పార్టీ నిర్ణయం కాదని తమ్ముళ్లు పోటీ చేస్తారా...?

పార్టీ నిర్ణయం కాదని తమ్ముళ్లు పోటీ చేస్తారా...?

పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ కఠిన నిర్ణయం తీసుకుంటే.. ఆ పార్టీ నాయకులు మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. ఇది పార్టీ వేసిన తప్పటడుగుగా కొందరు.. పార్టీకి తప్పలేదని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. కొన్నిచోట్ల పోటీకి సై అంటున్నారు. టీడీపీలో ఎందుకీ సమస్య? దీనిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారు? 

పార్టీ నిర్ణయానికి భిన్నంగా సీనియర్ల కామెంట్స్‌!

చంద్రబాబు ఈ ప్రకటన చేశారో లేదో ఏపీ టీడీపీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అనుకున్నవారు ఒక్కొక్కరుగా పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఓపెన్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను చూసిన తర్వాత MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ నిర్ణయం తీసుకుంది. కానీ, జ్యోతుల నెహ్రూ, అశోక్‌గజపతిరాజు,  హనుమంతరాయ చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి తదితరుల స్పందన ఇంకోలా ఉంది. 

పార్టీలోని సీనియర్లతో చంద్రబాబు మాట్లాడారా? 

ఎంపీటీసీ ఎన్నికల్లో 2014లో ఏకగ్రీవాలు 2 శాతంగా ఉంటే.. ఇప్పుడు ఏపీలో అవి 24 శాతానికి, ZPTC ఎన్నికల్లో నాడు 0.5 శాతంగా ఉండగా.. ఇప్పుడు 19 శాతానికి చేరుకున్నట్టుగా టీడీపీ చెబుతోంది. ఈ లెక్కలు ఎలా ఉన్నా..  ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో సీనియర్ల అభిప్రాయాన్ని చంద్రబాబు తీసుకున్నారా? వారితో మాట్లాడారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలా సంప్రదించి ఉంటే ఇప్పుడు పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడేవారు కాదు కదా అని పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారట. 

సీనియర్లు కామెంట్స్‌తో పార్టీలో మరో చర్చ!

వివిధ సందర్భాలలో అసెంబ్లీ, లోక్‌సభ ఉపఎన్నికలను టీడీపీ బహిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి. కానీ.. ఇవి క్షేత్రస్థాయిలో బలాన్ని నిరూపించుకునే ఎన్నికలు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఆలోచించినా.. కిందిస్థాయిలో మాత్రం కొన్ని పంతాలు పట్టింపులు ఉంటాయి. ప్రతిష్టగా తీసుకుని పోటీ చేస్తారు. చావో రేవో అన్నట్టుగా పోరాడతారు. ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయం కారణంగా  లోకల్‌గా  ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కేడర్‌ది. అందుకే చాలా చోట్ల పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు నాయకులు. మంగళగిరి వంటి ప్రాంతాల నుంచి అక్కడి మండల నాయకులు పోటీలో ఉన్నామని ప్రకటించారు కూడా. అందుకే  జ్యోతుల, అశోక్‌గజపతి రాజు వంటి వారు వ్యక్తి చేసిన అభిప్రాయాలు ఇప్పుడు చర్చకు కారణం అవుతున్నాయి. 

టీడీపీ నిర్ణయంపై కొందరు నేతల విస్మయం!

ఈ సమస్య ఎన్నడూ లేని విధంగా టీడీపీలో కాక రేపుతోంది. వెనక ఏం జరిగింది. పరిషత్‌ ఎన్నికల బహిష్కరపై ఎలాంటి చర్చ చేశారు అని పార్టీ నేతలు ఆరా తీసే పరిస్థితి ఉంది. ఇదే సమయంలో వైరిపక్షాలు టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ తీవ్ర గందరగోళంలో ఉన్న సమయంలో కూడా బాబు ఎనికల విషయంలో వెనుకడగుగు వెయ్యలేదు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అనేక ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేసింది. ఓటమి ఎదురైనా చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ప్రత్యర్థులకు అధికార బలం ఉన్నా వెనక్కి తగ్గలేదు. అయితే ఆ నాటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకోవడం పై చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీలో ఆగని తుఫాన్‌!

పంచాయతీ, మున్సిపల్‌ పోరు ఫలితాలు, పరిణామాలు చూసిన తర్వాత పరిషత్‌ ఎన్నికల్లో పోటీ వద్దని  కొద్ది రోజులుగా చంద్రబాబుపై నేతలు ఒత్తిడి చేస్తున్నారట. పొలిట్‌బ్యూరోలో కొందరు పోటీ చేయాలని సూచించారట. చివరకు మెజారిటీ అభిప్రాయం మేరకు విప్లవాత్మక నిర్ణయం తీసేసుకున్నారు. ఆ నిర్ణయమే టిడిపిలో పెద్ద తుఫాన్ నే రేపుతోంది. మరి.. సమస్యను పార్టీ అధినేత ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.