కప్పట్రాళ్లలో వేడెక్కిన రాజకీయం...!

కప్పట్రాళ్లలో వేడెక్కిన రాజకీయం...!

ఒకప్పటి ఫ్యాక్షన్‌ గడ్డ కప్పట్రాళ్లలో రాజకీయ కప్పగంతలు వేడి పుట్టిస్తున్నాయి. పరిషత్‌ ఎన్నికల సమయంలో జరిగిన దాడులు ఆందోళన కలిగిస్తున్నాయా?  వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నాయా? ఇంతకీ కప్పట్రాళ్లలో ఏం జరుగుతోంది? 

కప్పట్రాళ్లలో ప్రస్తుతం రాజకీయ గొడవలే!

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల. ఫ్యాక్షన్‌ గొడవలు.. హత్యలు.. బాంబు దాడులతో ఒకప్పుడు దద్దరిల్లిన ప్రాంతం. 2008లో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడిని ఆయనతోపాటు ఉన్న 11 మందిని ప్రత్యర్థులు హత్య చేసిన తీరు స్థానిక పరిస్థితులకు అద్దం పడుతుంది. వివిధ సందర్భాలలో జరిగిన ఫ్యాక్షన్‌ హత్యల్లో అక్కడి రెండు వర్గాలకు చెందిన 38 మంది ప్రాణాలు కోల్పోయారు. వెంకటప్ప నాయుడు హత్య కేసులోని నిందితులకు కోర్టు జీవితఖైదు విధించింది. ఆ తర్వాత కప్పట్రాళ్లలో గణనీయమైన మార్పు వచ్చింది. మునుపటి వైషమ్య వాతావరణం  లేదు. అంతా రాజకీయ గొడవలే. 

పరిషత్‌ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు దాడులు!

కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆకె రవికృష్ణ.. కప్పట్రాళ్లను దత్తత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు బాట వేశారు. ప్రజల్లో మార్పుకు ఆ ప్రయత్నం బాట వేసింది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య లోకల్‌గా రాజకీయ ఆధిపత్యం తప్ప మరో మాట లేదు. కానీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు ఆందోళన కలిగిస్తున్నాయి. చాన్నాళ్ల తర్వాత వర్గపోరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేవరకు వెళ్లింది. 

బొజ్జమ్మ వ్యతిరేక వర్గానికి మద్దిలేటి వర్గం మద్దతు!

పంచాయతీ ఎన్నికల్లో వెంకటప్పనాయుడు మనవడు చెన్నమనాయుడు టీడీపీ మద్దతుతో సర్పంచ్‌ అయ్యారు. ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ నేత మల్లికార్జున్‌ బలపరిచిన రూపమ్మ, టీడీపీ నుంచి వెంకటప్పనాయుడు కోడలు హైమావతి బరిలో నిలిచారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వెంకటప్ప నాయుడు హత్య కేసులో నిందితుడైన మద్దిలేటి నాయుడు కుటుంబం రూపమ్మకు మద్దతివ్వడంతో పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ అభ్యర్థి హైమావతికి మద్దతుగా వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ వర్గం పోటాపోటీగా ప్రచారం చేసింది. పోలింగ్‌ మరో గంటలో ముగుస్తుందనగా వర్గపోరు దాడులకు ఉసిగొల్పింది. ఒకప్పుడు బొజ్జమ్మ, మల్లికార్జున్‌ ఇద్దరూ ఒకే వర్గంగా ఉండేవారు. ఇద్దరికీ మద్దిలేటే ప్రత్యర్థి. అలాంటిది బొజ్జమ్మ, మల్లికార్జున్‌ విడిపోవడం.. వేర్వేరు పార్టీలలో ఉండటం.. మల్లికార్జున్‌కు మద్దిలేటి మద్దతివ్వడం పరిస్థితిని మార్చేసిందట. 

బొజ్జమ్మ వైసీపీలోకి రాకుండా అడ్డుకునే యత్నమా?
వర్గపోరును రాజేస్తున్న రాజకీయ కప్పగంతులు!

కప్పట్రాళ్లలో తాజా గొడవల వెనక బలమైన కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. బొజ్జమ్మ టీడీపీని వీడి ఉగాది తర్వాత  వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారట. అది తెలుసుకున్న మద్దిలేటి వర్గం ఆమె రాకను అడ్డుకుంటున్నట్టు సమాచారం. అందుకే పరిషత్‌ పోలింగ్‌ రోజున దాడులు తెరపైకి వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. బొజ్జమ్మను, ఆమె వర్గాన్ని వైసీపీలో చేర్చుకునేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం సుముఖంగా ఉన్నట్టు సమచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని కాదని.. జయరామ్‌ గెలుపునకు ఆమె సహకరించినట్టు చెబుతారు.  మంత్రి ఒకటి అనుకుంటే.. కప్పట్రాళ్లలో మరోకటి జరుగుతోందట. రాజకీయ కప్పగంతులు వర్గపోరును రాజేస్తున్నాయని భావిస్తున్నారు. ఈ వైషమ్యాలు ఇక్కడితో ఆగుతాయో.. పాత విధానంలో మళ్లీ బుస కొడతాయో అన్న ఆందోళన స్థానికుల్లో ఉందట. మరి.. ఏ జరుగుతుందో చూడాలి.