స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద భారీ భద్రత... 

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద భారీ భద్రత... 

రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రక్షణశాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.  కరోనా మహమ్మారికి సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే, పంద్రాగస్టు వేడుకకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఆహ్వానితులు ఒకచోట గుమిగూడి  ఉండకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసింది.  

ఆహ్వానితులు కూర్చునే ప్రదేశాన్ని ఆవరణాలుగా విభజించింది.  కేటాయించిన సీట్లకు మధ్య గాప్ ఉండేలా రక్షణ శాఖ ఏర్పాట్లు చేసింది.  వేడుక  జరిగే ప్రాంతంలో అదనపు మెటల్ డిటెక్టర్ ద్వారాలను ఏర్పాటు చేసింది.  ఇక గౌరవ వందనం సమర్పించే బృందం సభ్యులను ముందుగానే క్వారంటైన్ లో ఉంచారు.  ఎర్రకోటలో జరిగే వేడుకకు మొత్తం 4000 మందిని ఆహ్వానించినట్టు రక్షణశాఖ పేర్కొన్నది.  ఆహ్వానం ఉన్న వారు మాత్రమే రావాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిబంధనలు పెట్టింది.  వేడుకలు ముగిసిన తరువాత గుంపులుగా వెళ్లకుండా నిబంధనలు పాటిస్తూ వెళ్లేందుకు తగిన ఏర్పాట్లను చేశారు.  ఇక పంద్రాగస్టు వేడుకకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి థర్మల్ స్కానింగ్ చేసిన తరువాత లోనికి పంపుతారు.  కరోనా లక్షలు కనిపిస్తే వారికి చికిత్స అందించేందుకు నాలుగుచోట్ల వైద్యశిబిరాలను ఏర్పాటు చేసినట్టు రక్షణశాఖ తెలిపింది.