తెలకపల్లి రవి: దృశ్యం 2 కొలమానాలు కొన్ని.. తెలుగులో మారిస్తే మెరుగు

తెలకపల్లి రవి: దృశ్యం 2 కొలమానాలు కొన్ని.. తెలుగులో మారిస్తే మెరుగు

మోహన్‌లాల్‌ మీనా, మురళీరవి తదితరుతో జీతూ జోసెఫ్‌ రూపొందించిన దృశ్యం 2  సీక్వెల్‌ ఘన విజయం సాధించింది, తెలుగులోనూ దాన్ని విక్టరీ వెంకటేశ్‌తో ఆయనే అందిస్తున్నారు. మోహన్‌లాల్‌ను అనుకరించకుండా తనదైన శైలిలో వెంకీ  మొదటి భాగాన్ని విజయవంతం చేశారు గనక ఇదీ విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. అయితే మొదటి భాగంతో పోల్చినపుడు రెండవ భాగంలో జరిగిన కొన్ని మార్పులే చర్చనీయ మవుతున్నాయి. దర్శకుడు హీరో అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు, వివరించారు కూడా. అయితే విజయం లభించిన తర్వాత అవన్నీ పెద్ద ముఖ్యమైనవనిపించవు. కానీ మలయాళం తరహాలో తెలుగు ప్రేక్షకులు తేలిగ్గా తీసుకోరు కనుక వాటిని సమీక్షించుకోవడం ఉత్తమం.
 
దృశ్యంలో అతి గొప్ప విషయమేమంటే హీరోలో హీరోయిజం లేకపోవడం. చాలా సాధారణ మనిషిగా తన కుటుంబాన్ని కాపాడు కోవడం తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. ఈ క్రమంలో తన వల్ల ఎవరూ నష్టపోకుండా కూడా హీరో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. దర్శకుడు సాధారణంగా కథ నడిపిస్తూనే ఎంతో పట్టుగా స్క్రీన్‌ప్లే రూపొందించారు. ప్రత్యేకించి ఉద్వేగాల ప్రదర్శనను చోటివ్వలేదు. కాని రెండవ భాగంలో ఆ మూల సూత్రాలు మారిపోయాయి. హీరో కుటుంబంలో అడుగడుగునా అదే ఉద్వేగం, బయట తను ఏం చేస్తున్నారనేదానిపై  బ్డిప్‌ ఇదే సింహభాగం ఆక్రమించింది. పోలీసుల వేట కొనసాగిస్తున్నారని తెలిసిన కొద్ది ఇదింకా పెరుగుతుంటుంది. ఆ పూర్వరంగంలో అతి స్పష్టంగా అనుమానించాల్సిన విషయాలను కూడా హీరో ఉపేక్షిస్తాడు. లేదా అలా చూపిస్తారు.  కేసు ముందుకు  పోతున్నకొద్ది మూసుకుపోతున్న భావన పెంచి తర్వాత నాటకీయంగా  క్లైమాక్స్‌ ట్విస్ట్‌ తీసుకువస్తారు, అదీ ఒకే గాని ఆ ట్విస్టులో పెద్ద ప్రతిభ ఏమీ ఉండదు. పైగా దాని కోసం మరో ఇద్దరిని ఈ వ్యవహారంలో భాగస్వాములను చేయడం హీరో మొదట పాటించిన సూత్రాలతో పోసిగేది కాదు. భద్రత కూడా  కాదు. మూడో భాగంలో వాటిని మరో విధంగా మార్చి చూపించొచ్చు గాని రెండవ భాగం వరకు అవి బలహీనమని చెప్పాలి. వీటిని మలయాళ ప్రేక్షకులు తీసుకున్నంత తేలికగా తెలుగు వారు తీసుకోలేరేమో... మీమాంస చేస్తారేమో..
          
మీనా లిప్‌స్టిక్‌ పెట్టుకోవడం వంటివాటిపై మలయాళంలో పెద్ద చర్చ చేస్తున్నారు కానీ వాటిని మనవాళ్లు పట్టించుకోక పోవచ్చు, కాని ఆద్యంతం ఒకే ధోరణిలో ప్రవర్తించడం వారంతగా ఇష్టపడరని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో రచయిత ప్రవేశం, ట్విస్ట్‌ ఆవిష్కరించిన తీరు కూడా అంత సుదీర్ఘంగా వారు భరించలేరు.హేమాహేమీలైన నిర్మాతు నాయకుకు ఇవి తెలియవని కాదు గాని అక్కడ హిట్‌ కావడమనే అంశం ప్రధానంగా దృష్టిలో వుంచుకుని ముందుకుపోవచ్చు. అంతకన్నా ఇలాంటి మరికొన్ని కోణాలు కూడా కట్టుదిట్టం చేస్తే కొత్తదనమూ వస్తుంది తెలుగుదనం పండుతుంది.