పెళ్లయిన ఆరునెలలకే.. భర్త చేతిలో హతం

పెళ్లయిన ఆరునెలలకే.. భర్త చేతిలో హతం

ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆరునెలలకే శాడిస్ట్ భర్త చేతిలో దారుణహత్యకు గురైంది. ప్రియుడు పెళ్లికి ఒప్పుకోకపోయినా ఇంటి ముందు ఆందోళనకు దిగి మరి తన పంతాన్ని నెగ్గించుకుంది. తన ప్రేమను గెలిపించుకుంది. చివరకు ఆ శాడిస్ట్ భర్త చేతిలోనే తనువు చాలించింది. వివరాల్లోకి వెళ్తే ...నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మల్లెవారిగూడెంకు చెందిన ఎండీ ఆసియా అదే గ్రామానికి చెందిన జంజీరాల శ్రీనివాస్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. తీరా పెళ్లి విషయానికి వచ్చేసరికి శ్రీనివాస్ మొఖం చాటేశాడు. 

దీంతో ఆరునెలల క్రితం ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. గ్రామస్థులు, పోలీసుల జోక్యం చేసుకుని శ్రీనివాస్ ను పెళ్లికి ఒప్పించారు. ఐదునెలల వారి కాపురంలో నిత్యం కలహాలే. ఇంతలోనే ఆసియా గర్భవతి అయ్యింది దీంతో వారిద్దరి మధ్య గొడవలు తారాస్ధాయికి చేరాయి. గర్భం దాల్చిన ఆసియాను అబార్షన్ చేయించుకోవాలని శ్రీనివాస్ ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆసియా పుట్టింటికి చేరుకుంది. 

ఈరోజు మధ్యాహ్నం ఆసియా ఇంటికి వచ్చిన శ్రీనివాస్ ఆమెతో గొడవకు దిగాడు. మాట మాట పెరగడంతో కత్తితో ఆమెపై దాడి చేశాడు. రక్తం మరకలతో బయటిరావడం గమనించిన కుటుంబసభ్యులు ఇంటిలోకి వెళ్లి చూడగా అప్పటికే ఆసియా మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలింపు చేపట్టారు.