హైదరాబాద్ నగరంలో నాగార్జున సాగర్ బీజేపీ పంచాయతీ!

హైదరాబాద్ నగరంలో నాగార్జున సాగర్ బీజేపీ పంచాయతీ!

దుబ్బాక తర్వాత నాగార్జునసాగర్‌ ఉపఎన్నికపై ఫోకస్‌ పెట్టిన కమలనాథులకు తలనొప్పిగా మారారట స్థానిక నాయకులు. ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తున్నారట. దీంతో లాభం లేదని భావించిన రాష్ట్ర నాయకులు లోకల్‌ లీడర్స్‌ను హైదరాబాద్‌కు పిలిచి తలంటారట. అదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. 

హైకమాండ్‌ అండ ఉందని ఎవరికి వారు ప్రచారం!

తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్‌ మినహా.. టీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. బీజేపీలో అయితే జాబితలో పొందుపరుస్తున్న పేర్లకు అంతే ఉండటం లేదని సమాచారం. కాకపోతే ఆశావహుల సంఖ్య పెరిగిన కొద్దీ స్థానిక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయట. నిన్న మొన్నటి వరకు కలిసి మాట్లాడుకున్నవారు సైతం ఇప్పుడు శత్రువులుగా ఒకరినొకరు చూసుకుంటున్నారట. పైగా తమకే టికెట్‌ వస్తుందని ఎవరికి వారుగా చెప్పుకొంటూ ప్రచారం చేసేసుకుంటున్నారు. హైకమాండ్‌ అండదండలు తమకే ఉన్నాయని ఊదరగొడుతున్నారట. 

సాగర్‌ వ్యవహారాలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు!

బీజేపీ అనుమతి లేకుండా పాదయాత్రలు.. ప్రచారాల చేయడంపై రాష్ట్ర నాయకత్వం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. దీనిపై హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు ఫిర్యాదులు వెళ్లాయట. ఆ ఫిర్యాదులు ఆధారంగా పాదయాత్ర చేస్తున్న నేతను వివరణ అడిగారట పార్టీ పెద్దలు. అయితే పార్టీకి చెప్పే పాదయాత్ర చేశానని..పిలిచినా ఎవరూ రాలేదని చెప్పారట. ఈ వ్యవహారం స్థానికంగా పార్టీలో రగడకు దారితీస్తున్నట్టు తెలుస్తోంది. ఇంఛార్జ్‌లు.. ఇతర నేతలపై వైరి వర్గాలు రుసరుసలాడుతున్నట్టు చెబుతున్నారు. 

సాగర్‌ నేతలకు బండి సంజయ్‌ క్లాస్‌!

ఉపఎన్నికకు సిద్ధమవుతున్న సమయంలో నాగార్జునసాగర్‌ బీజేపీలోని వ్యవహారాలు తలనొప్పిగా మారడంతో.. అక్కడి నాయకులను హైదరాబాద్‌ పిలిచారట. బీజేపీ రాష్ట్ర వ్వవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సూచనలతో సాగర్‌ నేతలతో బండి సంజయ్‌ మాట్లాడారట. ఈ సందర్భంగా సంజయ్‌ గట్టిగానే క్లాస్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఎవరికి వారు అభ్యర్థులమంటూ ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారట. అధిష్ఠానం ప్రకటించేవరకు కామ్‌గా ఉండాలని తలంటినట్టు సమాచారం.  సొంత అజెండాలు మాని.. కలిసి పనిచేయాలని సూచించారట. 

తెరవెనక నేతలు యాక్టివ్‌గానే ఉన్నారా? 

హైదరాబాద్‌లో జరిగిన సాగర్‌ పంచాయతీపై  బీజేపీలో ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఈ మీటింగ్ తర్వాత ఎవరికివారుగా నాగార్జున సాగర్‌ వెళ్లిపోయారు. ప్రస్తుతానికి కామ్‌గానే ఉన్నా.. తెరవెనక మాత్రం యాక్టివ్‌గానే ఉన్నట్టు సమాచారం. మరి.. ఎన్నాళ్లిలా ఉగ్గబెట్టుకుని ఉంటారో చూడాలి.