కుప్పంలో చంద్రబాబు కోటకు బీటలు..!

కుప్పంలో చంద్రబాబు కోటకు బీటలు..!

కుప్పంలో వైసీపీ ఆపరేషన్ మొదలైందా? చంద్రబాబు పీఠం కదిలించడమే టార్గెట్‌గా పెట్టుకుందా?  బాబుతో టచ్‌లో ఉండే నేతల్లో ఎక్కువ మంది ఔటాఫ్‌ సర్వీస్‌ అంటూ వైసీపీతో టచ్‌లోకి వెళ్లిపోతున్నారా? అసలేం జరుగుతోంది? లెట్స్‌ వాచ్‌.
 
టార్గెట్‌ కుప్పం ఆపరేషన్‌ మొదలైందా? 

చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు కోటకు బీటలు తీయాలన్నది వైసీపీ తాజా వ్యూహంలా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కిపులో చంద్రబాబు కాస్త వెనుకబడ్డ అంశంYCP నేతల మైండ్లో బాగా నాటుకుపోయింది. అది మొదలు.. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న ఆలోచనకు వచ్చేశారు.  టార్గెట్ కుప్పం ఆపరేషన్‌కు తెరతీశారు. 
 
టీడీపీతో 30 ఏళ్ల అనుబంధం ఉన్నవాళ్లూ జంప్‌!

ఈ ఆపరేషన్‌లో భాగంగా స్థానిక టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకుంటున్నారు.  టీడీపీతో 30 ఏళ్ల అనుబంధం ఉన్న కుప్పం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ ఇటీవలే సైకిల్‌కు గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. చంద్రశేఖర్‌ భార్య ఎంపీపీగా కూడా పనిచేశారు. ఇది నియోజకవర్గం టీడీపీలో పెద్ద కుదుపుగానే చెబుతున్నారు.  జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌ శ్యామ్‌రాజు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. జడ్పీ మాజీ చైర్మన్‌ సుబ్రమణ్యంరెడ్డి సైతం త్వరలో  వైసీపీలో చేరతారనే ప్రచారం  జోరందుకుంది. 
 
గుడిపల్లె మండలంలోనే వ్యూహాత్మకంగా వలసలు ప్రోత్సాహం!

కుప్పంలో బీసీ ఓటర్లు ఎక్కువ.  వన్నెకుల క్షత్రియ, కురబ సామాజికవర్గం వారు అధికం. ఈ వర్గాలపై వైసీపీ ఫోకస్‌ పెట్టిందట. అలాగే చంద్రబాబుకు మంచి మెజారిటీ కట్టబెట్టే గుడిపల్లె మండలంపైనా  వైసీపీ నేతల కన్నుపడిందట. ప్రస్తుతం ఈ మండలం నుంచే వ్యూహాత్మక వలసలను ప్రోత్సహిస్తున్నారు. కుప్పం వైసీపీ ఇంఛార్జ్‌ చంద్రమౌళి మరణంతో ఆయన కుమారుడు భరత్‌ ఆ బాధ్యతలు చూస్తున్నారు. పరిశీలకుడి హోదాలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప వచ్చి సలహాలు ఇస్తున్నారు. వీరందరినీ సమన్వయం చేసే బాధ్యతలను  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టినట్లు టాక్‌.
 
కేడర్‌ను కాపాడుకునేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాసులు తంటాలు!

కుప్పంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు జిల్లా టీడీపీ నాయకులు  చంద్రబాబుకు చేరవేస్తున్నారట. దీంతో ఆయన కూడా స్థానిక నేతలతో తరచుగా ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెబుతున్నట్లు సమాచారం. జూమ్‌ యాప్‌ద్వారా ఇటీవల స్థానికులతో మాట్లాడారు టీడీపీ అధినేత. బాబు ఆదేశాలతో కుప్పం వెళ్లిన టీడీపీ నాయకులతో మాట్లాడేందుకు కొందరు ముఖం చాటేసినట్లు సమాచారం. కేడర్‌ను కాపాడుకునేందుకు కుప్పం టీడీపీ వ్యవహారాలు చూస్తోన్న ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు నానా తంటాలు పడుతున్నారట.  
 
కుప్పం నుంచి బాబును పంపించడమే లక్ష్యమా?

శ్రీనివాసులు కార్యకర్తల ఇంటికి వెళ్లి పార్టీ మారవద్దని చెబుతుంటే.. ఆయన ముందు సరే అంటున్న వాళ్లు.. మరుసటి రోజే కండువా మార్చేస్తున్నారట. ఇటీవలే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో కీలక టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం నుంచి బాబును పంపించడమే టార్గెట్‌గా పనిచేయాలని నేతలు వారికి సూచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా.. వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కుప్పం రాజకీయం రంజుగా మారిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి.. అధికార పార్టీ వ్యూహం ఫలిస్తుందో లేదో వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.