సాగర్‌లో బీజేపీకి షాక్‌ ఇస్తోన్న ఆశావహులు...

సాగర్‌లో బీజేపీకి షాక్‌ ఇస్తోన్న ఆశావహులు...

కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉంది నాగార్జునసాగర్‌లో బీజేపీ పరిస్థితి. టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరో వస్తారని ఆశించిన బీజేపీకి స్థానిక నేతలు షాక్‌ ఇచ్చే పనిలో పడ్డారట. టికెట్‌ ఆశించి భంగపడిన వారు ఒక్కొక్కరుగా కారెక్కేందుకు క్యూ కడుతున్నారు. 

ఆశావహులు బీజేపీపై గుర్రుగా ఉన్నారా? 

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక సమయంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి నేతలను గుంజుదామని భావించిన బీజేపీకి చేదు అనుభవాలు తప్పేట్టు లేవు. అవతలి పార్టీ నుంచి లాక్కోవడమేమోకానీ సొంత పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లకుండా అడ్డుకోలేకపోతోంది బీజేపీ. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి చాలా మంది నాయకులు ఆశపడ్డారు. పార్టీ వారించినా నియోజకవర్గంలో ఎవరికి వారుగా ప్రచారం మొదలుపెట్టేశారు. తమకే టికెట్‌ వస్తుందన్న ఆశతో జనాల్లోకి వెళ్లిపోయారు. తీరా ఆశావహులకు బీజేపీ షాక్‌ ఇచ్చింది. దాంతో వారంతా పార్టీకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

టీఆర్‌ఎస్‌లో చేరిపోయిన కడారి అంజయ్య
శ్రీధర్‌రెడ్డి, నివేదిత సైతం గుడ్‌బై చెబుతారా?

బీసీ నేతగా ఉన్న కడారి అంజయ్య యాదవ్‌ చివరి వరకు బీజేపీ టికెట్‌ తనకే వస్తుందని ఎదురు చూశారు. చివరకు రెబల్‌గా అయినా బరిలో దిగాలని అనుకున్నారట. కానీ.. ఇంతలో టీఆర్‌ఎస్‌ గేమ్‌ప్లాన్‌ మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్‌ నేతలు పైళ్ల  శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, సైదిరెడ్డిలు అంజయ్య యాదవ్‌తో టచ్‌లోకి వెళ్లారు. వెనువెంటనే హైదరాబాద్‌ తీసుకొచ్చి టీఆర్‌ఎస్‌ కండువా కప్పేశారు. బీజేపీకి ఒకరకంగా ఇది షాకే. ఒక్క అంజయ్యే కాకుండా మరికొందరు నేతలు సైతం టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే నామినేషన్‌ వేసిన నివేదితారెడ్డి, ఆమె భర్త బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సైతం కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

శ్రీధర్‌రెడ్డి కుటుంబంతో టీఆర్‌ఎస్‌ చర్చలు? 

2018 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై సాగర్‌లో పోటీ చేశారు నివేదితారెడ్డి. ఇప్పుడు కూడా తనకే టికెట్‌ వస్తుందని ఆశించి.. నామినేషన్‌ కూడా వేసేశారు. తీరా పార్టీ రవినాయక్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. ఆమె ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తారా లేక.. టీఆర్‌ఎస్‌లో చేరి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. టికెట్‌ రానప్పుడు బీజేపీలో ఉండటం ఎందుకు అని అనుచరులు శ్రీధర్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారట. సాగర్ నియోజకవర్గంలో జిన్నింగ్ మిల్లుకు సబ్సిడీలు, రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కొన్ని అనుమతులు అనివార్యం కావడంతో.. ఈ రెండు వ్యాపారాలలో ఉన్న వీరికి ఆ దిశగా అధికార పార్టీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే అంజయ్యతోపాటు మరికొందరు కూడా బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌కు క్యూ కడతారని అనుకుంటున్నారు. మరి.. ఈ పరిణామాలకు బీజేపీ ఎలాంటి విరుగుడు మంత్రం వేస్తుందో చూడాలి.