చంద్రబాబును భయపెట్టిన కుప్పం పంచాయతీ ఫలితాలు...?

చంద్రబాబును భయపెట్టిన కుప్పం పంచాయతీ ఫలితాలు...?

పంచాయతీ ఎన్నికల ఫలితాలు చంద్రబాబును భయపెట్టాయా? అందుకే కుప్పం వెళ్లారా? లేక కార్యకర్తలు భయపడకుండా అండగా ఉంటానని చెప్పడానికి వెళ్లారా? కుర్చీ కిందకే నీళ్లు వచ్చేసరికి తత్వం బోధపడిందా? గాడిలో పెట్టుకోలేకపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించారా? 

పల్లెపోరు తర్వాత మారిన కుప్పం సీన్‌!
కుప్పంలో 89కి 74 పంచాయతీలలో వైసీపీ గెలుపు!

నాయకులు.. ఎమ్మెల్యేలు అన్నాక అటూ ఇటూ అవుతారు. అలా లేకపోతే రాజకీయ నాయకుడే కాదనే పరిస్థితి. ఒకసారి అధికారంలో ఉండొచ్చు.. మరోసారి దూరం కావొచ్చు. రాజకీయాల్లో ఇలాంటి ఉత్థాన పతనాలు కామన్. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీకే ఇబ్బందులు వచ్చాయని అంతా అనుకున్నారు. ఇప్పుడు టీడీపీ చీఫ్‌ చంద్రబాబుకే కష్టాలు వచ్చాయి. ఆయన కుర్చీ కిందకు నీళ్లు చేరాయి. కుప్పంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత  అలజడి మొదలైంది. వాస్తవానికి కుప్పం అంటే చంద్రబాబుకు కంచుకోట భావించేవారు. ఇన్నాళ్లూ ఏం చేశారన్నది ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కుప్పంలో చంద్రబాబును కాదని మరే పార్టీ చొరబడలేదని అనుకునేవారు. కానీ.. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో సీన్‌ మారిపోయింది. కుప్పంలో 89 పంచాయతీలు ఉంటే..  వైసీపీ 74 చోట్ల పాగా వేసింది. టీడీపీకి పద్నాలుగే దక్కాయి. 

కుప్పం బాబు పర్యటనలో హెచ్చరికలు... భావోద్వేగం!

ఈ లెక్కలు టీడీపీ శిబిరంలో గుబులు రేపితే.. చంద్రబాబును కంగారు పెట్టించాయని టాక్‌. దాంతో పంచాయతీ ఫలితాలు వచ్చి వారం తిరగకుండానే కుప్పంలో వాలిపోయారు టీడీపీ అధినేత. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో తిరుగుతున్నారు. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు.. వారు చెప్పేది వింటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావిస్తున్న అంశాలు కొన్ని పాతవే అయినా.. మరికొన్ని కొత్తగా ఉన్నాయి. ఈ ఎన్నికలను తనకో గుణపాఠంగా ఆయన చెబుతున్నారు. ఎంత ఖర్చు పెట్టి అయినా కార్యకర్తలను కాపాడుకుంటానని.. ఇబ్బంది పెట్టిన అధికారులను గుర్తు పెట్టుకుంటానని.. కొందరు అధికారులు ఇష్టానుసారం ప్రవర్తించారని హెచ్చరించారు. భావోద్వేగం పలికించారు. 

భయమేసి కుప్పం వెళ్లారా? కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారా? 

ప్రస్తుతం చంద్రబాబు కుప్పం పర్యటనను చూసిన వారంతా.. టీడీపీ అధినేతకు భయమేసి నియోజకవర్గానికి వెళ్లారా? లేక కార్యకర్తలు భయపడకుండా అండగా ఉంటానని చెప్పడానికి వెళ్లారా అని ఆరా తీస్తున్నారు.  గతంలో కూడా చంద్రబాబు తాను మారాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ముందు అదే చెప్పారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్‌ ప్రభావం పడింది. ఇప్పుడు జగన్‌ రూపంలో మరో కష్టం వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వము.. విజన్‌ అని ఒకవైపే చూడటంతో పార్టీ ఇబ్బందుల్లో పడిందనేది టీడీపీ నాయకులు చెప్పేమాట. ఆ ఎఫెక్ట్‌ 2019 ఎన్నికల్లో పడింది. అది కుప్పం వరకు వచ్చేసింది. కంచుకోటకు బీటలు వారతాయని బాబే కాదు.. జనం కూడా ఊహించి ఉండరు. అందుకే పరిస్థితులను గాడిలో పెట్టుకోవడానికి టీడీపీ చీఫ్‌ కుప్పంలో వాలిపోయారని అభిప్రాయపడుతున్నారు. 

జమిలీ ఎన్నికలు వస్తే ఇంకా కష్టమా? 

జమిలీ ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీడీపీకి అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందన్నది విశ్లేషకుల మాట. అందుకే పరిస్థితులను ఇప్పుడు సరిచేసుకోకపోతే కుప్పం పీఠం కదులుతుందని దేశం అధినేత భావించి ఉంటారని టాక్‌. అటు చూస్తే వైసీపీ పక్కా ప్లాన్‌తో కుప్పంలో రాజకీయంగా పావులు కదుపుతోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇక్కడ గురి పెట్టింది. ఆ ప్రభావం ఎమ్మెల్యే ఎన్నికల్లో కనిపించింది కూడా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వైసీపీ వేసిన పాగా మామూలుగా లేదు. మరి.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చంద్రబాబు.. ఈ ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్‌ అవుతారో చూడాలి.