యూపీలో బీజేపీకి షాక్.. వారణాసి, అయోధ్యలో అదే ప‌రిస్థితి..!

యూపీలో బీజేపీకి షాక్.. వారణాసి, అయోధ్యలో అదే ప‌రిస్థితి..!

వచ్చే ఏడాది సరిగ్గా ఈ సమయానికి యూపీలో అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు స్థానిక ఎన్నికలే కొలమానమంటూ రంగంలోకి దిగాయి రాజకీయ పార్టీలు. మ‌రోవైపు.. గత నెలలో పంచాయితీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్‌లకు కూడా ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్‌పై గొడవ జరిగడంతో వ్యవహారం సుప్రీం దాకా వెళ్ళింది. మొత్తానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇవాళ కౌంటింగ్‌ మొదలైంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాలు యోగి ఆదిత్యనాథ్‌కు భారీ షాక్‌ ఇచ్చాయి. అందులోనూ ప్రధాని మోడీ ప్రాతినిధ్య వహిస్తున్న వారణాసిలో సమాజ్‌ వాదీ పార్టీ దూకుడు ఆ పార్టీ వర్గాలనే విస్మయపరుస్తోంది. ఆధ్మాత్మిక టూరిజం క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తున్న అయోధ్య, వారణాసి, మథురలలో బీజేపీ అభ్యర్థుల ఘోర ఓటమి ఆదిత్యనాథ్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. 3,050 పంచాయితీలకు గాను 2,761 పంచాయితీల ఫలితాలు వచ్చాయి. ఇందులో బీజేపీకి గెలిచింది కేవలం 771 సీట్లే. మూడోవంతు సీట్లు కూడా రాలేదన్నమాట. 715 సీట్లతో సమాజ్‌ వాదీ పార్టీ రెండో స్థానంలో ఉండగా,బీఎస్పీ 345 స్థానాలు గెల్చుకుంది.

అలాగే ఎమ్మెల్యేల స్థానాలను తలిపించే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక వారణాసి విషయానికొస్తే... ఈ జిల్లాలో 40 స్థానాలు ఉండగా బీజేపీ కేవలం 8 సీట్లలో మాత్రమే గెలిచింది. సమాజ్‌వాదీ పార్టీ 15 సీట్లను గెల్చుకోగా, బీఎస్పీకి 5 సీట్లు వచ్చాయి. అప్నాదళ్‌ (ఎస్‌)కు మూడు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఒక స్థానం దక్కాయి. మిగిలినచోట్ల స్వతంత్రులు గెలిచారు. ఇక మథురలో 33 స్థానాలు ఉండగా బీఎస్పీకి 12 స్థానాలు దక్కగా, అజిత్‌సింగ్‌ పార్టీకి 9 స్థానాలు దక్కాయి. ఇక్కడా బీజేపీకి కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అత్యంతక నగరమైన అయోధ్యలో బీజేపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడ 40 స్థానాలు ఉండగా సమాజ్‌వాదీ పార్టీకి 24 స్థానాలు దక్కాయి. బీజేపీకి కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.