సోనూసూద్‌ను అభినందించిన గవర్నర్‌

సోనూసూద్‌ను అభినందించిన గవర్నర్‌

ప్రపంచం మొత్తం కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి చేతిలో చిక్కుకొని విలవిల్లాడిపోతోంది. దీని వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. దీని వలన రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. సొంతూళ్లకు వెళ్లేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. జాతీయ రహదారులపై ఎక్కడా చూసిని వేలాది మంది ఇళ్లకు చేరేందుకు పడుతున్న కష్టాలే కనిపిస్తాయి. రవాణా సౌకర్యాలు అంతగా లేకపోవడంతో కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు.  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే.  ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండగా నిలబడుతున్నారు.కేరళలో చిక్కుకున్న మహిళల్ని తమ సొంత రాష్ట్రం ఒడిశాకు పంపేందుకు సోనూసూద్‌ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. దీంతో అందరూ సోనూసూద్ ని కొనియాడుతున్నారు. ఈ క్రమంలో అతను చేస్తున్న సహాయ కార్యక్రమాలపై మహారాష్ట్ర గవర్నర్‌ఆయననుఁ అభినందించారు. ఈ నేపథ్యంలో సోనూసూద్‌ను ముంబయిలోని రాజ్‌భవన్‌కు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కౌశ్యారీ ఆహ్వానించారు. వలస కార్మికులు క్షేమంగా ఇల్లు చేరేందుకు ఏర్పాట్లు చేసినందుకు అభినందించారు. ఇలాంటి మంచి పనులకు సాయం చేయడానికి ప్రభుత్వం సాయం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. 'సినీ నటుడు సోనూసూద్‌ను ముంబయిలోని రాజ్‌భవన్‌కు ఆహ్వానించాం. ఆయన వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు చేరేందుకు, రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి, వారికి ఆహారం కూడా పంపిణీ చేశారు. ఆయన్ను ప్రశంసించి, సాయం చేస్తామని హామీ ఇచ్చాం' అని గవర్నర్‌ ట్వీట్‌ చేశారు.