అచ్చన్న లేక కుదేలైన క్యాడర్ !

అచ్చన్న లేక కుదేలైన క్యాడర్ !

పార్టీకి ఫైర్ బ్రాండ్‌గా మారిన ఆ నేత ఇప్పుడు గాలితీసిన బెలూన్‌లా మారిపోయారని అనుచరులు బాధపడుతున్నారట. కేడర్‌కు ధైర్యం చెప్పేవారు కూడా లేరు. దిక్కులేని వాళ్లం అయ్యామని వాపోతున్నారట. ఇంతకీ ఎవరా నేత? 
 
జైలుకు వెళ్లడానికి ముందు ఎదుటపక్షంపై భీకర దాడి!

తెలుగు తమ్ముళ్లు ముద్దుగా అసెంబ్లీ టైగర్‌ అని పిలుచుకునే టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రస్తుతం ESI స్కామ్‌లో జైలులో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు. గతంలో మంత్రిగా ఉన్నా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా.. జైలుకు వెళ్లడానికి ముందు ఎదుటపక్షంపై భీకరంగా విరుచుకుపడేవారు.  మొన్నటి ఎన్నికల తర్వాత ఎంతో మెచ్యూర్డ్‌గా కనిపిస్తూ.. అధికార పార్టీపై దూకుడు ప్రదర్శించారు. 
 
ఈఎస్‌ఐ స్కామ్‌లో జూన్‌ 12న అచ్చెన్న అరెస్ట్‌!

మొన్నటి ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్నకు చెక్‌ పెట్టాలని వైసీపీ ప్రయత్నించినా సాధ్య పడలేదు. ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అచ్చెన్న వర్సెస్‌ సర్కార్‌ అన్నట్లు వాగ్యుద్ధం నడిచింది. ఇంతలో ESI కుంభకోణం వెలుగులోకి రావడంతో అధికార పక్షం వేగంగా పావులు కదిపింది. టీడీపీ తేరుకునేలోపుగానే వన్‌ ఫైన్‌ మాణింగ్‌ అచ్చెన్నను నాటకీయ పరిణామాల మధ్య  ACB అరెస్ట్‌ చేసింది. జూన్‌ 12న అరెస్టయిన ఆయన ఇప్పటి వరకూ జైలులోనే ఉన్నారు.
 
ఒకటి రెండు నిరసనలతో టీడీపీ జిల్లా నాయకత్వం చేతులు దులిపేసుకుందా?

ప్రస్తుతం టెక్కలితో పాటు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా అయిపోయిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. చెట్టంత మనిషి కథ రాత్రికి రాత్రి తిరగబడిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. నిమ్మాడకు వచ్చి నారా లోకేష్‌ ధైర్యం చెప్పినా.. ఇలాంటి అరెస్ట్‌లను చూస్తూ ఊరుకోబోమంటూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు హెచ్చరించినా.. కేడర్‌లో మునుపటి ఉత్సాహం లేదు. అచ్చెన్నను అరెస్ట్‌ చేసిన సమయంలో ఒకటి రెండు నిరసనలు చేసిన టీడీపీ జిల్లా నాయకత్వం సైతం చేతులు దులిపేసుకుందని గుస గుసలాడుకుంటున్నారట. 
 
టెక్కలి టీడీపీ శ్రేణులను పట్టించుకునేవారు లేరా?

అచ్చెన్న మంత్రిగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఉన్నా.. నిమ్మాడకు వస్తే కచ్చితంగా నియోజకవర్గస్థాయి కార్యకర్తలతో తరచూ సమావేశం నిర్వహించేవారు. సంక్షేమ పథకాలలో టీడీపీ వారిని తీసేసినా.. కేసులు పెట్టినా అర్ధరాత్రి అని కూడా చూడకుండా పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేసేవారు. దీంతో అచ్చెన్న ఉంటే కొండంత ధైర్యంగా భావించేవారు తెలుగు తమ్ముళ్లు. మాజీ మంత్రి జైలుకెళ్లినప్పటి నుంచీ టెక్కలి టీడీపీ శ్రేణులను పట్టించుకునేవారే లేరట. 
 
అచ్చెన్న లేక అనాథలం అయ్యామని కేడర్‌ ఆవేదన!

కనీసం ఎంపీ రామ్మోహన్‌నాయుడైనా పలకరిస్తారనుకున్న కేడర్‌కు నిరాశే మిగిలిందట. కరోనా టైమ్‌ కావడంతో ఎంపీ స్వీయ నిర్భందంలో ఉన్నారు. అచ్చెన్న విడుదల కోసం తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు  వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వినికిడి. అయితే ఇవేమీ లోకల్‌ టీడీపీ శ్రేణులకు ఊరట నివ్వడం లేదట. అచ్చెన్న లేని టెక్కలిలో తామంతా అనాధలమైపోయామనే భావనలో ఉన్నారట. మాజీ మంత్రి వచ్చే వరకూ తమకు ఈ కష్టాలు తప్పవనే నిర్ణయానికి వచ్చేశారట. అందుకే అచ్చెన్నకు ఎప్పుడు బెయిల్‌ వస్తుందోనని ఎదురు చూస్తున్నారట. మరి.. కేడర్‌కు ఎప్పటికి ఊరట లభిస్తుందో చూడాలి.