ఏపీ ప్రభుత్వం పై గుర్రుగా ఉన్న ఆ 21 గ్రామాలు...!

ఏపీ ప్రభుత్వం పై గుర్రుగా ఉన్న ఆ 21 గ్రామాలు...!

బాహ్య ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టుండే ఆ మారుమూల పల్లెలు.. ఆ జిల్లాలోని అధికారపార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పక్క రాష్ట్రం తీసుకుంటున్న చర్యలతో ఫీజులు ఎగరిపోతున్నాయట. ఇంతకీ ఏంటా పల్లెలు? నేతలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? 

కోటియా గ్రామాల్లో ఎన్నిక రగడతో నేతలకు నిద్ర కరువు!

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల మధ్య POK సమస్యలా మారింది కోటియా గ్రామాల వివాదం. మొత్తం 21 గ్రామాల కోసం రెండు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఇక్కడి ప్రజలకు నిత్యం నరకం చూపించే పరిస్థితి ఉంది. ఆ మధ్య పంచాయతీ ఎన్నికలకు ఏపీ నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ ఉద్రిక్తతలు రాజేశాయి. జిల్లాలోని ప్రజాప్రతినిధులకు  ఆనాటి నుంచి నిద్ర కరువైందని చెబుతున్నారు. 

ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న 21 కోటియా గ్రామాలు!
ఓట్ల కోసం వచ్చే నేతలు తర్వాత పట్టించుకోవడం లేదని గుర్రు!

ఈ 21 గ్రామాల కోసం రెండు రాష్ట్రాలు గొడవ పడుతుండటంతో.. వివాదం సుప్రీంకోర్టు కెళ్లింది. అక్కడా పరిష్కారం లభించలేదు. ఈ పంచాయితీని పార్లమెంట్‌లో చర్చల ద్వారా తేల్చుకోవాలని  ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం.. స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇచ్చింది. దశాబ్దాలుగా అదే పరిస్థితి.  ఈ 21 గ్రామాలు విజయనగరం జిల్లా, ఒడిశాకు సరిహద్దుల్లో ఉన్నాయి. అభివృద్ధి పేరుతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో భారీ భవనాలను, కార్యాలయాలను, ఘాట్‌ రోడ్లను నిర్మించింది ఒడిశా.  అక్కడ ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టినా ఒడిశాకు ఊరట దక్కలేదు. దీంతో ఎన్నికల్లో స్థానికులు పాల్గొనకుండా రోడ్లు తవ్వేసి.. బారికేడ్లు అడ్డంపెట్టి నానా హంగామా చేసింది. చివరకు పోలీసుల జోక్యంతో ఓటు వేసిన స్థానికులు మాత్రం విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులపై గుర్రుగా ఉన్నారట. ఓట్ల కోసం వచ్చే నేతలు తమను తర్వాత పట్టించుకోవడం లేదని చిర్రుబుర్రులాడుతున్నట్టు చెబుతున్నారు. 

జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై గిరిజనులు ఫైర్‌!

సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర తప్ప మిగతా నాయకులు ఎవరూ ఇక్కడి  గిరిజనులతో మాట్లాడటం లేదని సమాచారం. గిరిజన సంఘాల ప్రతినిధులు ఇదే అంశంపై పలు సందర్భాల్లో ఓపెన్‌గానే కామెంట్స్‌ చేసిన పరిస్థితి. స్థానికులు ఏపీలో ఉండటానికే మొగ్గు చూపుతున్నా.. జిల్లా నేతలు  వారికి అండగా ఉండటం లేదని చెబుతున్నారు.  చివరకు ఇక్కడ పోస్టింగ్‌ వచ్చినా పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు కోటియా గ్రామాలకు వెళ్లడం లేదట.  జిల్లా కేంద్రంలోనే ఉండి మమ అనిపిస్తున్నట్టు సమాచారం. దీంతో ఒడిశా అధికారులకు ఆ 21 గ్రామాల్లో ఆడింది ఆట పాడింది పాటగా ఉందట. 

ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలని ఎదురుచూపులు!

దశాబ్దకాలంగా సాగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చొరవ తీసుకుంటారని స్థానికులు ఆశపడుతున్నారు. ఆ దిశగా అడుగులు పడకపోవడంతో కోపంగా ఉన్నట్టు సమాచారం. పైనుంచి కదలిక లేకపోవడంతో తాము ఏం చేస్తామన్నది నేతల మాట. మరి.. కోటియా ప్రజలకు ఎప్పుడు ఉపశమనం లభిస్తుందో?