అదృష్టం అంటే ఆ మంత్రిదే అంటున్న వైసీపీ నేతలు.!

అదృష్టం అంటే ఆ మంత్రిదే అంటున్న వైసీపీ నేతలు.!

అనుకోకుండా పదవి వస్తే అదృష్టం అంటారు. అదే అదృష్టం ఆయన్ని పదేపదే తలుపు తడుతోందట. దీంతో ఆయన గురించే జిల్లాలో చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏమా అదృష్టం. ఈ స్టోరీలో చూద్దాం. 

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ముందు అనంత నేతల్లో టెన్షన్‌!

ఏపీలో కొత్త మంత్రుల ఎంపిక అధికార పార్టీ నేతల్లో ఉత్కంఠకు దారితీసింది. ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం ఎవరి ఊహకు అందలేదు. కాకపోతే.. కొత్త మంత్రులను తీసుకోవడంతోపాటు కేబినెట్‌లో మార్పులు ఉంటాయని.. శాఖల్ని కూడా మార్చేస్తారని వైసీపీ శ్రేణుల్లో  ప్రచారం జరిగింది. దీంతో ఎవరి జాతకం ఎలా ఉంటుందో అన్న టెన్షన్‌ మధ్య కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం, శాఖల కేటాయింపు జరిగిపోయింది. అయితే అంతకుముందు అనుకున్నట్లు శాఖల్లో పెద్దగా మార్పులు జరగకపోవడంతో చాలా మంది మంత్రులు ఊపిరి పీల్చుకున్నారట. ఇదే సమయంలో కొందరికి ఇంకా మంచి శాఖలు వచ్చాయనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ జాబితాలోనే చేరారు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకర నారాయణ. 

అంతా లక్కీ శంకరనారాయణ అన్నారు!

పెనుకొండ నుంచి తొలిసారిగా శంకరనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటిసారే  సీఎం జగన్‌ నుంచి పిలుపు రావడం.. మంత్రి కావడం జరిగిపోయింది. దీంతో అంతా లక్కీ శంకరనారాయణ అని అనుకున్నారు. ఒకప్పుడు పెనుకొండ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. పరిటాల రవి ఎంట్రీ తర్వాత టీడీపీ అడ్డాగా మారింది.  అలాంటి నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వేయడమే కాకుండా.. భారీ మెజారిటీ సాధించారు శంకరనారాయణ. దీనికితోడు కురుబ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో.. ముఖ్యమంత్రి జగన్‌ ఈక్వేషన్స్‌కు సరిపోయారట. 

ఏకంగా మంత్రిని చేయడంతో అంతా ఆశ్చర్యపోయారా?
ఆర్‌ అండ్‌ బీ గతంలో కంటే మంచి శాఖ అని ప్రచారం!

తొలిసారి ఎమ్మెల్యే అయిన సంబరంలో ఉన్న శంకరనారాయణను ఏకంగా మంత్రిని చేయడంతో ఆయనకు కూడా ఏం జరిగిందో అర్థం కాలేదని అంటారు. మొదట్లో తడబడినా.. కొందరు ఎమ్మెల్యేలు ఆయనకు సహకరించకపోయినా.. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు.  వివాదాలు కూడా ఏం లేవు. ఇంతలోనే ఆయన్ని మరోసారి అదృష్టం తలుపుతట్టడంతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు.  మొన్నటి వరకూ బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు శంకరనారాయణ. ఇప్పుడు ఆ శాఖను కొత్త మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు కేటాయించారు. శంకర నారాయణకు ఆర్‌ అండ్‌ బీ ఇచ్చారు. ఇది గతంలో ఉన్న శాఖ కంటే ఇంకా మంచి విభాగమని మంత్రి అనుచరులు, జిల్లా వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. 

అనంతపురం జిల్లా నుంచి ఏకైక మంత్రి!

ఎలాంటి ఎఫర్ట్‌ పెట్టకుండానే, ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండానే వరుసగా అదృష్టం తలుపుతడుతోందని అనుకుంటున్నారట. అయితే ఇలాంటి ఛాన్స్‌ దక్కని అనంతపురం జిల్లాలోని ఇతర వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు పైకి నవ్వుతున్నట్లు కనిపించినా లోలోన తెగ జలసీ ఫీలవుతున్నారట. ఈ జిల్లా నుంచి ఆయనొక్కరే మంత్రిగా ఉన్నారు. మరొకరిని తీసుకుంటారని అనుకున్నా.. ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించినా  సీఎం జగన్‌ ఫ్రేమ్‌లోకి ఎవ్వరూ వెళ్లలేదు. కాకపోతే ముఖ్యమంత్రిని శంకర నారాయణ ఏవిధంగా ఇంప్రెస్‌ చేశారన్నదే అంతుచిక్కడం లేదట.