బెజవాడ వైసీపీలో కార్పొరేషన్ ఎన్నికల సెగ !
నేనే మేయర్.. నాదే పీఠం. బెజవాడ వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సిగపట్ల రాజకీయం ఓ రేంజ్లో ఉంది. ఇదేదో మొదటికే మోసం వచ్చేలా ఉందని భావించిందో ఏమో.. వైసీపీ అలర్ట్ అయింది. పిలిచి సూటిగా సుత్తిలేకుండా వార్నింగ్‌లు ఇస్తోందట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
బెజవాడ మేయర్ పీఠం కోసం మహిళా నేతల కుస్తీ!
అసలే బెజవాడ వాతావరణం హాట్ హాట్‌గా ఉంటుంది. ఈ వేడికి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సెగ కూడా తోడైంది. మేయర్ పీఠం నీదా నాదా అన్నట్టు కాచుకుని కూర్చుని ఉన్నాయి వైసీపీ, టీడీపీ. గత ఎన్నికల్లో మేయర్ కుర్చీ తెలుగుదేశానిదే. ఈసారి దాన్ని నిలబెట్టుకోవాలన్నది తమ్ముళ్ల ప్లాన్. కీలకమైన విజయవాడ మేయర్ పీఠం చేజారితే కష్టమని భావిస్తోంది అధికార వైసీపీ. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ దిశగా పట్టుదలగానే ఉన్నారట. పార్టీల వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. ఎత్తుగడలు ఎలా ఉన్నా... వైసీపీలో కొత్త రగడ మొదలైంది. ఎన్నికలు జరగకుండానే నేనే మేయర్.. నాదే పీఠం అని మాటల తూటాలు పేల్చుతున్నారు మహిళా నేతలు. బెజవాడ మేయర్ కుర్చీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో పోటీ కూడా పెరిగింది. విజయవాడ మున్సిపాలిటీపై వైసీపీ జెండా రెపరెపలాడించి.. సీఎం జగన్ దగ్గర మార్కులు కొట్టేయాలని మంత్రి, ఎమ్మెల్యేలు చూస్తుంటే.. వారి అనుచరుల తీరు టెన్షన్ పెట్టిస్తోందట.
గీత దాటుతున్న వారిని పిలిచి వార్నింగ్ ఇస్తున్నారా?
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు బెజవాడ ద్విత్వీయ శ్రేణి నాయకుల తీరు, విమర్శలు వైసీపీ పెద్దల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయినట్టు సమాచారం. నేనే మేయర్.. నాదే పీఠం అని ఎవరైతే ప్రచారం చేసుకుంటున్నారో వారిని పిలిచి అక్షింతలు వేసినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇదే అంశంపై టీడీపీలోని వర్గాలు సైతం విభేదాలతో రచ్చకెక్కాయి. ఎంపీ కేశినేని నాని.. ఆయన వ్యతిరేకవర్గం రోడ్డెక్కాయి. అదే సీన్ వైసీపీలోనూ ఉండటంతో ఈ గొడవేంటని చికాకు పడుతున్నారట అధికారపార్టీ నేతలు.
నేనే మేయర్ అని వీడియో ప్రచారం
ఇతర అభ్యర్థులతో మరో నేత లాబీయింగ్
సెంట్ర్‌లో పరిధిలోని అభ్యర్థికీ అక్షింతలు
బెజవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీకి దిగుతున్న ఓ మహిళా నేత.. నేనే మేయర్‌ని అని చెప్పుకొంటున్న పలువీడియో క్లిప్పింగులు వైసీపీ అధిష్ఠానం దగ్గరకు వెళ్లాయట. దీనితో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఆ మహిళా నేతను పిలిచి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు చెబుతున్నారు. మరో మహిళా అభ్యర్థి అయితే అత్యుత్సాహం ప్రదర్శించి.. నేనే మేయర్‌గా ఉంటాను.. అంతగా కావాలంటే కొందరు కార్పొరేటర్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసి గెలిపించుకుంటానని ప్రయత్నాలు ప్రారంభించారట. ఈ విషయం తెలియడంతో.. ఆమెను పిలిచి అలాంటి ట్రయిల్స్ మానుకోవాలని హెచ్చరించి పంపారట. సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న తమకే మేయర్ సీటు వస్తుందని ప్రచారం చేస్తోన్న సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ అభ్యర్థికి కూడా పార్టీ పెద్దల నుంచి అక్షింతలు పడ్డాయట.
హితోక్తులు చెవికి ఎక్కుతాయా?
మేయర్ ఎవరు? ఏ నియోజకవర్గం నుంచి.. ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తామన్నది ఎన్నికల తర్వాత సీఎం జగన్ ప్రకటిస్తారట. అప్పటి వరకు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నది నేతల హితోక్తి. అయితే మేయర్ పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్న అధికార పార్టీలోని నాయకులకు ఈ హితోక్తులు చెవికి ఎక్కుతాయా? ఎన్నికలయ్యే వరకు కామ్‌గా ఉంటారా? లేక ఇప్పటి నుంచే మొదలుపెట్టిన కుర్చీలాటను మరింత ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)