పండుగ సీజన్‌లో గుడ్‌న్యూస్‌.. చౌకగా బంగారం...!

పండుగ సీజన్‌లో గుడ్‌న్యూస్‌.. చౌకగా బంగారం...!

పండుగ సీజన్‌లో గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం... మార్కెట్‌ ధర కంటే చౌకగా బంగారం అందించనుంది.. దసరా, దీపావళి పండుగ సీజన్‌కు ముందు కేంద్ర  ప్రభుత్వం మరోసారి చౌక బంగారం కొనడానికి అవకాశం కల్పిస్తున్నది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఏడో సిరీస్ కింద ఈ నెల 12 నుంచి 16 వరకు ఐదు రోజులపాటు తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ఎవరైనా గ్రాము నుంచి నాలుగు కిలోల వరకు బంగారాన్ని కొనుగోలు చేసే వేసులుబాటు ఉన్నది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ట్రస్టీ వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు బాండ్ల అమ్మకం నిషేధించారు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం తరపున జారీ చేసే గోల్డ్ బాండ్‌ ధరను గ్రాముకు రూ. 5,051గా నిర్ణయించారు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, డిజిటల్ మోడ్ ద్వారా చెల్లింపులు చేసేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. అంటే.. వారికి గ్రాము బంగారం రూ. 5,001కే అన్నమాట.. సావరిన్ బంగారు బాండ్లను ఆర్బిఐ.. భారత ప్రభుత్వం తరపున జారీ చేస్తుంది. బంగారం డిమాండ్‌ను తగ్గించడానికి మరియు దేశీయ పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపుగా మార్చడానికి 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రారంభించారు.. ఇక, బంగారు బాండ్లు పెట్టుబడిదారులకు వార్షిక వడ్డీ రేటును 2.50 శాంతం అందిస్తారు.. అంటే.. బంగారం బాండ్ కొనిపెడితే చాలు.. దానిపై వడ్డీ కూడా వస్తుందన్నమాట.