గన్నవరం వైసీపీలో ఆసక్తికరంగా రాజకీయం!

గన్నవరం వైసీపీలో ఆసక్తికరంగా రాజకీయం!

పార్టీ మారిన ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్తారో లేదో తెలియదు. ఆయన రాక రుచించని సొంతపార్టీలోని ప్రత్యర్థులు మాత్రం బైఎలక్షన్‌పై ఎన్నో కలలు కంటున్నారు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. రకరకాల ఈక్వేషన్స్‌ వేసుకుంటున్నారట. గన్నవరం హాట్‌హాట్‌ వైసీపీ రాజకీయాల్లో ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

సయోధ్య సాధ్యం కాదు.. పంచాయితీలు ఆగవు!

గన్నవరం. ఇక్కడ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జైకొట్టిన నాటి నుంచి స్థానిక రాజకీయాలు వాడివేడిగా ఉంటున్నాయి. ఎమ్మెల్యే వంశీ ఒక వర్గమైతే.. ఆయన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులది మరో వర్గం.  వీరిద్దరూ గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి.. వంశీ చేతిలో ఓడినవారే. ఈ ఏడాది కాలంలో గన్నవరం వైసీపీ రాజకీయాలు అనేక రకాలుగా టర్న్‌ తీసుకున్నాయి. వంశీకి మద్దతుగా ఉన్న దుట్టా.. తర్వాతి కాలంలో యార్లగడ్డతో చేతులు కలిపారు. దీంతో ఎమ్మెల్యే వర్గానికి.. మిగిలిన ఇద్దరు నేతల అనుచరులకు అస్సలు పడటం లేదు. ఘర్షణకు దిగేందుకు కూడా వెనకాడటం లేదు కేడర్‌. నేతల మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు పలుమార్లు ప్రయత్నించినా.. అవి సఫలం కాలేదు. చేతుల్ని కలిపినా.. చేతలు కలవడం లేదు. రోజుకో పంచాయితీ పార్టీ పెద్దల దగ్గరకు వెళ్తూనే ఉంటుంది. 

గన్నవరంలో ఉపఎన్నికపై చర్చ ఆపని వంశీ ప్రత్యర్థులు!

గన్నవరం సమస్యను సర్దుబాటు చేసేందుకు గతంలో యార్లగడ్డకు MLC ఇస్తారని ప్రచారం జరిగింది. తర్వాత వేర్వేరు కారణాలవల్ల ఆయన్ని DCCB ప్రెసిడెంట్‌ను చేశారు. ఇప్పుడు దుట్టా వంతు వచ్చింది. ఆయన్ని కూడా శాసనమండలికి పంపుతారని అనుకున్నారు. ఈ ప్రచారంలో వాస్తవాలు ఎలా ఉన్నా.. వంశీని వ్యతిరేకిస్తున్న ఇద్దరు నేతలకు పదవులు ఇస్తే ఎలాంటి సమస్య ఉండదని పార్టీ పెద్దలు భావిస్తే.. వాటికి యార్లగడ్డ, దుట్టా ససేమిరా అంటున్నట్టు సమాచారం. వైసీపీకి జైకొట్టిన సమయంలో ఉపఎన్నికకు సిద్ధమని వల్లభనేని వంశీ ప్రకటించారు. గన్నవరానికి ఉపఎన్నిక రావాలంటే వంశీ రాజీనామా చేయాలి.. లేదంటే ఆయనపై పార్టీ ఫిరాయింపు చట్ట ప్రకారం అనర్హత వేటు పడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండూ జరగడం కష్టమే. కానీ.. వంశీ ప్రత్యర్థి వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు లైవ్‌లో ఉంచుతున్నాయి. సమయం చిక్కితే కవ్విస్తున్నాయి కూడా. 

ఉపఎన్నికకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నారా? 

ఉపఎన్నికంటూ జరిగితే వంశీకి టికెట్‌ రాకుండా చేసి వైసీపీ నుంచి బరిలో దిగాలని యార్లగడ్డ, దుట్టాలు ఉవ్విళ్లూరుతున్నారట. వైసీపీ కేడర్‌ పూర్తిగా వంశీ పక్కన లేదని.. ఇది కూడా తమకు కలిసి వస్తుందని వారు అంచనాలు వేసుకుంటున్నారట. ఏదో విధంగా అధిష్ఠానాన్ని ఒప్పించి టికెట్‌ తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఉపఎన్నిక ఊసే లేకపోయినా..  టికెట్‌ మాత్రం తమకే ఇవ్వాలని ఎవరికివారుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. గన్నవరం వైసీపీ ఎపిసోడ్‌లో ఈ కొత్త పరిణామంపై పార్టీ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతి విషయంలో అగ్గిరాజేసుకుంటున్న వర్గాలు.. చడీచప్పుడు లేని ఈ అంశంలో కత్తులు దూసుకుంటాయో.. మరింతగా కవ్వించుకుంటాయో చూడాలి.