కాంగ్రెస్‌లో తగ్గని సీనియర్ల లేఖ కాక.. అధినేత్రి చెక్‌ పెడుతున్నారు..!

కాంగ్రెస్‌లో తగ్గని సీనియర్ల లేఖ కాక.. అధినేత్రి చెక్‌ పెడుతున్నారు..!

కాంగ్రెస్ అధిష్ఠానానికి సీనియర్లు రాసిన లేఖ ఇంకా కాక రేపుతూనే ఉంది. వివాదం ముగిసిందని సోనియా ప్రకటించినా.. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ.. సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి ప్రాధాన్యతను తగ్గించి వేయడం ఆ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది.

రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్‌గా సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ సమన్వయం కోసం జైరాంతో పాటు.. సోనియా రాజకీయ సలహాదారైన అహ్మద్ పటేల్, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు కమిటీ ఏర్పాటు చేశారు. అందులోనే రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజద్, ఉప నేతగా ఉన్న ఆనంద్ శర్మలను సభ్యులుగా చేర్చారు. దీనిని బట్టి చూస్తే వీరి ప్రాధాన్యతను తగ్గించినట్లైంది. లోక్ సభలో సీనియర్ నేతలైన మనీష్ తివారీ, శశి థరూర్ ప్రాధాన్యతను తగ్గించారు. అక్కడ ఉప నేత బాధ్యతలను అసోం యంగ్ లీడర్ గౌరవ్ గొగొయ్ కి అప్పగించారు. విప్ గా పంజాబ్ లోని లుథియానా లోక్ సభ సభ్యుడు రవ్ నీత్ సింగ్ బిట్టును నియమించారు. ఈ యంగ్ లీడర్స్ యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయంగా ఎదిగారు. వీరిద్దరికీ రాహుల్ టీమ్ సభ్యులుగా గుర్తింపు ఉంది.