లాక్‌డౌన్ ఎఫెక్ట్.. అత్యవసర మందుల కొరత..?

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. అత్యవసర మందుల కొరత..?

లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న ఆందోళనతో రోగులు రెండు నుంచి మూడు నెలలకు సరిపోయే మందులను ఒకేసారి కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా బీపీ, షుగర్‌కు సంబంధించిన మందులను ఒకేసారి కొనుగోలు చేయడంతో దుకాణాల్లో స్టాక్‌ అడుగంటింది. రోగులు కోరిన కంపెనీలను కాకుండా అదే ఫార్ములాతో ఉన్న ఇతర కంపెనీల ఔషధాలను తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో జలుబు, దగ్గు మందులు సైతం జనం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి పెట్టుకున్నారు. కరోనాకు హైడ్రాక్లిన్‌ క్లోరికిన్‌, అజిత్రోమైసిన్‌ అనే యాంటీబయాటిక్‌ మందులు పనిచేస్తాయనిప్రచారం జరగడంతో మొదట్లో ఆ మందులను సామాన్యులు కొనుగోలుచేసి పెట్టుకున్నట్లు మెడికల్ షాప్ యజమానులు చెబుతున్నారు.

సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం 20 శాతం విక్రయాలు పెరిగాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఇదో భాగమైతే ఆర్థిక సంవత్సరం మార్చితో మొదలవుతుంది. దీంతో ఫిబ్రవరి, మార్చిలో బడా డీలర్లు ఆర్థిక లావాదేవీలను సర్ధుబాటు చేసుకునేందుకు ఆర్డర్లు తక్కువగా పెట్టారని తెలుస్తోంది. ఇది ప్రతి ఆర్థిక సంవత్సరంలో సర్వసాధారణంగా జరిగేది. అయితే ఇదే సమయంలో కరోనా వైరస్‌ వెలుగు చూడటంతో అవసరాల మేరకు జిల్లాలకు మందులు రాక ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు నగదు చెల్లించి సరుకు తీసుకెళ్లాలంటూ బడా డీలర్లు నిబంధనలు పెట్టడంతో ఇబ్బందులు తలెత్తాయని రిటైలర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు వాహనాలకు అనుమతుల విషయంలో మెడికల్‌ షాపుల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మాస్కులు, శానిటైజర్ల ఉత్పత్తులు మెడికల్‌ షాపులకు రావడంలేదు. పోలీసులు మెడికల్ వాహనాలకు 15 రోజుల వ్యవధితో రవాణాకు అనుమతిస్తే కావాల్సినంత సరుకు కొనుగోలు చేసుకొని వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడగలుగుతామని డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో అత్యవసర మందుల కొరత ఏర్పడడంతో పాటు.. ఇతర దేశాల నుంచి రావాల్సిన రా మెటీరియల్ రాకపోవడంతో... మందుల ఉత్పత్తి పూర్తిగా నిలిపివేశాయి కంపెనీలు. మరో నాలుగు రోజుల వరకే మందులు అందుబాటులో ఉన్నా.. ఆ తర్వాత కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అత్యవసరమైన మందుల సరఫరా కోసం వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని ఆయా ఏజెన్సీలు కోరుతున్నాయి.