సిరులు కురిపించిన సింగారి సిమ్రాన్...!

సిరులు కురిపించిన సింగారి సిమ్రాన్...!

ఇప్పుడంటే అమ్మ పాత్రలు, అత్త పాత్రలు చేస్తోంది కానీ, ఒకప్పుడు సిమ్రాన్ అందం జనానికి కనువిందుచేసి చిందులు వేయించింది. నాటి కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఈ నాటికీ నాటి అభిమానుల మదిలో శృంగారదేవతగా తిష్టవేసుకొనే ఉంది సిమ్రాన్. ఉత్తరాదిన ఉదయించిన ఈ భామ దక్షిణాది చిత్రాలతోనే ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో సిమ్రాన్ చెలరేగిపోయింది. సిమ్రాన్ నాయికగా రూపొందిన పలు చిత్రాలు వసూళ్ళ  వర్షం కురిపించాయి. హీరోయిన్ గా ఫేడవుట్ కాగానే తెలివిగా పెళ్ళి చేసుకొని సంసారపక్షంగా ఉన్న సిమ్రాన్ ను మళ్ళీ  సినిమాలు పిలుస్తున్నాయి. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి ఉత్సాహంగా ఉంది సిమ్రాన్. 

టాలీవుడ్ టాప్ హీరోస్ తో తడాఖా...
టీనేజ్ లోనే సిమ్రాన్ సినిమా రంగంలో అడుగు పెట్టింది. 'సనమ్ హర్ జై' హిందీ చిత్రంలో తొలిసారి నటించిన సిమ్రాన్ అప్పటి నుంచీ బ్రేక్ కోసం ఉత్తరాది నుండి దక్షిణాదికి, ఇటు నుంచి అటు పరుగులు తీసింది. దక్షిణాది చిత్రాలే ఆమెకు మంచి గుర్తింపును ప్రసాదించాయి. తెలుగులో సుమన్ హీరోగా రూపొందిన 'అబ్బాయిగారి పెళ్ళి'తో తొలిసారి మన జనం ముందు నిలచింది. ఆ సినిమాలోనే సిమ్రాన్ అందం అయస్కాంతంలా  యువకులను ఆకర్షించింది. ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలిపిన చిత్రం బాలకృష్ణ హీరోగా నటించిన 'సమరసింహారెడ్డి'. ఈ చిత్ర ఘనవిజయంతో సిమ్రాన్ కాల్ షీట్స్  కు క్రేజ్ ఏర్పడింది. తరువాత చిరంజీవితో 'అన్నయ్య'లో ఒక్కపాటలోనే చిందేసి కనువిందు చేసింది. ఆపై వెంకటేశ్ 'కలిసుందాం రా'లో ముద్దు ముద్దుగా మురిపించింది. నాగార్జున కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచిన 'నువ్వు వస్తావని'లోనూ సిమ్రాన్ నాయికగా ఆకట్టుకుంది. ఇలా టాలీవుడ్ టాప్ హీరోస్ తో వరుసగా బిగ్ హిట్స్  చూడటంతో సిమ్రాన్ పేరు తెలుగునాట మారుమోగిపోయింది. సిమ్రాన్ ఉంటే చాలు ఆమె అందాల అభినయాన్ని చూసేందుకు జనం పరుగులు తీసేవారు. మరోమారు బాలకృష్ణతో 'నరసింహనాయుడు'లో  నటించిన సిమ్రాన్ కు మరో భారీ విజయం దక్కడమే కాదు, నటిగానూ మంచి మార్కులు పడ్డాయి. బాలకృష్ణతో "గొప్పింటి అల్లుడు, సీమసింహం, ఒక్క మగాడు" వంటి చిత్రాలలోనూ మురిపించింది. ఇక చిరంజీవితో "మృగరాజు, డాడీ" సినిమాల్లో నటించింది. నాగార్జునతో 'బావనచ్చాడు'లోనూ, వెంకటేశ్ తో 'ప్రేమతో రా'లోనూ నటించి ఆకట్టుకుంది. హరికృష్ణతో సిమ్రాన్ నటించిన 'సీతయ్య'లోనూ అమ్మడు అందంతో అదరహో అనిపించింది. మహేశ్ బాబుతో 'యువరాజు'లోనూ అలరించింది. ఇలా టాప్ స్టార్స్ తో టాలీవుడ్ లో భమ్ చిక భమ్ ఆడించింది. ఆమె నటించిన పలు చిత్రాలు నిర్మాతలకు సిరులు కురిపించాయనే చెప్పాలి. 

సిమ్రాన్ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నటించి మురిపించింది. తరువాత పెళ్ళి చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరంగా జరిగింది. 2008లో బుల్లితెరపై కనిపించి కనువిందు చేసింది. జయ టీవీలో ప్రసారమైన 'సిమ్రాన్ దిరై' సీరియల్ తో భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగులో 'జాన్ అప్పారావ్ 40 ప్లస్'లో కృష్ణ భగవాన్ సరసన సైతం మురిపించింది సిమ్రాన్. తమిళంలో ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. రజనీకాంత్ 'పేట్ట'లో తొలిసారి ఆయన సరసన నటించింది సిమ్రాన్. మరి తెలుగులో ఏ సినిమాతో సిమ్రాన్ మళ్ళీ మనవాళ్ళను పలకరిస్తుందో చూద్దాం.