అద్దె కారులోనే గ్యాంగ్‌ రేప్..! చేవెళ్ల కేసులో సంచలన అంశాలు..!

అద్దె కారులోనే గ్యాంగ్‌ రేప్..! చేవెళ్ల కేసులో సంచలన అంశాలు..!

హైదరాబాద్‌ శివారులోని చైవెళ్ల దగ్గర గుర్తు తెలియని మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే ఆ మహిళను పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు సైబరాబాద్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. కారులోనే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నాయి. కాగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి పై వంతెన కింద మార్చి 17న ఓ గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. 

అయితే, వివాహం కాకముందు నుంచే మృతురాలు, పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రేమలో ఉన్నారని గుర్తించారు పోలీసులు. ఆమె పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు. పెళ్లి చేసుకుని.. ఎక్కడికైనా దూరంగా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామంటూ ఆమె ఒత్తిడి తెచ్చింది. వేరే అమ్మాయికి దగ్గర కావడంతో.. ఆమెను దూరంగా పెట్టాడు. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో 60 నిమిషాలు జీపీఎస్‌ కీలకంగా మారింది. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామంటూ ఆ మహిళను నమ్మించి కారులో తీసుకొచ్చారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారులోనే ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. దుస్తులు లేకుండానే మృతదేహాన్ని పై వంతెన కిందకు దించారు. గంట పాటు అక్కడే ఉన్నారు. తలను ఛిద్రం చేసిన బండరాయిని తమ వెంట తీసుకెళ్లారు. నిందితులు అద్దెకు తీసుకున్న కారు జీపీఎస్‌ ఈ కేసులో కీలకంగా మారింది. అక్కడి నుంచి ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్‌, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగి ఇంటర్‌ఛేంజ్‌ నుంచి ఓఆర్‌ఆర్‌పైకి చేరారు. ప్రొద్దుటూరు దగ్గర లభించిన సీసీ ఫుటేజీ ద్వారా ఈ ఇద్దరే నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడు దొరికితే మృతురాలికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.