అన్నయ్య కృషికి లభించిన గుర్తింపు ఇది: ఎస్.పి. శైలజ

అన్నయ్య కృషికి లభించిన గుర్తింపు ఇది: ఎస్.పి. శైలజ

గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. అయితే... దేశంలోనే రెండో అత్యుత్తమ పురస్కారాన్ని బాల సుబ్రహ్మణ్యంకు ప్రకటించడం పట్ల ఆయన సోదరి, ప్రముఖ గాయని ఎస్.పి. శైలజ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం వచ్చిన ఆనందాన్ని అన్నయ్యతో కలిసి పంచుకోలేకపోవడం ఎంతో బాధగా ఉందని, భగవంతుని నిర్ణయాన్ని ఆమోదించక తప్పదని, అందులోని మంచిని మాత్రమే గ్రహించాలని ఆమె చెప్పారు. తన అన్నయ్యకు పద్మవిభూషణ్ పురస్కారం లభించడం పట్ల ఎంతో మంది అభిమానులు ఆనందపడ్డారని, ఆశీస్సులను, శుభాకాంక్షలను అందించారని చెబుతూ, వారందరికీ శైలజ కృతజ్ఞతలు తెలిపారు. అన్నయ్య యాభై సంవత్సరాల కృషికి ఇదో చక్కని గుర్తింపుగా తాను భావిస్తున్నానని శైలజ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబానికి అండదండలుగా ఉన్న అభిమానులందరికీ శైలజ కృతజ్ఞతలు చెబుతూ, ఎల్లవేళలా అవి తమకు ఉండానే ఆకాంక్షను వ్యక్తం చేశారు.