ఏపీలో మోడీయిజన్ని స్థాపించడమే బీజేపీ లక్ష్యం !

ఏపీలో మోడీయిజన్ని స్థాపించడమే బీజేపీ లక్ష్యం !


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గుంటూరులో ఉన్న బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని బిజెపి - జనసేన వ్యూహమని అన్నారు. తెలంగాణాతో కలిసి ఉండటం వల్ల 13 జిల్లాలు నష్టపోయాయని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది బిజెపి విధానమని ఆయన అన్నారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఆయన ఏపీలో మోడీయియుజాన్ని స్థాపించటమే బీజేపీ లక్ష్యమని అన్నారు.

రెండు కుటుంబ పార్టీల మధ్య ఏపీ నష్టపోతుందన్న ఆయన రెండు ప్రాంతీయ పార్టీల మధ్య బిజెపికి అవకాశం లేదనే వాదన సరికాదని అన్నారు. సామాజిక సమతుల్యం అంటారు కానీ ఎవరికీ అధికారాలు ఇవ్వరని అన్నారు. ప్రస్తుతం హోం మంత్రి ఒక డీఎస్పీని బదిలీ చేయగలరా ? అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పరిపాలనే ఉంటుందన్న ఆయన అది తమిళనాడు, యుపి, బీహార్, తెలంగాణ తో పాటు ఏపీలో కూడా రుజువైందని అన్నారు. వీటికి ప్రత్యామ్నాయ ఎజెండాను బిజెపి అమలు చేస్తోందని, మోదీ వంటి బీసి ని ప్రధాని చేసింది బిజెపి పార్టీనేనన్న ఆయన ఏపీలో బీసిలను సీఎం చేసే పార్టీ ఏదైనా ఉందా ? అని ప్రశ్నించారు.

స్మశానాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తే అప్పుడు టిడిపి , ఇపుడు వైసిపి రంగులు వేస్తున్నారని, రంగులు వేసుకోవటం కోసం  జగన్ 151 సీట్లు గెలిచారా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని రైతులకు 64 వేల ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి కానీ గతంలో చంద్రబాబు ఆ పని చేయలేకపోయారని రైతులకు పోగా... మిగతా 9వేల ఎకరాలు ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఆ భూముల చుట్టూ ఎవరెవరి భూములు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఆయన మాకు అధికారం ఇస్తే అభివృద్ది అంటే ఏంటో మేం చేసి చూపిస్తామని అన్నారు.