అక్కడ ఉద్యోగం మూన్నాళ్ళ ముచ్చటేనా?
అక్కడ ఉద్యోగం మూణ్నాళ్ల ముచ్చటే. బదిలీపై వచ్చేవారంతా 3 నెలలు తిరగకుండానే వెళ్లిపోతున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరే అకాల ట్రాన్స్ఫర్లకు కారణమన్న చర్చలో నిజమెంతా? ఇంతకీ ఎవరా నాయకులు?
తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా రావడానికి అధికారుల్లో జంకు!
వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ పేరు చెబితేనే అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. మున్సిపాలిటీ కమిషనర్‌గా వచ్చేవారు ఎవరూ పట్టుమని 3, 4 నెలలు ఆ కుర్చీలో కుదురుకోలేకపోతున్నారు. ఏడాదిలో దాదాపు ఆరుగురు కమిషనర్లు మారారంటే ఇక్కడ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. వర్గపోరు రాజకీయాల వల్ల తాండూరు మున్సిపాలిటీ కమిషనర్‌గా రావడానికి చాలా మంది అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ ధైర్యం చేసి ఎవరు వచ్చినా ఎక్కువ రోజులు ఉండరు. ఈ విషయంలో నేతల పంతం నెగ్గుతోంది కానీ.. అభివృద్ధి పనులు పడకేస్తున్నాయి.
చదువుల పేరుతో ఒకరు.. ఆరోగ్య కారణాలతో ఇంకొకరు లాంగ్ లీవ్!
రాజకీయ ఒత్తిళ్ల మధ్య నలిగిపోయే అధికారులు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక.. ఉన్నత చదవులు అంటూ ఒకరు.. ఆరోగ్య కారణాలతో ఇంకొకరు లాంగ్లీవ్లు పెట్టి టాటా చెప్పేస్తున్నారట. గతేడాది 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో సభేర్ అలీకి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల అనంతరం మార్చిలో కొత్త కమిషనర్‌గా శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఆయన ఉన్నత చదువుల పేరుతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అనంతరం ఆర్డీవో అశోక్ కుమార్‌కి ఇన్చార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజులకే పరిగి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు బదలాయించారు. ఆయన రెండు నెలలు ఇన్చార్జిగా కొనసాగిన అనంతరం శ్రీనివాస్‌రెడ్డి అనే మరో అధికారి కమిషనర్‌గా వచ్చారు. పట్టుమని 15 రోజులు బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆరోగ్య సమస్యలతో సెలవుపై వెళ్లిపోయారు. దీంతో పరిగి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికే తిరిగి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయనపై ఆరోపణలు రావడంతో ఆర్డీవో అశోక్‌కుమార్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు.
ఆధిపత్య పోరు శ్రుతిమించుతోందా?
స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరులో కమిషనర్లు నలిగిపోతున్నారట. ఒకరు కాదంటే ఇంకొకరు అవుననడంతో అభివృద్ధి పనులు ముందుకు కదలడం లేదని సమాచారం. పైగా తమ పని చేయాలంటే తమ పని చేయాలని ఒత్తిళ్లు తెస్తారట. ఇలాంటి ఒత్తిళ్లు చాలా దారుణంగా ఉంటాయని ఉద్యోగ వర్గాలు చెప్పేమాట. అందుకే ఇక్కడికి వచ్చే కమిషనర్లు ఎక్కువ రోజులు ఉండటం లేదని సమాచారం. ఈ విషయం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు తెలియంది కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినా ఆధిపత్య పోరు శ్రుతిమించి ఇలాంటి అంశాలను పట్టించుకోలేని పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఉద్యోగ వర్గాల్లో మాత్రం కమిషనర్ సీటుపై కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)