మన హెలికాప్టర్ మనమే కూల్చుకున్నాం...నిజం బయటపెట్టిన వాయుసేన 

మన హెలికాప్టర్ మనమే కూల్చుకున్నాం...నిజం బయటపెట్టిన వాయుసేన 

ఆపరేషన్ బాలాకోట్ సమయంలో అతి పెద్ద తప్పిదం జరిగిందని ఎయిర్ ఫోర్స్ నూతన చీఫ్ అంగీకరించారు. శత్రుదేశ విమానంగా పొరపడి మన ఎయిర్ క్రాఫ్ట్ ను మనమే కూల్చుకున్నామని ఆయన ఒప్పుకున్నారు. ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య వైమానిక పోరు జరుగుతున్న సమయంలో బుద్గాంలో ఎమ్ఐ-17 హెలికాప్టర్ కూలింది. అప్పట్లో హెలికాప్టర్ కూలడంలో తమ పాత్ర లేదని పాకిస్తాన్ ప్రకటించింది.

అది మన తప్పిదం వల్లే జరిగిందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదూరియా అంగీకరించారు. ఐఏఎఫ్‌ ప్రయోగించిన క్షిపణి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. దీనిపై ఏర్పాటు చేసిన కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ పూర్తయిందన్నారు. ఆ సమయంలో క్షిపణి ప్రయోగాల్ని నిర్వహిస్తున్న అధికారులు ఎమ్‌ఐ-17 హెలికాప్టర్‌ను శత్రుదేశానికి చెందిన యుద్ధ విమానంగా భావించడమే ప్రమాదానికి దారి తీసిందన్నారు.

ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన సైనికులు, ఓ పౌరుడు మృతి చెందారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రాజౌరీ సెక్టార్లోకి పాక్ విమానాలు చొరబడే ప్రయత్నం చేసినప్పుడు ఎంఐ-17 హెలికాప్టర్ వాటిని విజయవంతంగా తిప్పికొట్టింది. ఆపరేషన్ పూర్తై తిరిగి ఎయిర్ బేస్ కు చేరుకునే సమయంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రయోగించిన క్షిపణి ఢీకొని కుప్పకూలింది. ఆ సమయంలో హెలికాప్టర్ సిబ్బందికి, గ్రౌండ్ కంట్రోల్ తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయని తెలుస్తోంది. హెలికాప్టర్ శత్రువులదా, మనదా అని గుర్తుపట్టే కీలక సాంకేతిక వ్యవస్థ ఆ సమయంలో పనిచేయలేదని చెబుతున్నారు. దీంతో హెలికాప్టర్లో సిబ్బందికి కమ్యూనికేషన్ చేరవేసే అవకాశం లేకుండా పోయిందని సమాచారం.