'వకీల్ సాబ్'తో 'శ్రుతి' కలవలేదంటున్నారే!

'వకీల్ సాబ్'తో 'శ్రుతి' కలవలేదంటున్నారే!

రీమేక్ సినిమా చేయటం చాలా ఈజీ! అయితే, నిజంగా రీమేక్ చేస్తేగానీ అందులోని చీకూ, చింతా తెలియవు! మరీ ముఖ్యంగా, రీమేక్ వర్షన్ లో స్టార్ హీరో ఉంటే రిస్క్ మరింత పెరుగుతుంది. సాధారణ జనం ఒరిజినల్ తో పొలుస్తారు. డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోకు అవసరమైన మసాలా ఆశిస్తారు. అన్నిట్నీ బ్యాలెన్స్ చేస్తేనే రీమేక్ మూవీ డైరెక్టర్ సక్సెస్ అయినట్టు లెక్క! ఇక 'వకీల్ సాబ్'తో దర్శకుడు వేణు శ్రీరామ్ సత్తా చాటాడు. 'పింక్' రీమేక్ ను అసలు చెడగొట్టకుండా, కొసరు జాగ్రత్తగా జోడిస్తూ హిట్ చేసేశాడు!

'వకీల్ సాబ్' బాలీవుడ్ ఒరిజినల్ మూవీ 'పింక్'కు రీమేక్ అని మనకు తెలిసిందే. అయితే, పవర్ స్టార్ ఇమేజ్ కు అనుగుణంగా ఫ్యాన్స్ కోసం మార్పులు చేర్పులు చేశారు. అందులో భాగంగా లాయర్ గారికి లవ్వర్ ని తీసుకొచ్చారు. ఆమే 'గబ్బర్ సింగ్' గాళ్... శ్రుతీ హసన్. 'కాటమరాయుడు' బ్యూటీతో కళ్యాణ్ బాబు రొమాన్స్ అభిమానులకి నచ్చవచ్చుగానీ... ఇతర ప్రేక్షకులకి కాస్త బోర్ గా అనిపించిందట. శ్రుతీ హసన్ సీన్స్ లో పెద్దగా కొత్తదనం ఏం లేదని, పైగా కోర్ట్ డ్రామాతో నడుస్తోన్న స్టోరీని లవ్ ట్రాక్ స్లోడౌన్ చేసేసిందని అంటున్నారు. క్రిటిక్స్ కూడా అలాగే ఫీలవుతున్నారు...

'వకీల్ సాబ్'కు ఇప్పటికే హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి హీరోయిన్ తో నడిపిన ట్రాక్ ఎలాంటి రెస్పాన్స్ తీసుకొచ్చినా పెద్ద నష్టమేం ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడు చిక్కంతా సీనియర్ సుందరి శ్రుతీకే! ఆమె చేతిలో పెద్దగా తెలుగు సినిమాలేం లేవు. పవన్ తో చేసిన సినిమాకి కూడా మరీ పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే... ఇకపై స్టార్ హీరోలు శ్రుతీతో మూవీస్ చేస్తారా? 35 ఏళ్ల లేడీ హసన్ మున్ముందు తెలుగు సినిమాల్లో వరుసగా కనిపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!