అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేను నా చేతుల్లో ఏం లేదన్నారు!

అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేను నా చేతుల్లో ఏం లేదన్నారు!

పార్టీ ఓడినప్పుడూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అధికారంలోకి రావడంతో పాటు.. వరుసగా రెండోసారి శాసనసభ్యుడయ్యారు. కానీ.. ఏం లాభం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహారం ఎలా ఉందో.. అధికారంలో ఉన్నా అలాగే ఉందట. జనం ఏం అడిగినా నానేటి సేయలేను అని చేతులు ఎత్తేస్తున్నారట.  
 
గత ఐదేళ్లలో పాడిన పాటనే జోగులు పాడుతున్నారా?

సిక్కోలులో వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్ రాజాం నియోజకవర్గం. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈప్రాంతంలో దశాబ్దకాలంగా తమ్ముళ్ల తన్నులాటలు.. లోకల్ పాలిటిక్స్ పెరిగిపోవడంతో.. ప్రత్యర్ధి పార్టీకి మేలు జరిగింది. ఈక్రమంలో రాజాంలో 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ జెండా ఎగరేసింది. ఈ రెండుసార్లూ వైసీపీ అభ్యర్ధి కంబాల జోగులు గెలిచారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. గత ఐదేళ్లలో పాడిన పాటనే ఇప్పుడూ జోగులు పాడుతుండటంతో అటు కార్యకర్తలు, ఇటు నియోజకవర్గ ప్రజలకు ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదట. 
 
అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేను నా చేతుల్లో ఏం లేదన్నారు!

2014 ఎన్నికల సమయంలో తాను గెలిస్తే రాజాంలో చేపట్టే అభివృద్ధి పనులు ఇవే అంటూ..  బోలుడన్ని హామీలు ఇచ్చారు. నాటి ఎన్నికల బరిలో టీడీపీ తరఫున ప్రతిభా భారతి, కాంగ్రెస్ తరపున కోండ్రు మురళి, వైసీపీ నుంచి కంబాల జోగులు బరిలో నిలిచారు. కంబాల గెలిచినప్పటికీ అధికారంలోకి టీడీపీ రావడంతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైపోయారు. గడచిన ఐదేళ్లు తన వద్దకు ఎవరు ఏ చిన్న పనిమీద వచ్చినా.. నేను ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేని.. నా చేతుల్లో ఏమీ లేదు.. ప్రభుత్వం నాకు నిధులు ఇవ్వడం లేదు.. ఇదే మాట చెప్పుకొస్తూ జనం దగ్గర, కార్యకర్తల దగ్గర సానుభూతి కొట్టేశారట. ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జోగులు తీరులో మార్పురాకపోవడంపైనే జోరుగా చర్చనడుస్తోందట. సేమ్‌ అదే క్యాసెట్‌ రిపీట్‌ చేస్తున్నారట జోగులు.
 
ఇప్పుడు కూడా నేనేం చేయను.. పెద్దాయన చేతుల్లో ఉందంటున్నారు!

వైసీపీ అధికారంలోకి రావడంతో జోగులు గతంలో ఇచ్చేసిన హామీలన్నీ నెరవేర్చుతారని రాజాం ప్రజలు భావించారు. కానీ.. ఇప్పుడు కూడా.. ఏ ఇద్దరు కలిసినా, ఏ ముగ్గురూ చర్చించుకున్నా రాజాం రోడ్ల విస్తరణ గురించేనట. జోగులు గెలిచి ఏడాది అవుతున్నా .. అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా అడుగు కూడా ముందుకు పడలేదని అంటున్నారు. ఎవరైనా అడిగితే.. నేనేం చేయను.. అంతా పెద్దాయన చేతుల్లో ఉందంటూ పార్టీ సీనియర్ నేత పాలవలస ఫ్యామిలీ పేరు చెబుతున్నారట. రాజశేఖరం లేదా ఆయన కుమారుడు డీసీసీబీ ఛైర్మన్ పాలవలస విక్రాంత్‌ని అడగండని తనవద్దకు వచ్చే వారికి సలహాలిస్తున్నారట. ఎమ్మెల్యేనే ఇలా అంటుంటే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారట జనం. గడచిన ఏడాదిన్నర కాలంగా కంబాల జోగులు తీరు ఇదే విధంగా ఉండటంతో ఆయన ఉన్నాలేనట్లే అని జనం గుసగుసలాడుకుంటున్నారట. మరికొందరైతే కంబాల ఏమిలా అంటూ బాహాటంగానే అసహనం వెళ్లగక్కుతున్నారట. 
 
రాజశేఖర్‌ ఫ్యామిలీ చలువతోనే జోగులు గెలిచారని ప్రచారం!

రాజాం ప్రాంతంలో ఎప్పటి నుంచో రాజశేఖరానికి గట్టి పట్టుంది. అక్కడ జోగులు గెలవడంలోనూ ఆయన పాత్ర ఉంది. ఆర్థిక, అంగబలాలు దండిగా ఉన్న రాజశేఖరం ఫ్యామిలీ చలువతోనే జోగులు గెలిచారనే ప్రచారం ఉంది. ఆ విశ్వాసంతోనే కాబోలు జోగులు చేతులు జోడించి తన విజ్ఞతను చాటుకుంటున్నారట. ఎమ్మెల్యే ఎవరైనప్పటికీ గెలిపించిన వారే పనులు చేయాలనేది జోగుల పాలసీ.