పార్టీలో చేరి నకిలీ చలాన్ల కేసులో నుండి ప్రముఖులు బయటపడ్డారా .?

పార్టీలో చేరి నకిలీ చలాన్ల కేసులో నుండి ప్రముఖులు బయటపడ్డారా .?

చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలంటే అధికార పార్టీలో చేరితే సరిపోతుందా? తెలంగాణ ఏర్పడిన తర్వాత వెలుగులోకి వచ్చిన అతిపెద్ద కుంభకోణానికి చెందిన నిందితులు కూడా అదే చేశారా? ప్రభుత్వ ఖజానాకు పడిన చిల్లు పూడలేదు.. మొత్తం సొమ్ము రికవరీ అవుతుందో లేదో కూడా తెలియ దు. కానీ నిందితులు వేస్తున్న ఎత్తుగడలే ఆసక్తి రేకిస్తున్నాయి. 

నకిలీ చలాన్ల కేసులో పలువురు అధికారుల అరెస్ట్‌!

నిజామాబాద్‌ జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో మూడేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది నకిలీ చలాన్ల కుంభకోణం. ప్రభుత్వానికి రావాల్సిన 260 కోట్లను  దారి మళ్లించేశారు నిందితులు. దాదాపు పదేళ్లపాటు ఈ అవినీతి సాగినట్టు సమాచారం. నకిలీ ఈ చలాన్లతో ఇన్‌వాయిస్‌లు రూపొందించి ఎంత మేరకు అక్రమాలు చేయొచ్చో చేసి చూపించారు. జిల్లాకు చెందన రైస్‌ మిల్లర్లు.. పలు షోరూంల అధినేతలు ఈ స్కామ్‌లో పాత్రధారులుగా తేల్చారు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు. కొందరు ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా తేటతెల్లం కావడంతో CTO, ACTO, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లను అరెస్ట్‌ చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన CA శివరాజ్‌ ద్వారా ఈ స్కామ్‌ జరిగిందని  తెలుసుకుని ఆయన్ని ఆయన కుమారుడిని కటకటాల వెనక్కి నెట్టారు. 

భయపడి ప్రభుత్వానికి రూ.62 కోట్లు వెనక్కి ఇచ్చిన  వ్యాపారులు!

ఖాజానాకు పడిన గండిని పూడ్చుకునేందుకు ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్టు RRAను ప్రయోగించింది. అరెస్టుల భయం నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు ముందుకొచ్చి ప్రభుత్వానికి సుమారు 62 కోట్లు తిరిగి చెల్లించారు. మిగిలిన వారి నుంచి రికవరీ ఆగిపోయింది. తర్వాత కాలంలో రాష్ట్ర పన్నులు, కేంద్ర పన్నుల స్థానంలో GST రావడంతో వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన ఈ కుంభకోణం మరుగనపడింది. అప్పట్లో కుంభోణంతో ప్రమేయం ఉన్న అధికారులు, ఉద్యోగులకు నిజామాబాద్ డివిజన్ దాటి బదిలీలు, పదోన్నతులు ఇవ్వకుండా చేసినా ఉత్తర్వులకు కాలం కూడా చెల్లిపోయింది. 

టీఆర్‌ఎస్‌ కండువా కప్పేసుకున్న మరికొందరు!

ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యాపారులు, రైస్‌ మిల్లుల యజమానులు పలుకుబడి కలిగిన సంపన్నులు కావడంతో చర్యలు లేవనే విమర్శ ఉంది. అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వీరంతా.. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ కండువా కప్పేసుకున్నారు. అరెస్ట్‌లు, రికవరీల నుంచి తప్పించుకునేందుకే  గులాబీ కండువా కప్పుకొన్నారనే విమర్శలు వచ్చాయి. తర్వాత అదే నిజమని నమ్మేలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిపై ఈగ వాలలేదని చెబుతారు. విచారణలు అటకెక్కాయి. 

ప్రస్తుతం ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌!

ఈ కేసులో అరెస్టయిన అధికారులు బుక్కయిపోగా.. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా మారి గట్టెక్కేశారట. ప్రస్తుతం ఎవరైనా ఈ కేసు గురించి చెబితే.. ఇంకే తేలుతుంది.. ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అని ఓపెన్‌గానే కామెంట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ఖాజాను గండికొట్టినా.. ప్రజా ధనం లూటీ చేసినా.. అధికారపార్టీకి జైకొడితే అన్నీ మాఫీ అయిపోతాయనే సెటైర్లు పేలుతున్నాయి.