నారావారిపల్లెలో వైసీపీ జెండా ఎగురుతుందా?

నారావారిపల్లెలో వైసీపీ జెండా ఎగురుతుందా?

కుప్పంలో అనూహ్య ఫలితాలు సాధించారు.  మరి తర్వాత టార్గెట్‌ నారావారి పల్లేనా? చిత్తూరులో భారీ గెలుపు సొంతం చేసుకుంటున్న వైసీపీ చంద్రబాబు స్వగ్రామంపై ఫోకస్‌ పెట్టిందా? ఇది తమ్ముళ్లలో టెన్షన్‌ కు కారణంగా మారిందా?

చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజవర్గంలో పంచాయతీ ఫలితాలు టిడిపి, వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. మూడో దశ ఎన్నికల్లో కుప్పంలో 89 పంచాయతీల్లో 75 వైసీపీ గెలిస్తే, టిడిపి కేవలం 13 మాత్రమే గెలిచింది. ఈ షాకింగ్‌ పలితాలు రెండు పార్టీలనూ ఆశ్చర్యంలోనే పడేస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి 13 చోట్లకే పరిమితం కావటం చూసిన చిత్తూరు జిల్లా తమ్ముళ్ళు, టిడిపి అధినేత అవాక్కయ్యారట.

అయితే కుప్పం షాక్‌ నుండి తేరుకోకముందే, మరో పెద్ద తలనొప్పి వచ్చిపడింది. ఇప్పుది టిడిపి వర్గాల్లో మరింత ఆందోళనకు దారితీస్తోందట. చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లె ఈ ఆందోళనకు కారణంగా మారింది. ఈ ఊరిపై వైసీపీ ఫోకస్ పెట్టిందనే టాక్‌ ఉంది. అసలు కుప్పం రిజల్టు చేసిన డ్యామేజ్‌ తట్టుకోకముందే ఇప్పుడు మరో సమస్య వచ్చిందని భావిస్తున్నారట. ఆరు నూరైనా నారావారి పల్లెలో  గెలవాల్సిందేనని లేదంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని భావిస్తున్నారట తెలుగు తమ్ముళ్లు.

అటు  కందులవారిపల్లి పంచాయతీ మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలా ఉంది. ఇప్పటి వరకు ఆ పార్టీ మద్దతుదారులు ప్రభాకర్ నాయుడు, బెనర్జీ నాయుడు, చంద్రకుమార్ నాయుడులే సర్పంచ్‌లుగా కొనసాగారు. మొదటి నుంచి టీడీపీ పాగా వేస్తున్న కందులవారిపల్లి పంచాయతీని కైవసం చేసుకునేందుకు వైసీపీ ఫోకస్ పెట్టింది. 650 ఓట్లతో అతి చిన్న పంచాయతీగా ఉన్న కందులవారిపల్లికి పక్కనున్న నారావారిపల్లె, శేషాపురం, బి.కొంగరవారిపల్లి పంచాయతీలను కలిపి 1404 ఓట్లతో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ వైకాపా ఎస్సీ మహిళకు అవకాశం ఇస్తే..టిడిపి ఓసి మహిళను రంగంలో దింపారు. దీనిఫలితం కూడా ఆసక్తికరమే.

తెలుగు తమ్ముళ్ళ టెన్షన్ ఇలా ఉంటే ...లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుప్పం ఫలితాలతో మరింత జోష్ లో ఉన్నారు. చంద్రగిరిలో గెలిచిన సర్పంచ్ లకు జరిగిన సన్మానసభలో డిప్యూటీ సిఎంనారాయణస్వామి, పెద్దిరెడ్డి మొదలైన నేతలు హాజరైన సమయంలో ఇదే చర్చ సాగిందట. కుప్పం తరహాలోనే నారావారిపల్లెలోనూ వైసీపీ జెండా ఎగురవేయాలంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణుల పోస్టులు రచ్చ చేస్తున్నాయి. దీంతో చెవిరెడ్డి సైతం ఈ పంచాయతీపై దృష్టి పెట్టారని సమాచారం.  ఇప్పటివరకూ చంద్రగిరిలో ఎన్నకలు జరిగిన అన్ని పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగరటంతో, తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్ళు. గతంలో కూడా ఇక్కడ ఎంపీటిసి సీటును పోగొట్టుకున్నారు తమ్ముళ్ళు. ఇప్పుడు పంచాయతీ చేజారితే పరిస్థితి ఎంటో అనే ఆందోళనలో తమ్ముళ్లున్నారనే చర్చ నడుస్తోంది.