జమ్మలమడుగులో పార్టీ ఆదేశాలు పట్టించుకోని వైసీపీ నేతలు...

జమ్మలమడుగులో పార్టీ ఆదేశాలు పట్టించుకోని వైసీపీ నేతలు...

పార్టీ ఇచ్చే ఆదేశాలకు.. పార్టీ పెద్దలు చెప్పే మాటలకు సరే అంటున్నారు అక్కడి నాయకులు. కానీ.. క్షేత్రస్థాయిలో తాము చేయాలనుకున్నదే చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే వ్యూహం. సీన్‌ కట్‌ చేస్తే.. ఎక్కడికక్కడ రెబల్స్‌ బరిలోదిగి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా నియోజకవర్గం? 

పంచాయతీ ఫైట్‌లోనూ ఆధిపత్యపోరే!

కడపజిల్లా జమ్మలమడుగులో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ అధికార, ప్రతిపక్షాల కంటే.. స్వపక్షంలోనే వైరిపక్షాలుగా మారి బరిలో దిగిన సిత్రాలు చాలానే ఉన్నాయి. జమ్మలమడుగు రాజకీయం రూటే సపరేట్‌ అని నిరూపిస్తున్నారు. వైసీపీ నాయకులే.. వైసీపీ వారిపై పోటీ చేస్తున్నారు. అదీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్యే పోరు కనిపిస్తోంది. 

వారించిన వైసీపీ పెద్దలు!

రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిన తర్వాత అప్పటి వరకు సాగిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హవాకు చెక్‌ పెట్టినట్టు అయింది. ఎమ్మెల్యే వైరివర్గమంతా రామసుబ్బారెడ్డి శిబిరంలో చేరింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు నేతలు కలిసి సాగాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించినా.. అన్నిచోట్ల తన అనుచరులను పోటీకి సిద్ధం చేశారు ఎమ్మెల్యే. దీనికి పోటీగా అన్నట్టు రామసుబ్బారెడ్డి వర్గం సైతం అన్ని పంచాయతీలలో తన మనషులను అప్రమత్తం చేసిదట. ఈ విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు ఇద్దరు నేతలను వారించినట్టు  సమాచారం. 

వెనక్కి తగ్గేది లేదంటున్న ఎమ్మెల్యే!

అయినా రెండు వర్గాలు నామినేషన్లు వేసేసినట్టు కథలు కథలుగా చెబుతున్నారు. దీంతో వైసీపీ పెద్దలు ఎన్నికల పరిశీలకులను జమ్మలమడుగు పంపించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య  సయోధ్యకు పరిశీలకులు ప్రయత్నిస్తున్నారట. పరిశీలకులు చెప్పిన మీదట.. రామసుబ్బారెడ్డి వర్గం కాస్త వెనక్కి తగ్గే ప్రయత్నం చేసినా.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారట. నేను సర్దుబాబు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. దీంతో పార్టీ పరిశీలకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని చెబుతున్నారు. 

ఉనికి కాపాడుకునే పనిలో టీడీపీ, బీజేపీ!

జమ్మలమడుగు వైసీపీలో స్వపక్ష నేతలే వైరిపక్షంగా మారితే.. ఒకప్పుడు ఇక్కడ బలంగా ఉన్న టీడీపీ మునుపటిలా సత్తా చాటలేకపోతోంది. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోవడంతో టీడీపీకి నేత లేకుండా పోయారు. ఇటీవల జమ్మలమడుగు టీడీపీ పగ్గాలు చేపట్టిన బీటెక్‌ రవి.. ఈ  నియోజకవర్గంలో కొన్నిచోట్ల పార్టీ మద్దతుదారులను బరిలో దించారు. అలాగే బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం బలం చాటే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులను బరిలో దించారు. మొత్తానికి త్రిముఖ పోటీ జరగాల్సిన చోట.. సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయులు సైతం బరిలో ఉండటంతో  చతుర్ముఖ పోరు నెలకొంది. మరి.. ఈ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో.. ఎవరు బలం చాటుకుంటారో చూడాలి.