రివ్యూ: రణరంగం

రివ్యూ: రణరంగం

నటీనటులు: శర్వానంద్‌, కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సుబ్బరాజు తదితరులు 

మ్యూజిక్: ప్రశాంత్ పిళ్ళై

సినిమాటోగ్రఫీ : దివాకర్ మణి 

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం: సుదీర్ వర్మ 

కథలో కొత్తదనం ఉన్నది అంటే ఆ సినిమా చేయడానికి సిద్దపడే నటుల్లో శర్వానంద్ ఒకరు.  శర్వానంద్ అన్నిరకాల జానర్స్ లో సినిమాలు చేశారు.  చేస్తూనే ఉన్నారు.  తాజాగా శర్వానంద్ గ్యాంగ్ స్టర్ కథతో రణరంగం సినిమా చేశారు.  ఇందులో 25 ఏళ్ల కుర్రాడిగా, 45 సంవత్సరాల వ్యక్తిగా కనిపిస్తాడు.  వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా చూద్దాం.  

కథ: 

కథ 1995 నాటి పరిస్థితులకు అనుగుణంగా మొదలౌతుంది.  అప్పట్లో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న రోజులు అవి. విశాఖపట్నంలో శర్వానంద్ బ్లాక్ టిక్కెట్లు అమ్ముతూ స్నేహితులతో కాలక్షేపం చేస్తుంటాడు.  అదే కాలనీలో ఉండే కళ్యాణి ప్రియదర్శినితో ప్రేమలో పడతాడు.  బ్లాక్ టిక్కెట్స్ అమ్మడం వలన వచ్చే డబ్బు తక్కువ.  రిస్క్ ఎక్కువ.  దీంతో సర్వా చూపులు మద్యం వైపుకు మరలుతుంది.  రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది కాబట్టి పక్కరాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి బ్లాక్ లో అమ్మాలని చూస్తాడు.  ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది.  డబ్బులు చేతికి వస్తాయి.  ఒక్కసారి డబ్బులు చేతికి రావడంతో స్నేహితులతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు.  తనను తాను కాపాడుకోవడానికి ధనవంతుడిగా మారే ప్రయత్నం చేస్తాడు శర్వానంద్.  ఇలా తాను ప్రారంభించిన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయి.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు.. వీటిని కోల్పోయాడు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

ఈ సినిమా చూస్తున్నంత సేపు గాడ్ ఫాదర్ ఛాయలు ఉన్నట్టుగా కనిపిస్తుంది.  మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎక్కువగా మాఫియా బ్యాక్ గ్రౌండ్ తో ఉంటాయి.  దర్శకుడు ఇలాంటి కథను ఎంచుకోవడం వెనుక ఆ సినిమా ప్రభావం ఉండొచ్చు. ప్రపంచంలో సూపర్ హిట్టైన చాలా సినిమాల్లోని పాత్రలను ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చాయి.  వాటిని ఇప్పటి తరానికి అనుగుణంగా మార్చుకొని కథలను తయారు చేసుకున్నారు.  చాలా వరకు మెప్పించారు.  ఈ విషయంలో దర్శకుడు సుదీర్ వర్మ కాస్త వెనకబడ్డాడని సినిమా చూస్తే అర్ధం అవుతున్నది.  గాడ్ ఫాదర్, శివ, సత్య, నాయకుడు ఈ సినిమాలన్నీ ఆ కోవకు చెందిన సినిమాలే.  బ్లాక్ టికెట్స్ అమ్మడం, ప్రేమలో పడటం.. ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి.  ఎంటర్టైన్ చేశాయి.  అయితే, ఒకవైపు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి చెప్తూనే..మరోవైపు ప్రస్తుత కథను నడిపించడం అన్నది ఆసక్తిగా ఉన్నా దాన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చి దిద్దలేకపోయారు.  స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండటం సినిమాకు మైనస్ అయ్యింది.  సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు లేకుండా మాములుగా సాగిపోవడంతో పాటు.. సినిమా సాగదీసినట్టుగా ఉండటంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలయ్యారని అనుకోవచ్చు.  తీసుకున్న అంశం బాగుందికాని, దాన్ని ఆసక్తిగా మలచడంలో దర్శకుడు సుదీర్ వర్మ విఫలం అయ్యాడు.  

నటీనటుల పనితీరు: 

ఎప్పటిలాగే శర్వానంద్ తన పాత్రలో మెప్పించాడు.  కుర్రాడిలా, నడివయసు వ్యక్తిగా మంచి నటనను కనబరిచాడు.  హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని అందంగా కనిపించి మెప్పించింది.  కాజల్ పాత్రను బలంగా చూపించవచ్చు.  కానీ, ఆమె పాత్రను పెద్దగా ఉపయోగించలేదు.  మిగిలిన నటీనటులు వారి పాత్రమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

సుదీర్ వర్మ తీసుకున్న కధాంశం బాగున్నా దానిని తెరపై చూపించడంలో కాస్త శ్రద్ద వహిస్తే సినిమా మరోవిధంగా ఉండేది.  సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.  కథ 1995 కాలం నుంచి మొదలౌతుంది కాబట్టి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చూపించాలి.  వాటిని చక్కగా చూపించారు దివాకర్ మణి.  ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ బాగుంది.  

పాజిటివ్ పాయింట్స్: 

కథాంశం 

నటీనటులు 

నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్: 

కథనాలు 

సెకండ్ హాఫ్ 

చివరిగా : ఈ రణరంగం కొందరి కోసమే..