రాజధాని తరలింపుపై త్వరలోనే ఆదేశాలు రానున్నాయా...?

రాజధాని తరలింపుపై త్వరలోనే ఆదేశాలు రానున్నాయా...?

విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించేందుకు ఇంకో ఏడాది పడుతుందని భావించారు అధికారులు. కానీ.. మంత్రి బొత్స లేటెస్ట్‌ కామెంట్స్‌ తర్వాత ఆలోచనలో పడ్డారట. ఏపీ సచివాలయంలో అలజడి మొదలైంది. కొందరు అధికారులు ముందు జాగ్రత్తగా విశాఖకు వేగులను పంపుతున్నారట. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

పరిపాలనా రాజధాని తరలింపునకు ఇంకా ఏడాది పడుతుందని భావించారట!

మూడు రాజధానులపై అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత అదిగో.. ఇదిగో అనే చర్చ జరుగుతూనే ఉంది. కోర్టులు.. కరోనా.. ఇలా ఏదో ఒక రూపంలో అవాంతరం వస్తోంది. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించిన తర్వాత పరిపాలనా రాజధాని తరలింపును ప్రభుత్వం స్పీడప్‌ చేసినట్టు కనిపిస్తోంది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లతోపాటు విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్లను వైసీపీ గెల్చుకున్న క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఇంకో ఆలోచన చేయకపోవచ్చనే చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకు కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు భావించారట. కొందరు మంత్రులు సైతం ఆంతరంగిక సంభాషణల్లో ఇంకా ఏడాది పట్టొచ్చని అభిప్రాయపడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ.. మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన కామెంట్స్‌తో అందరి అంచనాలు పటాపంచలయ్యాయట.

తరలింపునకు సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స ప్రకటన!

కోర్టులను ఒప్పిస్తామని చెబుతూనే.. ఏ క్షణంలోనే సరే విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నది మంత్రి బొత్స ప్రకటన. ఈ స్టేట్‌మెంటే రాజకీయ వర్గాలతోపాటు ఏపీ సచివాలయంలోనూ చర్చకు కారణమైంది. 

విశాఖలో అందుబాటులో ఉన్న భవనాలపై అధికారుల ఆరా!
కిందిస్థాయి ఉద్యోగులను వైజాగ్‌ పంపి వాకబు చేస్తోన్న అధికారులు!

ఇప్పటికిప్పుడు సచివాలయాన్ని విశాఖకు తరలించడం సాధ్యమా అన్నది కొందరి ప్రశ్న. కానీ.. కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త పడుతున్నారట. విశాఖలో తమ కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలు, వసతికి సంబంధించి ఇప్పటి నుంచే అన్వేషణ మొదలుపెట్టారట. తమ శాఖలకు సంబంధించి విశాఖలో అందుబాటులో ఉన్న భవనాలు, అక్కడి సదుపాయాల గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. కేవలం ఫోన్‌లో అక్కడి అధికారులతో మాట్లాడటమే కాకుండా తమ కిందిస్థాయి ఉద్యోగులను వైజాగ్‌కు పంపించి చూసి రమ్మంటున్నారట. ఈ తరహా వ్యవహారాలలో కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు బిజీగా ఉంటే.. ఇంకొందరు తమ శాఖలకు చెందిన భవనాల గురించి  తెలుసుకుని.. వాటిని ఏ విధంగా సిద్ధం చేయాలో ఆదేశాలు ఇస్తున్నట్టు సమాచారం. 

ఆదేశాలు రాతపూర్వకంగా కావాలని కొందరు ఉద్యోగులు పట్టు!

ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయట. భవనాల అన్వేషణ కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో విశాఖ వెళ్తున్న సిబ్బంది  ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపు అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. తాము విశాఖ వెళ్లినట్టు తెలిస్తే.. అది బయటకు లీకైతే తమకు లేనిపోని ఇబ్బందులు వస్తాయని బెదిరిపోతున్నారట ఉద్యోగులు. అటు పై అధికారులు చెప్పినట్టు చేయకపోయినా.. ఇటు కోర్టుల నుంచి  ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇరకాటంలో పడతామని ఆందోళన చెందుతున్నారట. అందుకే కొందరు ఉద్యోగులు ధైర్యం చేసి.. తమ వైజాగ్‌ పర్యటనపై రాతపూర్వక ఆదేశాలు కోరుతున్నట్టు చెబుతున్నారు. సిబ్బంది టెన్షన్‌ ఎలా ఉన్నా.. సచివాలయ అధికారులు మాత్రం తరలింపునకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.