నాగార్జున సాగర్ లో భారీగా స్వతంత్ర అభ్యర్థులు...!

నాగార్జున సాగర్ లో భారీగా స్వతంత్ర అభ్యర్థులు...!

నాగార్జునసాగర్‌లో భారీగా దాఖలైన నామినేషన్లు రాజకీయ పార్టీలను కలవర పెడుతున్నాయా? ఉపసంహరణ తర్వాత కూడా సంఖ్య ఎక్కువగానే ఉంటే పరిస్థితి ఏంటి? పెద్ద సంఖ్యలో స్వతంత్రులు పోటీ చేస్తే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? 

సాగర్‌లో 2,19,745 మంది ఓటర్లు!
మూడు ప్రధాన సామాజికవర్గాల నుంచి అభ్యర్థులు!

తెలంగాణ ప్రజల దృష్టి ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఉంది. అయితే ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల బెంగ పట్టుకుంది. మొత్తం 78 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు కుల సమీకరణాల ఆధారంగా ముందుకెళ్తుండటంతో ఇండిపెండెంట్లుగా వేసినవారు ఎంత మంది ఉపసంహరించుకుంటారో అంతుచిక్కడం లేదట. నియోజకవర్గంలో 2,19,745 ఓట్లున్నాయి. ఇందులో 40 వేల ఓట్లు గిరిజనులవే. 35 వేల ఓట్లు యాదవ సామాజికవర్గానికి చెందినవి. ఓసీల ఓట్లు 31వేలు ఉండగా ఇందులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓట్లే అధికం. ఎస్సీలలో మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 25 వేల వరకు ఉన్నారట. పోటీలో ఉన్న మూడు పార్టీల అభ్యర్థులు తమ సామాజికవర్గాల నుంచి  ఏ మేరకు ఓట్లను సాధిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. 

కీలకంగా మారనున్న మాదిగ సామాజికవర్గం ఓట్లు!

2014 ఎన్నికల్లో జానారెడ్డికి 69 వేల 684 ఓట్లు వస్తే.. నోములకు 53వేల 208 ఓట్లే వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికలకు వచ్చే సరికి నోముల 83 వేల 655 ఓట్లు సాధించారు. జానారెడ్డి 75 వేల 884 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 2014 కంటే 2018కి ఓట్లు పెరిగినా.. అభ్యర్థుల జాతకాలు తిరగబడ్డాయి. 2018లో బరిలో ఉన్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థికి 9 వేల 819, బీజేపీ అభ్యర్థి నివేదితకు 2 వేల 675 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు స్వతంత్రులు పెరిగారు. పైగా మాదిగ సామాజికవర్గం ఎటు మొగ్గు చూపుతుందన్నది  ప్రశ్నగా ఉంది. ఎమ్మార్పీఎస్‌ నుంచి నామినేషన్లు పడటంతో ఆ ఓట్లు ప్రధాన పార్టీలకు వచ్చేది కష్టమే. 2014లో మహాజన సోషలిస్ట్‌ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి  4 వేల ఓట్లు వచ్చాయి. నాడు మాదిగ సామాజికవర్గం నుంచే ఎక్కువ ఓట్లు పడ్డట్టు భావించారు. ఇప్పుడు కూడా అదే జరిగితే రేస్‌లో ఉన్న పార్టీకి ఇబ్బంది తప్పకపోవచ్చు. 

దుబ్బాక ఫలితం చూశాక ఛాన్స్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేని పార్టీలు!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్రులు గట్టి పోటీ ఇవ్వడంతో.. సాగర్‌లో కూడా బరిలో ఉన్న కొందరు ఇండిపెండెంట్‌లు ఆ దిశగా ప్రచారం చేసే ఆలోచనలో ఉన్నారట. ఇది తెలిసినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ శిబిరాల్లో గుబులు మొదలైందట. దుబ్బాకలో బీజేపీ స్వల్ప మెజారిటీతో గెలిచింది. అందుకే సాగర్‌లో పార్టీలకు పడే ప్రతి ఓటు కీలకమే. ఏ పార్టీ కూడా ఛాన్స్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. మెజారిటీని పక్కనపెట్టి ఓటర్లను ఆకర్షించడం.. వారి ఓట్లు పడేట్టు జాగ్రత్తలు తీసుకోవడంపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టాయట పార్టీలు. మరి.. సాగర్‌లో స్వతంత్రుల వల్ల ఎవరికి లాభమో.. నష్టమో.. ఫలితాల వరకు వేచి చూడాల్సిందే!