"మా దేవుళ్ళు మిరే" అంటూ తెలుగు తమ్ముళ్లు కొత్త జపం..!

"మా దేవుళ్ళు మిరే" అంటూ తెలుగు తమ్ముళ్లు కొత్త జపం..!

మా దేవుళ్లు మీరేనయ్యా..! పల్లె పోరు తర్వాత సిక్కోలు తెలుగు తమ్ముళ్లు చేస్తున్న జపం ఇదే. రాష్ట్రంలో రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఉన్నా.. పంచాయతీ ఎన్నికల్లో రాణించడంతో సంబర పడుతున్నారు. అనుకోని విజయానికి కారణమైన వారిని తలచుకుని తెగ సంతోషిస్తున్నారట. 

సిక్కోలులో టీడీపీకి 199 పంచాయతీలు రావడంపై చర్చ!

టీడీపీకి కంచుకోటలాంటి శ్రీకాకుళం జిల్లాను అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లగొట్టింది వైసీపీ. అప్పటి నుంచి సైకిల్‌ పార్టీ మళ్లీ పుంజుకోకుండా అధికారపార్టీ అనేక రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది. కేసులు.. నేతల నిర్భందాలు.. కాక పుట్టించాయి. ఇదే సమయంలో వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో  తెలుగుదేశానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినా 199 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలిచి తెలుగు తమ్ముళ్లనే ఆశ్చర్యపరిచారు.  ఇదంతా నిజమా .. కలా అని అనుకుంటున్న సమయంలో అసలు విషయం తెలుసుకుని సంబర పడుతున్నారు. అంతేకాదు.. సిక్కోలు రాజకీయాల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

జిల్లాలో సగంచోట్ల  వైసీపీ రెబల్స్‌ డేంజర్‌ బెల్స్‌!

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సిద్ధమని ప్రకటించిన అధికార, విపక్షాలు తీరు పంచాయతీ పోరు నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత మారిపోయింది. టీడీపీ మద్దతుదారులు బరిలో దిగేందుకు పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితి. కాకపోతే కొన్నిచోట్ల పరువు కోసం.. మరికొన్నిచోట్ల పార్టీ నేతల ఒత్తిళ్లతో కొందరు పోటీ చేయక తప్పలేదు. అయితే ఇదే సమయంలో వైసీపీకి కూడా వింత అనుభవం ఎదురైంది. టీడీపీ మద్దతుదారులు బరిలో లేరన్న సంతోషం ఎంతో సేపు లేదు. వైసీపీ నుంచే భారీగా రెబల్స్‌ పోటీ చేయడంతో అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. జిల్లాలో 1166 పంచాయతీలు ఉంటే.. సగం చోట్ల  వైసీపీ రెబల్స్‌ డేంజర్‌ బెల్స్‌ మోగించారు. ఇలా వైసీపీ రెబల్స్‌ బరిలో దిగిన పంచాయతీలలో టీడీపీ జెండాలు ఎగిరాయి. అదే ఇప్పుడు చర్చగా మారింది. 

వైసీపీ రెబల్స్‌ వల్లే టీడీపీ మద్దతుదారులు గెలిచారా? 

తొలివిడతలోనే టీడీపీ మద్దతుదారులు 57 పంచాయతీలను కైవశం చేసుకున్నారు. రెండో విడతలోనూ 35 చోట్ల తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. వైసీపీ రెబల్స్‌ గెలిచిన చోట.. అధికార పార్టీ నాయకులు వారిని తమ శిబిరంలో కలిపేసుకున్నారు. మూడో విడతలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. చివరిదైన నాలుగో దశలో మాత్రం టీడీపీ పుంజుకోవడానికి వందశాతం వైసీపీ రెబల్స్‌ కారణమయ్యారన్న ప్రచారం జోరందుకుంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీకి ఊహించని విజయాలు దక్కాయి. ఇది తెలుగు తమ్ముళ్లనే ఆశ్చర్యపరిచిందట.

వైసీపీ రెబల్స్‌ టీడీపీ పాలిట దేవుళ్లయ్యారా? 

రెబల్స్‌ బెడదతో వైసీపీకి ఏకగ్రీవాలు సాధ్యం కాలేదు. పైగా అధికారపార్టీ మద్దతుదారుల విజయావకాశాలను గండికొట్టారు. ఇదే సమయంలో టీడీపీ మద్దతుదారుల విజయానికి వైసీపీ రెబల్స్‌ కలిసొచ్చారని అనుకుంటున్నారు. అందుకే సిక్కోలు టీడీపీ నేతలు  ' మా దేవుళ్లు మీరేనయ్యా'అని వైసీపీ రెబల్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారట. పల్లెపోరులో డబుల్‌ సెంచరీ చేయలేకపోయినా 199 దగ్గర ఆగినందకు సంతోషంగానే ఉందని చెబుతున్నారట. మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల ముందు వైసీపీ రెబల్స్‌ మంచి కిక్‌ ఇచ్చారని సంబర పడుతున్నట్టు సమాచారం. మరి.. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఇదే విధంగా లక్ కలిసి వస్తుందో.. వ్యూహం మారుస్తుందో చూడాలి.