ఏపీ బీజేపీ నేతల కలలకు కేంద్రం బ్రేక్ !

ఏపీ బీజేపీ నేతల కలలకు కేంద్రం బ్రేక్ !

ఎదిగిపోవాలని ఆ పార్టీ ఆశిస్తోంది. ఇప్పుడుకాకుంటే ఇంకెప్పుడూ కాదని... సర్వశక్తులు ఒడ్డుతోంది. కానీ, ఆ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాలే.. వారికి  ప్రతిబంధకంగా మారుతున్నాయి. చిన్నా చితకా అంటే ఏదో ఒకటి చెయ్యోచ్చు.. కానీ పెద్ద పెద్ద సమస్యలు.. అదీ రాష్ట్రం మొత్తం ప్రభావం చూపేవి కావడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. 

ఏపీలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం. అందు కోసం జనసేనతో కలిసి కూటమి కూడా కట్టింది. ఎప్పుడూలేనిది ఆ పార్టీ నేతలు రాష్ట్రం అంతా తిరుగుతూ... వచ్చే వారికి, నచ్చిన వారికి కండువాలు కప్పేస్తున్నారు. పాలనకు వైసీపీ పనికి రాదని, టీడీపీకి ప్రత్యామ్నాయం మేమేనని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కమలనాధులు. వారి బలం ఏంటో ? ఎంతో ఎన్నికల్లోకానీ తేలదు. కానీ రాష్ట్ర నేతలు కంటున్న కలలకు కేంద్రం నుంచి బ్రేకులు పడుతున్నాయట. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా విషయాల్లో రాష్ట్ర ప్రజల మనోభావాలకు విరుద్ధమైన నిర్ణయాలు కేంద్రం తీసుకుంటోందట. రాష్ట్రం పట్ల ఏ కోణంలోనూ బీజేపీ అగ్రనాయకత్వం సానుభూతితోలేదన్న ఫీలింగ్  కలుగుతోందట. అందుకే బీజేపీ నేతలు కంగారుపడుతున్నారట. దేశం మొత్తానికి కలిపి ప్రకటించే పథకాలు తప్పించి ఏపీ కంటూ ప్రత్యేకంగా ఇదిగో.... ఇది... అని చెప్పడానికి, స్థానిక నేతలు ప్రచారం చేసుకోడానికి పెద్ద అంశాలు లేవనేది ఓ ఆరోపణ. అవి తమకు ఇబ్బందిగా మారాయని బీజేపీ నేతలు వాపోతున్నారట. బయటకు చెప్పుకోకపోయినా... లోపల మాత్రం టెన్షన్ పడిపోతున్నారట. 
రాష్ట్రం విడిపోయాక పోలవరం ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ కు పోలవరం జీవధారగా మారింది. జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం సవాలక్ష ఆంక్షలు పెడుతోంది. తాజా లెక్కల ప్రకారం 53వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు..  2013-14 అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామని కేంద్రం కొర్రీలు పెడుతోంది. దీంతో ప్రాజెక్టు  ప్రశ్నార్థకంగా మారింది?  దీనిమీద బీజేపి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ ఎఫెక్ట్ ఎ స్థాయిలో ఉంటుందోననే ఆందోళన  ఆ పార్టీ నేతల్లో ఉందట. రాజధాని అమరావతిలోనూ రాష్ట్ర బిజేపిది ఇరాకట పరిస్థితే.  చివరి రైతు వరకు న్యాయం జరగాలి... రాజధాని ఇక్కడే ఉండాలి అని చెప్పే రాష్ట్ర నేతలే... రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పేస్తారు. మూడు రాజధానులకు మద్దతు ఇచ్చే వారి సంగతి అటుంచితే... అమరావతే రాజధానిగా ఉండాలనే వారికి బీజేపీ తీరు అస్సలు రుచించడం లేదు.
ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అంశాల నుంచి కోలుకునేదారులు వెతుక్కుంటున్న బీజేపీకి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నెత్తిన బండ వేసినట్టు అయ్యింది. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గుతుందా? లేదా? అని పక్కన పెడితే.... రాష్ట్రం అంతా బీజేపీని దోషిగా చూస్తోంది. జగన్ లేఖ రాసినా... చంద్రబాబు డిమాండ్ చేసినా... ఆమరణ నిరాహార దీక్షలు, నిరసనలు జరుగుతున్నా కేంద్రం స్పందించడం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక బృందంలా వెళ్లి ఢిల్లీ పెద్దలను కలిసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే రాష్ట్రంలో తమ పరిస్థితి ఏం అవుతుందో అని మొరపెట్టుకుంది. అంతకు ముందు పొత్తు మిత్రుడు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు.. కానీ అనుకూల వైఖరి ఏదీ కేంద్రం నుంచి రాలేదు. విశాఖ ఉక్కును యావత్ రాష్ట్రం సెంటిమెంట్ గా ఫీల్ అవుతోంది. అదికానీ కేంద్రం అనుకున్నట్టే ప్రైవేటీకరణ అయితే.... జనం ఎలా స్పందిస్తారో అని నేతలు భయపడిపోతున్నారట.