత్ ఎన్నికల బహిష్కరణతో తిరుపతి ఉప ఎన్నికలలో మేలు జరుగుతుందా?

ఏపిలో పరిషత్ ఎన్నికలను టిడిపి బహిష్కరించింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఈ నిర్ణయం తిరుపతి ఉప పోరుపై పడుతుందా? ఎన్నికలకు దూరం అవ్వడం వల్ల జరిగేది లాభమా నష్టమా! దీనిపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? 

తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వచ్చిన పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టిడిపి ప్రకటించింది. పార్టీలో చాలా మంది దీనిపై సరే అన్నా...కొందరు మాత్రం తప్పు పడుతున్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల పార్టీ ఇమేజ్ కూడా పోతుందని అభిప్రాయ పడుతున్నారు. తిరుపతి బైపోల్స్ ముందు ఇలాంటి నిర్ణయం రాజకీయంగా మంచిది కాదని వాదిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయటానికి టిడిపి భయపడిందనే అభిప్రాయం ప్రజల్లోకి పోతే 17న జరిగే పోలింగ్ పై ప్రభావం ఉంటుందని కొందరు లెక్కలు వేస్తున్నారు. పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సమయంలో జరిగిన పొలిట్ బ్యూరోలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో పరిస్థితులు, నేతల అభిప్రాయాల మేరకు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప పోరుపై ఈ ప్రభావం ఉంటుందనే వాదనను పక్కన పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు టిడిపి ఎన్నికలకు భయపడిందంటూ ప్రచారం చేస్తున్నాయి. విమర్శలతో టిడిపి అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే....స్థానికంగా మరో చర్చ నడుస్తుందని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి లోక్ సభలోని నెల్లూరు పరిధిలోకి వచ్చే 4 అసెంబ్లీల్లో గాని తిరుపతి పరిధిలోకి వచ్చే రెండు అసెంబ్లీల్లో గాని అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. బైపోల్స్ కు ముందు రిజల్ట్ వచ్చే ఈ ఎన్నికల్లో పాల్గొనడం వల్ల పెద్ద లాభం లేకపోగా, నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెపుతున్నారు. ఎలాగూ లోక్ సభ పరిధిలో జరిగే పరిషత్ ఎన్నికల్లో ప్రబావం చూపలేరు. అక్కడ క్యాడర్ కూడా మానసికంగా దీనికి సిద్దం అయ్యారు. ఒక వేళ పోటీలో ఉండి ఓడిపోతే, మళ్లీ వారంలో జరిగే ఎన్నికల్లో అంత గట్టిగా పని చేసే అవకాశం కూడా ఉండదనేది టిడిపి లెక్క.  దీంతో పరిషత్ ఎన్నికల్లో పోటీ చెయ్యకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం ఉందో తెలియదు గాని....బైపోల్స్ జరిగే ప్రాంతంలో మాత్రం ఈ నిర్ణయం వల్ల తమకు మంచే జరిగిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు ఎన్నికలు ఎదుర్కొనే పరిస్థితి లేదని ఆపార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారట.

ఓవరాల్‌గా ఈ బహిష్కరణ వల్ల కొంత లాభం ఉండొచ్చని టిడిపి భావిస్తోంది.  8వ తేదీన జరిగే పోలింగ్ లో అన్ని గ్రామాల్లో ప్రజలు ఓటింగ్ కు వస్తారు. ఎలాగూ అధికార పక్షం గెలుస్తుంది. దీంతో తరువాత వారంలో జరిగే లోక్ సభ ఉపపోరులో ఓట్లు తమకు వెయ్యమని అడగొచ్చన్నది టిడిపి నేతల కొత్త ఆలోచనగా చెప్పుకుంటున్నారు. మొన్ననే వైసిపికి వేశారు కాబట్టి...ఈ ఓటు మాకు వెయ్యండి అని చివరి 5 రోజులు ప్రచారం చేస్తాం అంటున్నారట టిడిపి నేతలు. ఆ దిశగా ఓటర్లను ఆకట్టుకోగలిగితే....బహిష్కరణ నిర్ణయం కొంత మేర లాభిస్తుందనేది ఓ వర్గం నేతల లెక్క. మరి ఈ ఈక్వేషన్ ఎంత వరకు ఫలిస్తుందో...బహిష్కరణ మేలు చేస్తుందో...లేక తిరగబెడుతుదో చూడాలి.