మావోయిస్టుల సంచారం పెరిగిన ఆ జిల్లాకు రెగ్యులర్ ఎస్పీలు లేరా?

మావోయిస్టుల సంచారం పెరిగిన ఆ జిల్లాకు రెగ్యులర్ ఎస్పీలు లేరా?

ఓవైపు మావోయిస్టుల సంచారం.. మరోవైపు  ఇల్లీగల్‌ దందాలు కలవర పెడుతున్నాయి. అయినా ఆ జిల్లాలకు పూర్తిస్థాయిలో ఎస్పీలు లేరు. ఇంఛార్జులతోనే నెట్టుకొస్తున్నారు. కీలక సమయంలో ఎందుకిలా జరుగుతుందో సిబ్బందికి అర్ధం కావడం లేదట. ఇంతకీ ఆ జిల్లాల్లో ఏం జరుగుతోంది? 

రెగ్యులర్‌ ఎస్పీలు లేక ఇంఛార్జులపై భారం!

చాలా ఏళ్ల తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల సంచారం పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. రోజువారీ శాంతిభద్రతలు.. ఆదివాసీ డిమాండ్లపై ఎక్కడో ఒకచోట ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెగ్యులర్‌ ఎస్పీల లేకపోవడంతో ఇంఛార్జ్‌లుగా ఉన్నవారికి భారంగా మారుతోందట. రెండు బాధ్యతలు నిర్వర్తించడం పెద్ద విషయమేమీ కాకపోయినా..  సమస్యలు పెరిగి ఇబ్బందిగా మారుతోందట. 

ఇంఛార్జుల పాలనలో సమస్యలు అలాగే ఉంటున్నాయా?

ఆసిఫాబాద్‌ ఎస్పీగా పనిచేసిన మల్లారెడ్డి జనవరి 31న రిటైర్‌ అయ్యారు. ఈ 9 నెలల కాలంలో నుంచి ఇక్కడ ఇంఛార్జుల సారథ్యంలోనే నెట్టుకొస్తున్నారు. నిర్మల్‌ జిల్లా ఎస్పీగా ఉన్న శశిధర్‌రాజు జూన్‌ 30న  పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌కే రెండు జిల్లాల ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. అయితే మావోయిస్టుల కదలికలు పెరగడంతో ఆసిఫాబాద్‌ ఇంఛార్జ్‌ ఎస్పీగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల డీసీపీగా ఉన్న ఉదయ్‌కుమార్‌ రెడ్డిని సైతం అదనపు OSDగా  నియమించారు. ఇంఛార్జులు సమర్థమంతంగా పనిచేస్తున్నా.. సమస్యలు అలాగే ఉంటున్నాయట. 

మావోయిస్టుల కట్టడికి పూర్తి స్థాయి ఎస్పీలు ఉండాలా? 

తెలంగాణలో చాలా ఏళ్లుగా IPSల బదిలీలు లేవు. వ్యవస్థ నడుస్తుంది కదా అని ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని వేయడం లేదు. ఇంఛార్జులను పెట్టి నడిపేస్తున్నారు. దీంతో ఇంఛార్జులుగా ఉన్నవారికి పని భారంగా మారుతోందనే టాక్‌ డిపార్ట్‌మెంట్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా మావోయిస్టుల కార్యకలాపాల కట్టడికి సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్న సమయంలో జిల్లాల్లో పూర్తిస్థాయి ఎస్పీలు ఉండాలనేది కొందరి వాదన.    

డీజీపీ రావడంతో ఉరుకులుపెట్టిన ఇంఛార్జులు!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు మహారాష్ట్రతో సరిహద్దు ప్రాంతం ఎక్కువ. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు గుట్కా, రేషన్‌ బియ్యం, మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పూర్తిస్థాయి ఎస్పీ లేకపోవడంతో  కిందిస్థాయి సిబ్బంది వీటిని అంతా పట్టించుకోవడం లేదట. పైగా ఇటీవల మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో తిర్యాణి, మంగి ప్రాంతాలలో డీజీపీ రెండుసార్లు పర్యటించారు. ఆ సమయంలో ఇంఛార్జులుగా ఉన్న అధికారులంతా ఆగమేఘాలపై  జిల్లాలకు రావాల్సి వచ్చింది. దాంతో ఈ జిల్లాలకు రెగ్యులర్‌ ఎస్పీలు ఎప్పుడొస్తారో.. ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయో అన్న చర్చ పోలీస్‌ వర్గాల్లో నడుస్తోంది.