మరపురాని మధురం ... కోదండపాణి సంగీతం

మరపురాని మధురం ... కోదండపాణి సంగీతం

"ఇదిగో దేవుడు చేసిన బొమ్మ... ఇది నిలిచేదేమో మూడు రోజులు... బంధాలేమో పదివేలు..." అన్న పాటను స్వయంగా ఆలపించి, 'పండంటి కాపురం' కోసం స్వరపరిచారు ఎస్.పి.కోదండపాణి. ఆయన చిత్రసీమలో  ఉన్నది కొన్నాళ్ళే అయినా, మరపురాని మరచిపోలేని మధురాన్ని మనసొంతం చేశారు. ఆ సంగీతబంధంతోనే ఈ నాటికీ శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణిని జనం తలచుకుంటూనే ఉన్నారు. కోదండపాణి బాణీల్లో రూపొందిన పాటలను మననం చేసుకుంటూ మహదానందం చెందుతూనే ఉన్నారు సంగీతాభిమానులు. భారతదేశం గర్వించదగ్గ గాయకులు ఏసుదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను తెలుగువారికి పరిచయం చేసింది కోదండపాణే! ఆ విధంగా ఆ ఇద్దరు మధురగాయకులను స్మరించుకున్న ప్రతీసారి కోదండపాణినీ గుర్తు చేసుకోవలసిందే!

ఆ ఇద్దరికీ... ఆయనే... 
కోదండపాణి 1932లో గుంటూరులో జన్మించారు. బాల్యం గుంటూరులోనే సాగింది. చిన్నప్పటి నుంచీ  సంగీతం అంటే మోజు. దాంతో పద్యాలు, పాటలు పాడుతూ, హార్మోనియం నేర్చుకున్నారు. అద్దేపల్లి రామారావు ప్రోత్సాహంతో 'నా ఇల్లు' సినిమాలో ఓ బృందగానంలో కోదండపాణి తన గళం వినిపించారు. ఆ తరువాత సుసర్ల దక్షిణామూర్తి వద్ద కొన్నాళ్ళు  హార్మోనియం వాయిస్తూ గడిపారు. ప్రయోగాలకు పెట్టింది పేరయిన సుసర్ల వారి వద్ద ఉండగానే కోదండపాణి తానూ బాణీల్లో కొత్త వరుసలు కట్టే ప్రయత్నం చేసేవారు. ఆపై కేవీ మహదేవన్ వద్ద కూడా కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు. 1961లో తెరకెక్కిన 'కన్నకొడుకు' చిత్రానికి స్వరకల్పన చేసి, సంగీత దర్శకుడయ్యారు కోదండపాణి. తరువాత "పదండి ముందుకు, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల-కోటలో రాణి" వంటి చిత్రాలకు స్వరకల్పన చేశారు. 'బంగారు తిమ్మరాజు'తోనే మధురగాయకుడు ఏసుదాసును తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు కోదండపాణి. ఇందులోని "ఓ నిండు చందమామ... నిగనిగలా భామా..." గీతం తొలిసారి ఏసుదాసు నోట పలికిన తెలుగుపాటగా నిలచింది. 
అంతకు ముందే నాటకాల ద్వారా నటుడు పద్మనాభంతో కోదండపాణికి మంచి పరిచయం ఉండేది. యన్టీఆర్ హీరోగా పద్మనాభం 'దేవత' (1965) చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఎస్పీ కోదండపాణి సమకూర్చిన సంగీతం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రం తరువాత రేఖా అండ్ మురళీ ఆర్ట్స్  పతాకంపై పద్మనాభం నిర్మించిన అనేక చిత్రాలకు కోదండపాణి స్వరకల్పన చేశారు. పద్మనాభం నిర్మించిన 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' చిత్రంలోనే తొలిసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాట పాడించారు కోదండపాణి. ఆయన సంగీతాన్ని అభిమానించి, ఆరాధించిన పలువురు నిర్మాతలు, కోదండపాణి బాణీల్లోనే సాగారు. 

జానపదాల్లో కోదండపాణి బాణీ!
అనేక జానపద చిత్రాలకు ఎస్.పి. కోదండపాణి సంగీతం సమకూర్చి  అలరించారు. ఆ రోజుల్లో కోదండపాణి స్వరకల్పనలో ఓ జానపద చిత్రం వస్తోందంటే చాలు, సంగీతాభిమానులకు మహదానందం కలిగేది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కోదండపాణి స్వరవిన్యాసాలు చేసి అలరించేవారు. యన్టీఆర్ నటించిన జానపద చిత్రాలు "గోపాలుడు-భూపాలుడు, లక్ష్మీ కటాక్షం"కు కోదండపాణి స్వరపరచిన బాణీలు ఈ నాటికీ జనాన్ని అలరిస్తూనే ఉన్నాయి. ఇక కాంతారావు కథానాయకునిగా రూపొందిన జానపదాలు- "బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల-కోటలో రాణి, జ్వాలాద్వీప రహస్యం, రణభేరి, పేదరాశి పెద్దమ్మ కథ, భలే మొనగాడు, అగ్గిమీద గుగ్గిలం, ఇద్దరు మొనగాళ్ళు, భూలోకంలో యమలోకం, గండర గండడు, ఆకాశరామన్న, పక్కలో బల్లెం, గురువును మించిన శిష్యుడు" వంటి చిత్రాలకు కోదండపాణి సంగీతమే ప్రాణం పోసింది. ఇక కృష్ణ కెరీర్ లో తొలి బిగ్ హిట్ గా నిలచిన 'పండంటి కాపురం' కు కోదండపాణి స్వరకల్పన చేసి, అలరించారు. వాణిశ్రీకి నటిగా మంచి పేరు సంపాదించి పెట్టిన 'సుఖదుఃఖాలు'కు కూడా కోదండపాణి సంగీతం ఆయువుగా నిలచింది. 
తెలుగు చిత్రసీమలో మధురమైన సంగీతం ప్రస్తావన వచ్చిన సమయంలో ఎస్.పి.కోదండపాణి పేరు కూడా తరచూ వినిపిస్తూ ఉంటుంది. తనను సినిమా రంగానికి పరిచయం చేసి, ఎంతగానో ప్రోత్సహించిన కోదండపాణి పేరు మీద రికార్డింగ్ థియేటర్ నిర్మించి, తన భక్తిని చాటుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఇప్పటికీ సంగీతప్రియులకు కోదండపాణి స్వరకల్పన ఆనందం పంచుతూనే ఉందనడంలో అతిశయోక్తి లేదు.